సెన్సెక్స్ @: 72000
ABN , Publish Date - Dec 28 , 2023 | 02:44 AM
ఈక్విటీ మార్కెట్లో ర్యాలీ విరామం లేకుండా సాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు కూడా బుల్స్ చెలరేగిపోయాయి. సర్వత్రా కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ చారిత్రక గరిష్ఠ స్థాయిలు నమోదు చేశాయి...
బుల్ జోరుతో మార్కెట్లో రికార్డుల మోత
రూ.2.5 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్ క్యాప్
నాలుగు రోజుల్లో రూ.11.11 లక్షల కోట్లు అప్
ముంబై: ఈక్విటీ మార్కెట్లో ర్యాలీ విరామం లేకుండా సాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు కూడా బుల్స్ చెలరేగిపోయాయి. సర్వత్రా కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ చారిత్రక గరిష్ఠ స్థాయిలు నమోదు చేశాయి. బుధవారం సెన్సెక్స్ 701.63 పాయింట్ల లాభంతో 72038.43 వద్ద ముగియగా నిఫ్టీ 213.40 పాయింట్ల లాభంతో 21654.75 వద్ద క్లోజయింది. ఇంట్రా డేలో సెన్సెక్స్ 72119.85 పాయింట్లు, నిఫ్టీ 21675.75 పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయిలను తాకాయి. ఫలితంగా బీఎ్‌సఈలో లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ బుధవారం ఒక్కరోజే రూ.2.5 లక్షల కోట్లు పెరిగి సరికొత్త రికార్డు రూ.361.41 లక్షల కోట్లకు చేరింది. గత నాలుగు రోజుల ర్యాలీని పరిగణనలోకి తీసుకుంటే మదుపరుల పెట్టుబడుల విలువ రూ.11.11 లక్షల కోట్లు పెరిగింది.
ఎందుకీ జోరు?
బ్యాంకింగ్ షేర్లు: నిన్న మొన్నటి వరకు స్తబ్ధుగా ఉన్న బ్యాంకింగ్ షేర్లు బుధవారం ర్యాలీలో చురుగ్గా పాల్గొన్నాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ 1.17 శాతం లాభంతో ఆల్‌టైమ్ హై 48,282 వద్ద ముగిసింది. గురువారం నాడు కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే బ్యాంక్ నిఫ్టీ 49,000 కీలక మైలుని అధిగమిస్తుందని మార్కెట్ వర్గాల అంచనా. బుధవారం ర్యాలీలో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు రెండు శాతం పెరిగాయి. పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు మూడు నుంచి నాలుగు శాతం లాభంతో ముగిశాయి.
రెడ్ సీ దాడులపై ఓదార్పు: హౌతి తీవ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు ఎర్ర సముద్రంలో భారత్, అమెరికాతో సహా అనేక దేశాలు తమ నౌకాదళాలను మోహరిస్తున్నాయి. దీంతో ప్రధాన నౌకా కంపెనీలు మళ్లీ ఎర్ర సముద్ర ప్రాంతం నుంచి సరుకుల రవాణా ప్రారంభించాయి. ఈ వార్త కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది.
ముడి చమురు ధర: బ్రెంట్ రకం ముడి చమురు ధర బ్యారెల్ 80 డాలర్ల వద్ద స్థిరంగా ఉండడం కూడా భారత మార్కెట్‌కు కలిసొస్తోంది. ఈ ధర కొనసాగితే ద్రవ్యలోటు, మూలధన ఖాతా లోటు (క్యాడ్) అదుపులో ఉంటాయని మార్కెట్ వర్గాల అంచనా.
టెక్నికల్ ఫ్యాక్టర్స్ : నిఫ్టీ 21,500 వద్ద పెద్ద ఎత్తున ‘పుట్స్’ కనిపిస్తున్నాయి. ఆర్‌ఎ్‌సఐ సూచీల ప్రకారం నిఫ్టీ మరింత బుల్లి్‌షగా కనిపిస్తోంది. నిఫ్టీ 21,500 స్థాయిని అధిగమిస్తే 21,750-21,800 మధ్య ట్రేడవుతుందని టెక్నికల్ ఎనలిస్టుల అంచనా. ఒకవేళ దిద్దుబాటు వచ్చినా 21,500 వద్ద నిఫ్టీకి గట్టి మద్దతు లభించవచ్చు.
ఐపీఓల హవా: డిసెంబరు నెల ఐపీఓలకు బాగానే కలిసొచ్చింది. ఈ నెల ఇప్పటి వరకు 12 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.8931 కోట్లు సమీకరించాయి. 2021లో 11 కంపెనీలు సమీకరించిన రూ.9534 కోట్లు ఇప్పటివరకు డిసెంబరు నెల రికార్డు.
ఫెడ్ ఉత్తేజం
వచ్చే ఏడాది మార్చి కంటే ముందే అమెరికా కేంద్ర బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వు’ వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న వార్తలు, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు బూస్ట్‌లా పని చేశాయి. దీంతో జపాన్ నిక్కీ 1.15 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 1.74 శాతం, లండన్ ఎఫ్‌టీఎ్‌సఈ-100 అర శాతం లాభాలతో ముగిశాయి. మంగళవారం వాల్‌స్ట్రీట్ కూడా మంచి లాభాలతో ముగియడం దేశీయ స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది.
శాంతా క్లాజ్ ర్యాలీ ప్రభావం
ప్రస్తుతం మార్కెట్లో ‘సెల్ చైనా, బై ఇండియా’ నినాదం బలంగా వినిపిస్తోంది. దీంతో ఎఫ్‌పీఐలు రెచ్చిపోయి భారత మార్కెట్‌లో కొనుగోళ్లు జరుపుతున్నాయి. ఎన్‌ఎ్‌సడీఎల్ డేటా ప్రకారం చూస్తే ఒక్క డిసెంబరు నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు భారత మార్కెట్‌లో రూ.57,275 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. ఏదైనా ఒక రోజు ఎఫ్‌పీఐలు అమ్మకానికి దిగితే దేశీయ సంస్థాగత మదుపరులు ఆ లోటును భర్తీ చేస్తున్నారు.