కెనరా బ్యాంక్‌ ఎండీగా సత్యనారాయణ రాజు

ABN , First Publish Date - 2023-02-08T01:37:25+05:30 IST

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా కలిదిండి సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. మంగళవారం నుంచే ఈయన నియామకం అమల్లోకి వచ్చింది..

కెనరా బ్యాంక్‌  ఎండీగా సత్యనారాయణ రాజు

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా కలిదిండి సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. మంగళవారం నుంచే ఈయన నియామకం అమల్లోకి వచ్చింది. 2021 మార్చి 10 నుంచి రాజు కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. ఎల్‌వీ ప్రభాకర్‌ స్ధానంలో సత్యనారాయణ రాజును నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 డిసెంబరు 31న ప్రభాకర్‌ పదవీ విరమణ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన రాజు స్థానిక ఎంపీపీ పాఠశాలలో ప్రాథమిక విద్య, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో టెన్త్‌ వరకూ చదువుకున్నారు. ఇంటర్‌ భీమవరం కేజీఆర్‌ఎల్‌ కళాశాల, బీఎస్సీ డీఎన్నార్‌లోనూ, ఎమ్మెస్సీ ఆంధ్రా యూనివర్సిటీలో చదివారు. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, సీఏఐఐబీ (సర్ఠిఫైడ్‌ అసోసియేట్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకర్స్‌) కూడా పూర్తి చేశారు.

1988లో విజయా బ్యాంక్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన సత్యనారాయణ రాజు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)లో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగారు. 33 సంవత్సరాలుగా బ్యాంకింగ్‌ రంగంలో రాజు సుదీర్ఘ సేవలందిస్తున్నారు. ఇందులో 12 సంవత్సరాలు స్పెషలైజ్డ్‌ కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ శాఖల్లో సేవలందించడం విశేషం. కర్ణాటకలోని షిమోగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని హైదరాబాద్‌, మహారాష్ట్రలోని ముంబై జోన్‌లో సత్యనారాయణ రాజు రీజనల్‌ హెడ్‌గా కూడా సేవలందించారు. బ్రాంచ్‌ బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ క్రెడిట్‌, రిటైల్‌ క్రెడిట్‌, అగ్రి ఫైనాన్సింగ్‌, క్రెడిట్‌ మానిటరింగ్‌, క్రెడిట్‌ రికవరీలో సత్యనారాయణ రాజుకు అపారమైన అనుభవం ఉంది.

Updated Date - 2023-02-08T01:40:51+05:30 IST