Rs 500 Notes: 500 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..!

ABN , First Publish Date - 2023-05-30T18:32:47+05:30 IST

2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఎక్కువగా చలామణీ అయిన నోట్ల జాబితాలో 500 రూపాయల నోట్లు ముందు వరుసలో నిలిచాయి. దేశంలో చలామణీ అవుతున్న కరెన్సీ నోట్ల సంఖ్య 13,621 కోట్లు కాగా.. అందులో 5,163 కోట్ల నోట్లు 500 రూపాయల నోట్లే కావడం విశేషం.

Rs 500 Notes: 500 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..!

మన దేశంలో కరెన్సీ నోట్ల వినియోగానికి సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు (Reserve Bank Of India) కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. భారతదేశంలో కరెన్సీ (Indian Currency) వినియోగం 4.4 శాతం పెరిగి.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 13,621 కోట్ల నోట్లు చలామణీలోకి వచ్చాయని ఆర్బీఐ తాజాగా వెల్లడించిన నివేదికలో పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరంలో (FY2023) దేశంలో ఎక్కువగా చలామణీ అయిన నోట్ల జాబితాలో 500 రూపాయల నోట్లు (Rs 500 Notes) ముందు వరుసలో నిలిచాయి. దేశంలో చలామణీ అవుతున్న కరెన్సీ నోట్ల సంఖ్య 13,621 కోట్లు కాగా.. అందులో 5,163 కోట్ల నోట్లు 500 రూపాయల నోట్లే కావడం విశేషం. ఆ తర్వాత దేశంలో ఎక్కువగా చెల్లుబాటులో ఉన్న కరెన్సీగా 10 రూపాయల నోట్లు నిలిచాయి. 2,621 కోట్ల పది రూపాయల నోట్లు మన దేశంలో చలామణీలో ఉన్నాయని, 1,805 కోట్ల 100 రూపాయల నోట్లు భారత్‌లో వినియోగంలో ఉన్నాయని ఆర్బీఐ వార్షిక నివేదికలో వెల్లడించడం గమనార్హం.

ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే.. భారత్‌లో నోట్ల రూపంలో చలామణీ అవుతున్న మొత్తం కరెన్సీ విలువ 33.48 లక్షల కోట్ల రూపాయలు కాగా.. అందులో 77 శాతం షేర్ 500 నోట్లదే కావడం కొసమెరుపు. దీన్ని బట్టి మనకు అర్థమైందేంటంటే.. దేశంలో 500 రూపాయలే నోట్లే ఎక్కువగా చేతులు మారుతున్నాయి. మార్చి 31, 2023 సమయానికి ఆర్బీఐ అధికారిక గణాంకాల ప్రకారం.. వినియోగంలో ఉన్న మొత్తం డబ్బులో 500, 2000 నోట్ల విలువ 87.9 శాతంగా ఉంది. 200 నోట్ల రూపాయలు కూడా 4.6 శాతం పెరుగుదలతో 626 కోట్ల నోట్లు దేశంలో చలామణీలో ఉన్నాయి.

ఏడేళ్ల క్రితం కేంద్రం 1000, 500 రూపాయల నోట్లను వాడకం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మనుగడలో వున్న రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఇటీవల ఆర్‌బీఐ ప్రకటించింది. ఐదు నెలల పాటు ఈ నెల 23 నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు రోజుకు రూ.20 వేలకు తగ్గకుండా రెండు వేల నోట్లను మార్చుకోవచ్చంటూ కస్టమర్లకు ఛాన్స్‌ ఇచ్చింది. 2019 సాధారణ ఎన్నికల్లో రెండు వేల నోట్లు ప్రవాహంలా సాగాయి. ఎవరి చేతిలో చూసినా ఈ నోటే. గులాబీ రంగును పోలిన ఈ నోటును కొందరు ఆ తరువాత నింపాదిగా నొక్కేసినట్టు చెబుతున్నారు. ఆర్‌బీఐ నుంచి బ్యాంకర్లకు ఫ్లో తగ్గింది కాబట్టి మార్కెట్‌లో వున్న రెండు వేల నోట్లు అదృశ్యమైనట్టు సాధారణ జనం భావించారు.

Updated Date - 2023-05-30T18:32:51+05:30 IST