సంపద సృష్టిలో రిలయన్స్ టాప్
ABN , Publish Date - Dec 18 , 2023 | 01:27 AM
స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) హవా కొనసాగుతోంది. గత ఐదేళ్లలో (2018-23) ఈ కంపెనీ షేర్లు మదుపరులకు రూ.9,63,800 కోట్ల సంపద సృష్టించి...
ఆల్ రౌండర్‌గా అదానీ ఎంటర్‌ప్రైజెస్
మోతీలాల్ ఓస్వాల్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) హవా కొనసాగుతోంది. గత ఐదేళ్లలో (2018-23) ఈ కంపెనీ షేర్లు మదుపరులకు రూ.9,63,800 కోట్ల సంపద సృష్టించి పెట్టాయి. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ టాప్ ఆల్‌రౌండ్ వెల్త్ క్రియేటర్‌గా నిలిచినట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. ఈ లెక్కన 2018లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ షేరు గత ఐదేళ్లలో ఏటా 78 శాతం చొప్పున మదుపరులకు లాభాలు పంచింది. స్టాక్ మార్కెట్లో కంపెనీల పనితీరు ఆధారంగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఈ నివేదిక రూపొందించింది.
వరుసగా ఐదోసారి: మదుపరులకు అత్యధికంగా రూ.9,63,800 కోట్ల సంపద సృష్టించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా ఐదోసారీ ఈ జాబితాలో అత్యధిక సంపద సృష్టికర్తగా నిలిచింది. టీసీఎస్ (రూ.6,77,400 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.4,15,500 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.3,61,800 కోట్లు), భారతీ ఎయిర్‌టెల్ (రూ.2,80,800 కోట్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గత ఐదేళ్లలో అత్యంత వేగంగా సంపద సృష్టించిన టాప్ 10 కంపెనీల షేర్లలో రూ.10 లక్షల మదుపు చేస్తే, ఆ పెట్టుబడుల విలువ ఏటా 59 శాతం వృద్ధితో ఇప్పుడు రూ.కోటికి చేరినట్లు నివేదిక తెలిపింది.
తగ్గిన జోరు: కాగా గత ఐదేళ్లలో (2018-23) దేశంలోని టాప్-100 లిస్టెడ్ కంపెనీలు మదుపరులకు రూ.70.5 లక్షల కోట్ల సంపద సృష్టించి పెట్టాయి. అంతకు ముందు ఐదేళ్లలో (2017-22) సృష్టించిన రూ.92.2 లక్షల కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. ఇదే సమయంలో సంపద సృష్టి వేగం కూడా 28 శాతం నుంచి 21 శాతానికి పడిపోయింది. అయితే బీఎ్‌సఈ సెన్సెక్స్ వృద్ధి రేటు 12 శాతంతో పోలిస్తే ఇది తొమ్మిది శాతం ఎక్కువని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది.
కార్ల ధరలు జనవరి ఒకటో తేదీ నుంచి 2 శాతం పెంచుతున్నట్టు స్కోడా ఆటో ఇండియా ప్రకటించింది. పెరిగిన ముడిసరుకు వ్యయాల ప్రతికూల ప్రభావాన్ని తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొంది.
ఇసుజు మోటార్స్ ఇండియా.. దేశవ్యాప్తంగా ఇసుజు ఐ-కేర్ వింటర్ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 23 వరకు ఇసుజు అధీకృత డీలర్ల వద్ద వినియోగదారులు సర్వీస్ బెనిఫిట్స్ పొందవచ్చని పేర్కొంది.
తెలంగాణలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించినట్లు అమెజాన్ ఇండియా వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 120 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కింద కంప్యూటర్ సైన్స్ కాన్సె్‌ప్ట్సను పరిచయం చేయనుంది. ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ శాఖల మద్దతుతో చేపట్టనున్న ఈ కార్యక్రమం ద్వారా 40,000 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుతుందని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఐసీఐసీఐ హోం ఫైనాన్స్ తన కార్యకలాపాలను విస్తరించింది. విస్తరణలో భాగంగా భీమవరం, ఒంగోలు, మచిలీపట్నంలలో కొత్త శాఖలను ఏర్పాటు చేసింది. ఈ శాఖల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం బ్రాంచీల సంఖ్య 11కు చేరిందని వెల్లడించింది.
కాంక్రీట్ ఎక్వి్‌పమెంట్ తయారీదారు అజాక్స్ ఇంజనీరింగ్.. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీలోకి అడుగుపెట్టింది. సొంతంగా 3డీ కాంక్రీట్ ప్రింటివ్ మెషిన్‌ను అభివృద్ధి చేసి విడుదల చేసింది. ఈ టెక్నాలజీతో మూడు రోజుల్లో 350 చదరపు మీటర్ల ఇంటిని నిర్మించింది.