Reliance: ఈ–కామర్స్‌లో రిలయన్స్‌దే హవా
ABN , First Publish Date - 2023-05-26T04:57:57+05:30 IST
భారత ఈ––కామర్స్ రంగంలో ముకేశ్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌దే హవా అని ప్రముఖ అంతర్జాతీయ పెట్ట్టుబడుల నిర్వహణ సంస్థ బెర్న్‌స్టీన్ రీసెర్చ్ ఒక నివేదికలో స్పష్టం చేసింది.

కలిసి రానున్న రిటైల్, టెలికాం, డిజిటల్ మీడియా
రెండేళ్లలో రూ.12.41 లక్షల కోట్లకు ఈ–కామ్ మార్కెట్
బెర్న్‌స్టీన్ రీసెర్చ్ వెల్లడి
న్యూఢిల్లీ: భారత ఈ––కామర్స్ రంగంలో ముకేశ్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌దే హవా అని ప్రముఖ అంతర్జాతీయ పెట్ట్టుబడుల నిర్వహణ సంస్థ బెర్న్‌స్టీన్ రీసెర్చ్ ఒక నివేదికలో స్పష్టం చేసింది. అమెజాన్, వాల్‌మార్ట్ వంటి అంతర్జాతీయ దిగ్గజాల నుంచి పోటీ ఉన్నా రిలయన్స్ రిటైల్ విస్తృత స్టోర్స్ నెట్‌వర్క్, టెలికాం, డిజిటల్ మీడియా రంగాల్లో ఉన్న గట్టి పట్టు ఈ విషయంలో రిలయన్స్‌కు కలిసి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం భారత రిటైల్ రంగం రిలయన్స్–అమెజాన్ –వాల్‌మార్ట్‌ల గుత్తాధిపత్యంలో ఉందని పేర్కొంది. అయితే 43 కోట్ల మంది టెలికాం ఖాతాదారులు, 18,300 రిటైల్ స్టోర్లు, విస్తృత డిజిటల్ మీడియా నెట్‌వర్క్‌తో ఈ–కామర్స్ రంగంలో మిగతా కంపెనీలతో పోలిస్తే రిలయన్స్ ముందుందని బెర్న్‌స్టీన్ నివేదిక అంచనా వేసింది.
రిటైల్‌లో నాలుగు లక్షల మంది
రిలయన్స్ గ్రూప్ రిటైల్ విభాగంలో ఇప్పటికే నాలుగు లక్షల మందికిపైగా పని చేస్తున్న విషయాన్ని బెర్న్‌స్టీన్ నివేదిక గుర్తు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఈ విభాగంలో 66,500 మంది తప్పుకుంటే.. కొత్తగా 69,000 మంది చేరినట్టు తెలిపింది. మరో రెండేళ్లలో భారత ఈ–కామర్స్ మార్కెట్ 15,000 కోట్ల డాలర్ల (ప్రస్తుత డాలర్–రూపాయి మారకం రేటు ప్రకారం సుమారు రూ.12.41 లక్షల కోట్లు) స్థాయికి చేరుతుందని అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లలో ఆన్‌లైన్ కొనుగోళ్లూ రెండింతలవుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ విషయంలో ముందున్నా, రిలయన్స్ త్వరలోనే భారత ఈ–కామర్స్ రంగంలో స్పష్టమైన ఆధిపత్యం సాధించే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్ నివేదిక స్పష్టం చేసింది.
భారీ వాల్యుయేషన్స్
రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) పెట్టుబడుల విలువనూ బెర్న్‌స్టీన్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌కు రిలయన్స్ రిటైల్ ఈక్విటీలో ఉన్న 85 శాతం వాటా విలువ 11,100 కోట్ల డాలర్లు (సుమారు రూ.9.18 లక్షల కోట్లు), రిలయన్స్ జియో ఈక్విటీలో ఉన్న 66.5 శాతం వాటా విలువ 8,800 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,28 లక్షల కోట్లు) మేర ఉండే అవకాశం ఉందని తెలిపింది. 2020లో రిలయన్స్ రిటైల్ ఈక్విటీలో 10.1 శాతం వాటా అమ్మకం ద్వారా 600 కోట్ల డాలర్లు, రిలయన్స్ జియో ఈక్విటీలో 33 శాతం అమ్మకం ద్వారా 2,000 కోట్ల డాలర్లు ఆర్‌ఐఎల్ సమీకరించింది. త్వరలో ఈ రెండు కంపెనీలను ఆర్‌ఐఎల్ నుంచి వేరు చేసి పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలని భావిస్తోంది.