ఐటీలో తగ్గిన నియామకాలు..
ABN , Publish Date - Dec 18 , 2023 | 01:10 AM
ఐటీ రంగంలో సంక్షోభం ముంచుకొస్తోంది. కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే తప్ప....
టీమ్‌లీజ్
ఇంజనీరింగ్‌పై తగ్గుతున్న మోజు
ముంబై: ఐటీ రంగంలో సంక్షోభం ముంచుకొస్తోంది. కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే తప్ప, కొత్త ప్రాజెక్టుల జోరు పెరిగే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలే చెబుతున్నాయి. దీంతో ఐటీ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు 40 నుంచి 50 శాతం తగ్గించాయి. ఈ ప్రభావం బీఈ, బీటెక్ చదివే విద్యార్థుల మీదా పడుతోంది. 2022లో బీఈ, బీటెక్ పాస్ అయిన విద్యార్థుల్లో 26 శాతం మందికి ఐటీ కంపెనీలు ప్లేస్‌మెంట్ ఆఫర్లు ఇచ్చాయి. ఈ సంవత్సరం అది 10 శాతం మించదని అంచనా. దీంతో గత కొద్ది సంవత్సరాలుగా ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ ఒక నివేదికలో తెలిపింది. 2016-17లో బీటెక్ కోర్సులో 40 లక్షల మంది విద్యార్థులు చేరితే 2020-21 నాటికి అది 36 లక్షలకు పడిపోయిందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతి శర్మ చెప్పారు.
40 శాతం తగ్గనున్న నియామకాలు
కాగా ఒక నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ రంగంలో నియామకాలు 40 శాతం తగ్గనున్నాయి. దీనికి తోడు రెండు లక్షల మంది ఐటీ ఉద్యోగుల కొలువులు (4 శాతం) ప్రమాదంలో పడ్డాయని శర్మ చెప్చారు. అయితే ఇదంతా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం క్యాంపస్ ప్లేస్‌మెంట్లు 9 శాతం తగ్గితే, ఈ ఆర్థిక సంవత్సరం మరో 5 శాతం తగ్గే ప్రమాదం ఉందని కూడా ఆమె చెప్పారు. కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సరికొత్త కోర్సులు చేసిన ఫ్రెషర్స్‌కు మాత్రం ఐటీ కంపెనీలు స్వాగతం పలుకుతున్నాయి.