Rs2000 notes: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.2 వేల నోటు ఉపసంహరణ

ABN , First Publish Date - 2023-05-19T19:19:48+05:30 IST

రూ.2000 నోటు చలామణిపై సందేహాలకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) చెక్ పెట్టింది. ఈ పెద్ద నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు నోట్ల జారీని తక్షణమే నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

Rs2000 notes: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.2 వేల నోటు ఉపసంహరణ

ముంబై: రూ.2000 నోటు చలామణిపై సందేహాలకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) చెక్ పెట్టింది. ఈ పెద్ద నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు నోట్ల జారీని తక్షణమే నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే సెప్టెంబర్ 30, 2023 వరకు ఈ నోటు చట్టబద్ధంగానే చెల్లుబాటు అవుతుంది. అయితే ఇప్పటికే ఎవరి వద్దయినా నోట్లు ఉంటే సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల వద్ద మార్చుకోవచ్చు. ఒక్కో విడతలో రూ.20 వేల విలువైన నోట్లను ఎక్స్చేంజ్ చేసుసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. అకౌంట్‌లో జమ చేసుకోవచ్చు లేదా ఇతర నోట్లతో మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రకటనలో స్పష్టం చేసింది. ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2 వేల నోటును చెలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ వెల్లడించింది.

కాగా రూ.2000 నోట్లు నవంబర్ 2016లో ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 24(1) కింద చెలామణిలోకి తీసుకొచ్చారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఈ నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అవసరాలకు తగ్గట్టు కరెన్సీ లభ్యతే లక్ష్యంగా ఈ నోట్లను ప్రవేశపెట్టారు. అయితే 2018-19 నుంచి ప్రింటింగ్ నిలిపివేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. చెలామణిలోకి వచ్చిన రెండు వేల రూపాయల నోట్లలో 89 శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి. 31 మార్చి 31 నాటికి గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 31 మార్చి 2023 నాటికి ఈ విలువ రూ.3.62 లక్షల కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీలో ఈ విలువ 10.8 శాతంగా ఉంది.

అకౌంట్లలో జమ చేసుకునేవారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. నిబంధనలేమీ వర్తించవు. కాగా బ్యాంకుల వద్ద ఎలాంటి అవాంతరాలు లేకుండా రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు రూ.20 వేల వరకు రెండు వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 30, 2023 వరకే ఈ ఎక్స్చేంజ్‌కు అవకాశం ఉంటుంది.

Updated Date - 2023-05-19T19:58:30+05:30 IST