పబ్లిక్‌ ఇష్యూలు తగ్గాయ్‌..

ABN , First Publish Date - 2023-03-31T01:54:48+05:30 IST

సెకండరీ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రైమరీ మార్కెట్లోనూ సందడి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా నిధుల సమీకరణ అంతక్రితం...

పబ్లిక్‌ ఇష్యూలు తగ్గాయ్‌..

  • ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.52,116 కోట్లకు పరిమితమైన ఐపీఓ నిధుల సమీకరణ

  • 2021-22తో పోలిస్తే సగానికి పైగా తగ్గిన విలువ

ముంబై: సెకండరీ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రైమరీ మార్కెట్లోనూ సందడి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా నిధుల సమీకరణ అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోలిస్తే సగానికి పైగా తగ్గింది. 2021-22లో 53 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా మొత్తం రూ.1,11,547 కోట్లు సమీకరించాయి. ఐపీఓల నిధుల సమీకరణలో ఆల్‌టైం గరిష్ఠ స్థాయిది. కాగా, 2022-23లో కేవలం 37 కంపెనీలు రూ.52,116 కోట్లు సమీకరించాయి. ఇందులో 39 శాతం వాటా ఎల్‌ఐసీదేనని ప్రైమ్‌ డేటాబేస్‌ ఎండీ ప్రణవ్‌ హల్దియా అన్నారు. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజమైన ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫరింగ్‌ ద్వారా రూ.20,577 కోట్లు పోగేసింది. ఐపీఓ ద్వారా నిధుల సమీకరణలో ఇప్పటివరకిదే అతిపెద్ద మొత్తం. ఎల్‌ఐసీ ఇష్యూను మినహాయిస్తే, మొత్తం నిధుల సేకరణ రూ.31,559 కోట్లకే పరిమితమయ్యేదని హల్దియా అన్నారు. అయితే, 2022-23లో నమోదైన వార్షిక పబ్లిక్‌ ఆఫరింగ్‌ల నిధుల విలువ మూడో అత్యధికమని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-03-31T01:54:48+05:30 IST