రూపాయిపై ఒత్తిడి తప్పదు

ABN , First Publish Date - 2023-02-01T04:17:48+05:30 IST

ఎగుమతులు స్తబ్దంగా ఉండడంతో పాటు కరెంట్‌ ఖాతా లోటు పెరగడం వల్ల దేశీయ కరెన్సీ రూపాయిపై ఒత్తిడి తప్పదు...

రూపాయిపై ఒత్తిడి తప్పదు

ఎగుమతులు స్తబ్దంగా ఉండడంతో పాటు కరెంట్‌ ఖాతా లోటు పెరగడం వల్ల దేశీయ కరెన్సీ రూపాయిపై ఒత్తిడి తప్పదు. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అంచనాల ప్రకారం వాణిజ్య లోటు పెరిగిన కారణంగా క్యాడ్‌ సెప్టెంబరు చివరి నాటికి జీడీపీలో 4.4 శాతానికి చేరింది. రాజకీయ, భౌగోళిక పరిణామాలు, అమెరికన్‌ ఫెడరల్‌ కఠిన ద్రవ్యవిధానం కారణంగా ఒక దశలో అమెరికన్‌ డాలర్‌ మారకంలో రూపాయి 83 కన్నా కూడా దిగజారింది. ప్రస్తుతం 81.88 వద్ద ట్రేడవుతోంది. కరెంట్‌ ఖాతా లోటు పెరిగిన కొద్ది రూపాయి మరింత ఒత్తిడికి గురి కాక తప్పదు.

ఆర్థిక క్రమశిక్షణ

వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉండేలా చూసి సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడాలంటే ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించక తప్పదు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. క్రమశిక్షణ పాటించినట్టయితే విద్య, కారు, గృహ, వ్యాపార రుణాలన్నీ తక్కువ వడ్డీకే అందుబాటులో ఉంటాయి. ఈ బడ్జెట్‌లో మధ్య తరగతికి పన్ను రాయితీలు, మినహాయింపులు పెంచే ఆస్కారం ఉన్నదన్న ఊహాగానాలను ఇది నీరుగార్చేదిగా ఉంది.

పెట్టుబడి వ్యయాలు

ఈ ఏడాదికి నిర్దేశించుకున్న రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాల లక్ష్యం పూర్తి కావచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల కాలంలోను కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలు (క్యాపెక్స్‌) 63.4 శాతం పెరిగాయి. అవి ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజంగా నిలిచాయి. కార్పొరేట్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో ప్రైవేటు పెట్టుబడులు కూడా స్థిరంగా పెరగవచ్చు. వీటన్నింటి ప్రభావం వల్ల ఆర్థిక ఉత్పాదకత క్యాపెక్స్‌కు నాలుగు రెట్లు పెరిగే ఆస్కారం కనిపిస్తోంది. రాష్ర్టాలు కూడా పెట్టుబడి ప్రణాళికల విషయంలో మెరుగైన స్థితిలోనే ఉన్నాయి.

పన్ను ఆదాయాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల కాలంలో స్థూల పన్ను ఆదాయాలు బడ్జెట్‌ అంచనాల్లో 65 శాతం అంటే రూ.17.81 లక్షల కోట్లున్నాయి. ఇందులో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8.67 లక్షల కోట్లుండగా పరోక్ష పన్ను వసూళ్లు రూ.8.91 లక్షల కోట్లు. కార్పొరేట్‌, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ఇందుకు మద్దతు ఇచ్చాయి. స్థూల పన్ను వసూళ్లలో సుమారుగా సగం వాటా గల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నవంబరు నాటికి 26 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జీఎ్‌సటీ వసూళ్లు నవంబరు నాటికి రూ.5.57 లక్షల కోట్లున్నాయి. పూర్తి ఏడాది బడ్జెట్‌ అంచనా రూ.7.80 లక్షల కోట్లలో ఇది 71.5 శాతంతో సమానం.

తగ్గిన కార్పొరేట్‌ నిధుల సమీకరణ

భారత కంపెనీలు ఈక్విటీ, రుణ ఉపకరణాల ద్వారా సమీకరించిన నిధుల పరిమాణం 2022 ఏప్రిల్‌-నవంబరు నెలల మధ్య కాలంలో రూ.5.06 లక్షల కోట్లుంది. ముందు ఏడాది ఇదే కాలంలో సమీకరించిన నిధుల కన్నా ఇది 8.5 శాతం తక్కువ.

Updated Date - 2023-02-01T04:17:49+05:30 IST