రెండింతలు పెరిగిన వ్యక్తిగత అప్పులు
ABN , First Publish Date - 2023-09-22T01:44:01+05:30 IST
భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో నికర వ్యక్తిగత పొదుపు పడిపోతోంది. ఇదే సమయంలో అప్పులు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి. 2021 మార్చి నాటికి జీడీపీలో 11.5 శాతంగా ఉన్న ఈ పొదుపు 2023 మార్చి నాటికి 5.1 శాతానికి (రూ.6.7 లక్షల కోట్లు) పడిపోయింది...
రెండేళ్లలోనే అప్పులు రెట్టింపు
2023 మార్చి నాటికి రూ.15 లక్షల కోట్లకు చేరిక
సగానికి పైగా పడిపోయిన పొదుపు.. 50 ఏళ్ల కనిష్ఠ స్థాయి ఇది
ఎస్‌బీఐ రీసెర్చ్ వెల్లడి
ముంబై: భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో నికర వ్యక్తిగత పొదుపు పడిపోతోంది. ఇదే సమయంలో అప్పులు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి. 2021 మార్చి నాటికి జీడీపీలో 11.5 శాతంగా ఉన్న ఈ పొదుపు 2023 మార్చి నాటికి 5.1 శాతానికి (రూ.6.7 లక్షల కోట్లు) పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 55 శాతం తక్కువ. జీడీపీలో వ్యక్తిగత పొదుపు ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం గత 50 సంవత్సరాల్లో ఇదే మొదటిసారని ఎస్‌బీఐ రీసెర్చ్ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. వ్యక్తులు, ప్రభుత్వేతర, నాన్-కార్పొరేట్, లాభాపేక్షలేని సంస్థలు, భాగస్వామ్య సంస్థల పొదుపుని వ్యక్తిగత పొదుపుగా వ్యవహరిస్తారు. కొవిడ్‌కు ముందున్న 2019-20 ఆర్థిక సంవత్సరంలోనూ వ్యక్తిగత పొదుపు ఈ స్థాయికి పడిపోలేదు. అప్పుడు కూడా ఈ పొదుపు జీడీపీలో 7.6 శాతంగా నమోదైంది. కొవిడ్ సమసిపోయి ఆర్థిక వ్యవస్థ గాడిలోపడినా జీడీపీలో వ్యక్తిగత పొదు పు యాభై ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం గమనార్హం.
రెట్టింపైన అప్పులు: ఇదే సమయంలో వ్యక్తిగత అప్పులు మాత్రం రెట్టింపయ్యాయని ఎస్‌బీఐ రీసెర్చ్ తెలిపింది. 2021 మార్చి నాటికి రూ.8.2 లక్షల కోట్లుగా ఉన్న ఈ రుణ భారం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.15.6 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. జీడీపీలో ఇది 5.8 శాతానికి సమానం. 2021-22లో ఇది 3.8 శాతం మాత్రమే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.15.6 లక్షల కోట్ల అప్పుల్లో రూ.7.1 లక్షల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులని ఎస్‌బీఐ గ్రూప్ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ చెప్పారు. మళ్లీ ఈ అప్పుల్లో మూడింట రెండు వంతులు గృహ, విద్యా, వాహన కొనుగోళ్ల రుణాలు. గత ఏడాది మార్చి వరకు దేశంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం ఇందుకు బాగా కలిసొచ్చింది.
పెట్టుబడుల్లోనూ మార్పు: గతంలో చేతిలో నాలుగు డబ్బులు ఉంటే మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజలు బ్యాంక్ డిపాజిట్లు, షేర్ మార్కెట్, బీమా పాలసీల వంటి ఫైనాన్షియల్ అసెట్స్‌లో మదుపు చేసేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా నగనట్రా, నివాస స్థలాలు, భవనాలు కొనేందుకు వినియోగిస్తున్నారు. మళ్లీ ఇందులో 80-90 శాతం స్థిరాస్తుల కొనుగోలుకే పోతోంది. ఈ రంగంలో ఆస్తులు విలువ పెరుగుదల వేగంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణమని ఘోష్ తెలిపారు.
ఏ మాత్రం ఆందోళన లేదు : ఆర్థిక శాఖ
జీడీపీలో వ్యక్తిగత పొదుపు పడిపోవడంపై వస్తున్న విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తేలిగ్గా తీసుకుంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఏ మాత్రం ఉండదని పేర్కొంది. బ్యాంక్ డిపాజిట్లు, షేర్ మార్కెట్ పెట్టుబడులు, బీమా పాలసీ వంటి ఫైనాన్షియల్ ఆస్తులు, స్థిరాస్తులపై పెట్టుబడులు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. దీనిపై పెద్దగా గాభరా పడాల్సిందేమీ లేదని స్పష్టం చేసింది.