పని వేళల్లో కాసేపు కునుకు అవసరమే..
ABN , Publish Date - Dec 17 , 2023 | 01:16 AM
పనివేళల్లో చిన్న నిద్ర బ్రేక్ అవసరమని మెజారిటీ ఉద్యోగులు భావిస్తున్నట్లు ఓ సర్వే నివేదిక వెల్లడించింది. కాసేపు కునుకు తీయడం ద్వారా అలసట దూరమవడంతోపాటు...
మెజారిటీ ఉద్యోగుల మనోగతమిదే..
జీనియస్ కన్సల్టెంట్ సర్వేలో వెల్లడి
ముంబై: పనివేళల్లో చిన్న నిద్ర బ్రేక్ అవసరమని మెజారిటీ ఉద్యోగులు భావిస్తున్నట్లు ఓ సర్వే నివేదిక వెల్లడించింది. కాసేపు కునుకు తీయడం ద్వారా అలసట దూరమవడంతోపాటు పని సామర్థ్యం పెంపునకు, ఆరోగ్య శ్రేయస్సుకు ఇది దోహదపడుతుందని ఉద్యోగులు విశ్వసిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. మానవ వనరులను సమకూర్చే సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ‘‘జపాన్‌లో పనిచేసే చోటే కాసేపు నిద్ర పోయే సంప్రదాయం చాలాకాలంగా కొనసాగుతోంది. ఆరోగ్యకరమైన పని సంస్కృతికిది కీలకమ’’ని సంస్థ అంటోంది. ఈ ఏడాది సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 27 మధ్య కాలంలో ఆయా రంగాల్లో పని చేస్తున్న 1,207 మంది ఉద్యోగులను సర్వే చేసినట్లు తెలిపింది. అందులో 94 శాతం మంది చిన్న నిద్ర బ్రేక్ కీలకమని అభిప్రాయపడ్డారు. కేవలం 3 శాతమే ఈ భావనతో విబేధించినట్లు రిపోర్టు వెల్లడించింది. మరిన్ని వివరాలు..
కాసేపు కునుకు తీయడం ద్వారా పని సామర్థ్యం పెరుగుతుందని 82 శాతం అభిప్రాయపడగా.. 12 శాతం విబేధించారు.
పని సమయంలో అధిక ఆయాసం, అలసటకు గురైనట్లు 60 శాతం వెల్లడించగా.. 27 శాతం మంది తమకలాంటి అనుభవం ఎప్పుడూ కలగలేదన్నారు.
పని వేళల్లో గంట సేపు నిద్ర బ్రేక్‌కు అనుమతిస్తే, పని గంటలను మరో గంట పెంచడం తమకు సమ్మతమేనని సర్వేలో పాల్గొన్న 49 శాతం మంది పేర్కొనగా.. 36 శాతం మంది మాత్రం ఇందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.
నిద్ర బ్రేక్ పనిలో సంతృప్తితోపాటు ఆరోగ్య శ్రేయస్సుకు తోడ్పడుతుందని 78 శాతం భావిస్తున్నారు. కాగా, వృత్తి-వ్యక్తిగత జీవన సమతుల్యానికి దోహదపడుతుందని 64 శాతానికి పైగా మంది అభిప్రాయపడ్డారు. 21 శాతం ఉద్యోగులు మాత్రం నిద్ర బ్రేక్‌తో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.