గుజరాత్‌లో మైక్రాన్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2023-06-23T02:02:31+05:30 IST

కంప్యూటర్‌ స్టోరేజీ చిప్స్‌ తయారీలోని మైక్రాన్‌.. గుజరాత్‌లో సెమీ కండక్టర్ల అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌ ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాంట్‌పై కంపెనీ 27.5 కోట్ల డాలర్లు (రూ.22,540 కోట్లు) ఇన్వెస్ట్‌ ...

గుజరాత్‌లో మైక్రాన్‌ ప్లాంట్‌

రూ.22,500 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: కంప్యూటర్‌ స్టోరేజీ చిప్స్‌ తయారీలోని మైక్రాన్‌.. గుజరాత్‌లో సెమీ కండక్టర్ల అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌ ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాంట్‌పై కంపెనీ 27.5 కోట్ల డాలర్లు (రూ.22,540 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనుంది. రెండు దశల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్‌పై పెట్టుబడిలో రూ.6,760 కోట్లు మైక్రాన్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంటే మిగతా మొత్తాన్ని ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టనుంది. తొలి దశ నిర్మాణం ఈ ఏడాది ప్రారంభమై వచ్చే ఏడాదికి పని ప్రారంభిస్తుందని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది. తొలి దశలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్లాంట్‌ను నిర్మిస్తారు. ఈ ప్లాంట్‌ రాబోయే పలు సంవత్సరాల్లో 5 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, 15 వేల కమ్యూనిటీ ఉద్యోగాలు కల్పిస్తుందని అంచనా. రెండో దశ ప్లాంట్‌ నిర్మాణం దశాబ్ది ద్వితీయార్ధంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ డిమాండ్‌ ధోరణులకు అనుగుణంగా ప్లాంట్‌ సామర్థ్యాన్ని విస్తరిస్తారు. స్థానికంగా సెమీ కండక్టర్లు తయారుచేసేందుకు భారత్‌ సృష్టించిన అనువైన వాతావరణం పట్ల మైక్రాన్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ సంజయ్‌ మెహరోత్రా సంతృప్తి ప్రకటించారు. ఈ ప్లాంట్‌తో ప్రపంచంలో తమ తయారీ పరిధి విస్తరించడంతో పాటు భారత్‌లోని కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించగలుగుతామన్నారు. ‘‘మాడిఫైడ్‌ అసెంబ్లీ, టెస్టింగ్‌, మార్కింగ్‌, ప్యాకేజింగ్‌ (ఏటీఎంపీ) స్కీమ్‌’’ కింద ఈ ప్లాంట్‌కు అనుమతి ఇచ్చింది.

Updated Date - 2023-06-23T02:02:40+05:30 IST