మెరిసె...మెరిసె రూ.61,000 దాటిన బంగారం
ABN , First Publish Date - 2023-04-06T02:15:27+05:30 IST
బులియన్ మార్కెట్లో బంగారం ధగధగలాడుతోంది. ఏ రోజుకారోజు కొత్త రికార్డులతో హోరెత్తి స్తోంది. బంగారం, వెండి ధరలు సగటు ప్రజలకు అందని స్థాయిలో దూసుకుపోతున్నాయి...
హైదరాబాద్‌లో రూ.61,360
రూ.80,000 మించిన వెండి ధర
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్లో బంగారం ధగధగలాడుతోంది. ఏ రోజుకారోజు కొత్త రికార్డులతో హోరెత్తి స్తోంది. బంగారం, వెండి ధరలు సగటు ప్రజలకు అందని స్థాయిలో దూసుకుపోతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బుధవారం 10 గ్రాముల మేలిమి బంగారం రూ.61,000 దాటి పోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో మరో ఆల్‌టైమ్ హై రూ.61,360కు చేరింది. మంగళవారంతో పోలిస్తే ఇది రూ.1,030 ఎక్కువ. కిలో వెండి ధర సైతం ఏకంగా రూ.2,900 పెరిగి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.80,700కు చేరింది.
కారణాలు
పసిడి ధర చుక్కలంటడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మార్చి నెలలో అమెరికాలో ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో పెరగక పోవడం, ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు ఇక దూకుడుగా పెంచకపోవచ్చన్న అంచనాలు, అధిక ద్రవ్యోల్బణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరిసిస్తోందన్న వార్తలు ప్రస్తుతం బులియన్ మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరితో పోలిస్తే దేశీయ మార్కెట్‌లో పసిడి ధర ఏడు శాతం పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకంరేటు బక్కచిక్కడం కూడా మరో ప్రధాన కారణం.
ఇతర నగరాల్లో
దేశంలోని మిగతా ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. బంగారం ఢిల్లీలో రూ.61,080కుచేరి సరికొత్త రికార్డు సృష్టించింది. మంగళవారంతో పోలిస్తే ఇది రూ.1,025 ఎక్కువ. కిలో వెండి ధర కూడా రూ.1,810 లాభంతో రూ.73,950కు చేరింది. హైదరాబాద్‌తో పోలిస్తే ఢిల్లీలో కిలో వెండి ధర రూ.6,750 తక్కువగా ఉండడం విశేషం. ముంబై మార్కెట్‌లో మాత్రం పది గ్రాముల మేలిమి బంగారం ఇంకా రూ.61,000 లోపే ఉంది. కిలో వెండి ధర బుధవారం రూ.73,830 వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుధవారం ఒక దశలో న్యూయార్క్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,043.70 డాలర్ల రికార్డు స్థాయికి చేరింది. తర్వాత కొద్ది సేపటికే మళ్లీ 2,027 డాలర్లకు దిగొచ్చింది.
ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ పైకే
ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ పసిడి ధర దూసుకుపోతోంది బుధవారం మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్‌లో జూన్ డెలివరీ పసిడి ధర 10 గ్రాములు రూ.61,120కి చేరింది. మంగళవారంతో పోలిస్తే ఇది రూ.166 ఎక్కువ. స్పాట్‌మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో స్పెక్యులేటర్లు ఫ్యూచర్స్ ట్రేడ్‌లో భారీగా పొజిషన్లు తీసుకుంటున్నారు. బుధవారం ఒక్క రోజే ఎంసీఎక్స్‌లో 19,286 లాట్ల టర్నోవర్ నమోదైంది.