ఎల్ అండ్ టీ లాభం 3,987 కోట్లు
ABN , First Publish Date - 2023-05-11T02:19:12+05:30 IST
దేశీయ ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అనుబంధ సంస్థలతో కలిసి రూ.3,987 కోట్ల నికర లాభం ఆర్జించింది...
ఒక్కో షేరుపై రూ.24 తుది డివిడెండ్
న్యూఢిల్లీ : దేశీయ ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అనుబంధ సంస్థలతో కలిసి రూ.3,987 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కు వ. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.58,335 కోట్లకు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా ఎల్ అండ్ టీ గ్రూప్ ఆదాయం రూ.1.83 లక్షల కోట్లకు చేరింది. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ. వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.24 చొప్పున తుది డివిడెండ్ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
రికార్డు స్థాయిలో ఆర్డర్లు: ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎల్ అండ్ టీ గ్రూప్ రూ.2,30,528 కోట్ల విలువైన ఆర్డర్లు సంపాదించింది. అంతకు ముందు సం వత్సరంతో పోలిస్తే ఇది 19 శాతం ఎక్కువ. ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆర్డర్ల విలువ రూ.2 లక్షల కోట్లు మించడం ఇదే తొలిసారని కంపెనీ ఎండీ, సీఈఓ ఎస్.ఎన్.సుబ్రమణియన్ చెప్పారు. దీంతో మార్చి, 2023 నాటికి ఎల్ అండ్ టీ గ్రూప్ చేతిలో ఉన్న ఆర్డర్ల విలువ గతంలో ఎన్న డూ లేని విధంగా రూ.4 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపారు.
గౌరవ చైర్మన్‌గా నాయక్
ఎల్ అండ్ టీని అతి పెద్ద కంపెనీగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏ.ఎం.నాయక్ ఈ ఏడాది సెప్టెంబరు 30న ఆ పదవి నుంచి తప్పుకుంటున్నారు. అయితే కంపెనీకి ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఆయన్ని అక్టోబరు 1 నుంచి కంపెనీ గౌరవ చైర్మన్‌గా కొనసాగించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం కంపెనీ ఎండీ, సీఈఓగా ఉన్న ఎస్.ఎన్.సుబ్రమణియన్ పదవిని అక్టోబరు 1 నుంచి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా మార్పు చేయాలని కూడా బోర్డు సిఫారసు చేసింది.