తెలంగాణలో 30 ప్రాజెక్టులకు రుణాలు
ABN , First Publish Date - 2023-05-26T04:51:37+05:30 IST
ఇండియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఐఎఫ్‌సీఎల్) తెలంగాణలో దాదాపు 30 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చింది.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇండియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఐఎఫ్‌సీఎల్) తెలంగాణలో దాదాపు 30 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.40,017 కోట్లని ఐఐఎఫ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ జయశంకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో జీఎంఆర్ హైదరాబాద్–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేస్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఐఎఫ్‌సీఎల్ మౌలిక సదుపాయాల రంగానికి చెందిన వివిధ విభాగాల్లోని ప్రాజెక్టులకు రుణాలు ఇస్తుంది. హైదరాబాద్‌లో ఐఐఎఫ్‌సీఎల్ స్టేక్ హోల్డర్ల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణాలో మరిన్ని ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చే సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఐపీఓకు వచ్చే యోచన:
వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి పబ్లిక్ ఇష్యూ కు వచ్చే ఆలోచన ఉందని, ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని జయశంకర్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.30,000 కోట్ల రుణాలను మంజూరు చేశామని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది దాదాపు రూ.50,000 కోట్లకు చేరగలదని చెప్పారు.