వ్యక్తిగత రుణాల ఎంపికలో వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజే కీలకం
ABN , First Publish Date - 2023-06-11T01:45:10+05:30 IST
ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎప్పుడు ఏ ఆర్థిక అవసరం తరుముకొస్తుందో తెలియని స్థితి. దీంతో మధ్య తరగతి ప్రజలకి ఈ రోజుల్లో అప్పు ఓ అవసరంగా మారింది. అలా అని ఎలా పడితే అలా అప్పు చేయలేం. వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు వంటి అనేక అంశాలను పరిశీలించిగానీ అప్పు చేయలేం....
ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎప్పుడు ఏ ఆర్థిక అవసరం తరుముకొస్తుందో తెలియని స్థితి. దీంతో మధ్య తరగతి ప్రజలకి ఈ రోజుల్లో అప్పు ఓ అవసరంగా మారింది. అలా అని ఎలా పడితే అలా అప్పు చేయలేం. వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు వంటి అనేక అంశాలను పరిశీలించిగానీ అప్పు చేయలేం.
పిల్లల పెళ్లిళ్లు, అత్యవసర వైద్య ఖర్చులు, ఇంటి రిపేరు లేదా పేరుకుపోయిన క్రెడిట్ కార్డు బిల్లు. ఇలా ఏదో ఒక ఆర్థిక భారం ముంచుకొచ్చినపుడు పర్సనల్ లోన్ కోసం ఏదో ఒక బ్యాంకును ఆశ్రయించక తప్పదు. రెండు మూడు రోజుల్లోనే లోన్ డబ్బులు చేతికి వచ్చే సౌలభ్యం, పెద్దగా డాక్యుమెంటేషన్ అవసరం లేకపోవడమూ ఇందుకు కలిసి వచ్చే అంశాలు. అయితే పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ కింది అంశాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. అవేమిటంటే..
వడ్డీ రేటు: మనకు నిధుల అవసరం ఎంత ఉన్నా బ్యాంకు అడిగినంత వడ్డీ రేటు ఇవ్వలేం. మన పరపతి రేటింగ్ బాగుంటే బ్యాంకులే ఎగబడి తక్కువలో తక్కువ 12 శాతం వడ్డీకి రుణాలు ఇస్తాయి. సిబిల్ స్కోరు ఏ మాత్రం తగ్గినా 18 నుంచి 24 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. కాబట్టి పర్సనల్ రుణాలు తీసుకునే ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు తమ వ్యక్తిగత పరపతి స్కోరు 750 పాయింట్లకు తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇందుకోసం క్రెడిట్ కార్డు బకాయిలు, ఇతర రుణాల ఈఎంఐలు ఎప్పటికప్పుడు చెల్లిస్తుండాలి.
పరపతి వినియోగ నిష్పత్తి: మన పరపతి స్కోరు నిర్ణయించడంలో పరపతి వినియోగ నిష్పత్తిని బ్యాంకులు ప్రాతిపదికగా తీసుకుంటాయి. అంటే అర్హత ఉంది కదా అని, ఎక్కువ రుణాలు తీసుకోకూడదు. అలా చేస్తే వీడెవడో అప్పుల అప్పారావు అనుకుని పరపతి స్కోరు కట్ చేసేస్తాయి. వీలైనంత వరకు అర్హత ఉన్నదాన్లో 30 శాతానికి మించి అప్పు చేయకపోవడమే మంచిది.
ఎక్కువ క్రెడిట్ కార్డులు: అమెరికా, యూరప్‌లోలా ఇటీవల మన దేశంలో కూడా అనేక క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం పెద్ద ఫ్యాషనై పోయింది. బ్యాంకులు కూడా స్థిరమైన ఆదాయం ఉన్న వ్యక్తి కనిపిస్తే చాలు.. వెంటాడి మరీ క్రెడిట్ కార్డులు అంటగడుతున్నాయి. దాంతో అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా షాపింగ్ చేస్తూ అనేక మంది క్రెడిట్ కార్డులతో ఎడాపెడా కొనేసి అప్పుల భారం పెంచుకుంటున్నారు. అత్యవసరమై ఏదైనా పర్సనల్ లోన్ కావాలనుకున్నపుడు ఇది పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది.
వేతన ఖాతాపై పర్సనల్ లోన్: పర్సనల్ లోన్ తప్పదనుకున్నప్పుడు ముందుగా మీ శాలరీ ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించండి. చాలా బ్యాంకులు, తమ వద్ద శాలరీ ఖాతా ఉన్న ఉద్యోగులకు సులభంగానే పర్సనల్ లోన్లు ఇస్తుంటాయి. ఇందుకోసం ఒక్కోసారి ప్రత్యేక ఆఫర్లూ ప్రకటిస్తుంటాయి. శాలరీ ఖాతా ఉన్న బ్యాంకుల వద్ద పర్సనల్ లోన్లు తీసుకుంటే వడ్డీ రేటుతో పాటు డాక్యుమెంటేషన్ల ప్రక్రియా పెద్దగా ఉండదు.
వడ్డీ లెక్కించే విధానం: వ్యక్తిగత రుణాలు తీసుకునేటప్పుడు వడ్డీ లెక్కించే విధానమూ అత్యంత కీలకం. కొన్ని బ్యాంకులు రుణం తీర్చే వరకు ఫ్లాట్‌గా ఒకే వడ్డీ రేటు వసూలు చేస్తే.. మరికొన్ని బ్యాంకులు ఈఎంఐల ద్వారా తీర్చగా మిగిలిన అసలు పైనే వడ్డీ వసూలు చేస్తుంటాయి. ఈ రెండు విధానాల వల్ల ఖాతాదారులపై చెల్లింపుల భారం తగ్గుతుంది.
ప్రాసెసింగ్ ఫీజులు: బ్యాంకులు రుణాలపై వడ్డీతో పాటు ప్రాసెసింగ్, జీఎస్‌టీ వంటి ఫీజులూ వసూలు చేస్తుంటాయి. ప్రాసెసింగ్ ఫీజు సాధారణంగా రుణ మొత్తంలో ఒకటి నుంచి మూడు శాతం వరకు ఉంటుంది. మంచి పరపతి స్కోరు ఉండి, మీరు అదే బ్యాంకు ఖాతాదారైతే బ్యాంకులు ఇందులోనూ కొంత రాయితీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నిటిని జాగ్రత్తగా పరిశీలించాకే పర్సనల్ లోన్లకు దరఖాస్తు చేయాలి. లేకపోతే వడ్డీతో జేబులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.