ఇన్ఫీ లాభం రూ.5,945 కోట్లు

ABN , First Publish Date - 2023-07-21T01:40:11+05:30 IST

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ లాభం మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) కంపెనీ రూ.5,945 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని...

ఇన్ఫీ లాభం రూ.5,945 కోట్లు

క్యూ1లో 11% వృద్ధి నమోదు - రూ.37,933 కోట్లకు ఆదాయం

2023-24 ఆదాయ వృద్ధి అంచనా 1-3.5%కి తగ్గింపు

బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ లాభం మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) కంపెనీ రూ.5,945 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన రూ.5,362 కోట్ల లాభంతో పోలిస్తే, 11 శాతం మేర పెరిగినప్పటికీ మార్కెట్‌ వర్గాలు అంచనాల కంటే వృద్ధి తగ్గింది. గడిచిన మూడు నెలలకు ఇన్ఫీ ఆదాయం మాత్రం వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధితో రూ.37,933 కోట్లకు చేరుకుంది. మార్కెట్‌ అంచనాల కంటే ఎగువనే నమోదైంది. అయితే, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాను 1-3.5 శాతానికి కుదిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంతక్రితం అంచనా వేసిన 4-7 శాతం వృద్ధితో పోలిస్తే బాగా తక్కువిది. కాగా, నిర్వహణ లాభాల మార్జిన్‌ అంచనాను మాత్రం యథాతథంగా 20-22 శాతంగా కొనసాగించింది. ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే గడిచిన మూడు నెలల లాభం 3 శాతం తగ్గగా.. ఆదాయం కేవలం 1.31 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.

మరిన్ని ముఖ్యాంశాలు..

  • ఏప్రిల్‌-జూన్‌ కాలంలో ఇన్ఫోసిస్‌ 230 కోట్ల డాలర్ల విలువైన భారీ డీల్స్‌ కుదుర్చుకోగలిగిందని, భవిష్యత్‌ వృద్ధికి ఈ డీల్స్‌ పునాది వేయగలవని ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ అన్నారు. తమ జనరేటివ్‌ ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్నాయని, ఈ విభాగంలో కంపెనీకి 80 మంది యాక్టివ్‌ క్లయింట్లు ఉన్నారని ఆయన తెలిపారు.

  • రంగాల వారీగా చూస్తే, ఇన్ఫీకి కీలకమైన ఆర్థిక సేవల విభాగం నుంచి ఆదాయం వృద్ధి వార్షిక ప్రాతిపదికన 4.7 శాతం తగ్గగా.. కమ్యూనికేషన్‌ సెక్టార్‌ రెవెన్యూ 6.1 శాతం తగ్గింది. మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ విభాగ ఆదాయంలో మాత్రం రెండంకెల వృద్ధి నమోదైంది.

  • మార్కెట్ల వారీగా చూస్తే, ఐటీ రంగానికి కీలకమైన ఉత్తర అమెరికా నుంచి ఆదాయంలో కేవలం 2.3 శాతం వృద్ధి నమోదైంది. యూరప్‌ ఆదాయం 11 శాతం పెరిగింది.

  • జూ ఈ జూన్‌ 30 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,940 తగ్గి 3,36,294కు పరిమితమైంది. కంపెనీ ఉద్యోగుల సంఖ్య తగ్గడం వరుసగా ఇది రెండో త్రైమాసికం. అంతేకాదు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల నియామకాలకు సంబంధించి కూడా కంపెనీ ఎలాంటి సమాచారం అందించలేదు.

  • ఈ మార్చి త్రైమాసికంలో 20.9 శాతంగా నమోదైన ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు.. జూన్‌ త్రైమాసికంలో 17.3 శాతానికి తగ్గింది.

  • గురువారం బీఎ్‌సఈలో ట్రేడింగ్‌ ఇన్ఫోసిస్‌ షేరు 1.73 శాతం నష్టపోయి రూ.1,448.85 వద్ద క్లోజైంది.

జూన్‌ త్రైమాసికంలో కంపెనీ మెరుగైన ఫలితాలు నమోదు చేసుకోవడంతో పాటు భారీగా మెగా డీల్స్‌ దక్కించుకోగలిగింది. కానీ, కొన్ని డీల్స్‌పై సంతకాలు, అమలు తేదీ జాప్యమవుతున్నాయి. దీని ప్రకారం, ఈ మెగా డీల్స్‌ ద్వారా ఆదాయం మున్ముందు త్రైమాసికాల్లో లభించనుంది. గడిచిన త్రైమాసికంలో కొన్ని రంగాల నుంచి లభించే ఆర్డర్లపై ప్రభావం కన్పించింది. ఆ రంగాల క్లయింట్లు తమ పరివర్తన ప్రణాళికలను వాయిదా వేసుకుంటుండటంతో పాటు వారి నిర్ణయాల వేగం కూడా తగ్గింది.

సలీల్‌ పరేఖ్‌,

సీఈఓ, ఇన్ఫోసిస్‌

Updated Date - 2023-07-21T01:40:11+05:30 IST