చైనా స్థానాన్ని భారత్‌ భర్తీ చేయలేదు

ABN , First Publish Date - 2023-01-18T00:51:06+05:30 IST

భారత-చైనా ఆర్థిక వ్యవస్థల మధ్య పోలికే లేదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు...

చైనా స్థానాన్ని భారత్‌ భర్తీ చేయలేదు

అది తొందరపాటు ఆలోచన

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌

దావోస్‌ (స్విట్జర్లాండ్‌): భారత-చైనా ఆర్థిక వ్యవస్థల మధ్య పోలికే లేదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటును ప్రభావితం చేయడంలో భారత్‌, చైనా స్థానాన్ని ఇప్పట్లో భర్తీ చేస్తుందనే అంచనాలను కొట్టివేశారు. అలా ఆశించడం తొందరపాటు అవుతుందన్నారు. చైనాతో పోలిస్తే ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నదన్నారు. దావో్‌సలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు విలేకరుల సమావేశంలో రాజన్‌ ఈ విషయం చెప్పారు. అయితే భవిష్యత్‌లో పరిస్థితులు మారే అవకాశం ఉందన్నారు.

అంతా పుతిన్‌ దయ: అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) త్వరలో ఆర్థిక మాంద్యం చవిచూసే అవకాశం ఉందన్న జోస్యాలపైనా రాజన్‌ స్పందించారు. ఇదంతా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆధారపడి ఉందన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి స్వస్తి చెప్పాలని పుతిన్‌ నిర్ణయిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందన్నారు. అప్పుడు ధరల సెగ తగ్గుతుందన్నారు. తనకైతే అమెరికాలో మాంద్యం వచ్చే సూచనలేవీ కనిపించడం లేదన్నారు. నిరుద్యోగం, ఇళ్ల అమ్మకాల పరంగా చూసినా అమెరికా ఇప్పటికీ పటిష్ఠంగానే ఉందన్నారు. ఇళ్ల అమ్మకాలు తగ్గినా.. ధరలు మాత్రం ఏ మాత్రం తగ్గని విషయాన్ని గుర్తు చేశారు.

మార్చి వరకు చైనాకు కష్టాలు: తాజా కొవిడ్‌ విజృంభణతో చైనా ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌ వరకు తిప్పలు తప్పవని రాజన్‌ అన్నారు. ఆ తర్వాత పుంజుకున్నా ఆ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపైనా ఉంటుందన్నారు. చైనాలో సేవల రంగం కంటే తయారీ రంగం పుంజుకోవడం ముఖ్యమన్నారు.

పరిస్థితులు బాగోలేవు : సీఈఓలు

ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలకు మాత్రం ప్రపంచ ఆర్థిక భవిష్యత్‌ ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. పీడబ్ల్యూసీ సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో 73 శాతం మంది సీఈఓలు ఈ ఏడాది పరిస్థితులు ఎంత మాత్రం ఆశాజనకంగా లేవని చెప్పారు. గత 12 ఏళ్లలో ఏనా డూ ఇంత మంది సీఈఓలు ఆర్థిక వృద్ధిపై ఇంత నిరాశ వ్యక్తం చేయలేదు. దావో్‌సలో జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో పీడబ్ల్యూసీ ఈ సర్వే విడుదల చేసింది. వ్యాపార పద్దతులు మార్చుకోకపోతే వచ్చే పదేళ్లలో తమ కంపెనీల ఆర్థిక మనుగడ కష్టమేనని 40 శాతం మంది సీఈఓలు చెప్పారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక ఆటుపోట్లు, అంతర్జాతీయ ఉద్రిక్తతలుప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయని ఎక్కువ మంది సీఈఓలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-18T00:51:10+05:30 IST