2024లో పసిడి మరింత జిగేల్
ABN , Publish Date - Dec 31 , 2023 | 04:22 AM
కిలో వెండి రూ.88,000కు చేరే అవకాశం మదుపరులకు లాభాలను అందించటంలో బంగారం ఏటా రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. 2022తో పోల్చితే 2023 సంవత్సరంలో పసిడి మదుపరులకు 13 శాతం లాభాలను...
10 గ్రాముల బంగారం రూ.72,000 తాకే చాన్స్
కిలో వెండి రూ.88,000కు చేరే అవకాశం మదుపరులకు లాభాలను అందించటంలో బంగారం ఏటా రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. 2022తో పోల్చితే 2023 సంవత్సరంలో పసిడి మదుపరులకు 13 శాతం లాభాలను పంచింది. ఈ నెల 4న ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగా రం రూ.64,300కి చేరి రికార్డు సృష్టించింది. అదే రోజు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర రికార్డు స్థాయిలో 2,135 డాలర్లకు చేరింది. మరోవైపు వెండి ధర ఈ నెల 28న హైదరాబాద్‌లో రూ.81,000 స్థాయికి చేరి కొత్త రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం ఔన్స్ 24 డాలర్ల దగ్గర ట్రేడవుతున్న వెండి ధర 2024లో 30 డాలర్లకు చేరుతుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.85,000-రూ.88,000 మధ్య పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
జోరుజోరుగా: బులియన్ మార్కెట్లో ఈ జోరు వచ్చే ఏడాదీ (2024) కొనసాగుతుందని మార్కెట్ వర్టాల అంచ నా. అడ్డంకులు ఏమీ లేకపోతే పది గ్రాముల మేలిమి (24 క్యారట్స్) బంగారం ధర రూ.72,000కు చేరే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పరిస్థితులు తిరగబడినా రూ.59,500-58,700 మధ్య దేశీయ మార్కెట్లో పసిడికి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ వచ్చే ఏడాది చివరికల్లా పసిడి ధర 2,300 డాలర్లకు చేరుతుందని జేపీ మోర్గాన్ అంచనా.