సరుకు వెనక్కు పంపుతుంటే..?
ABN , First Publish Date - 2023-12-03T02:07:40+05:30 IST
ఒక వ్యాపారి తాను కొనుగోలు చేసిన సరుకును సరఫరాదారునికి వెనక్కు పంపటమనేది వ్యాపార లావాదేవీల్లో సర్వసాధారణం.
ఒక వ్యాపారి తాను కొనుగోలు చేసిన సరుకును సరఫరాదారునికి వెనక్కు పంపటమనేది వ్యాపార లావాదేవీల్లో సర్వసాధారణం. ఇది ఒక వ్యాపారి నుంచి డిస్ట్రిబ్యూటర్‌కు కావచ్చు లేదా ఒక వ్యాపారి లేదా డిస్ట్రిబ్యూటర్ నుంచి ఉత్పత్తిదారులకు కావచ్చు. ఈ విధంగా సరుకు వెనక్కు పంపటానికి వివిధ కారణాలు ఉండవచ్చు. వచ్చిన సరుకులో నాణ్యతాపరమైన లోపాలు ఉండటం ఒక కారణమైతే, ఎఫ్‌ఎంసీజీ ప్రొడక్ట్స్ ఉత్పత్తిదారులు కొత్త ప్రొడక్ట్ తయారు చేసిన ప్రతిసారి ఆయా ప్రొడక్ట్స్‌ను డిస్ట్రిబ్యూటర్స్‌కు పంపుతుంటారు. ఆయా వస్తువులు అమ్ముడుపోకపోతే తిరిగి వెనక్కి పంపవచ్చు అనే షరతు మీద. అమ్ముడు పోని సరుకును కొంతకాలం తర్వాత వెనక్కు పంపటం జరుగుతుంది.
అలాగే సీజన్ ప్రకారం వ్యాపారం జరిగే ఎరువులు, పురుగు మందుల వ్యాపారంలో కూడా సీజన్ ముగిసే నాటికి మిగిలిన సరుకును వెనక్కు పంపిస్తుంటారు. ఇలా వెనక్కు పంపటమనేది ఆయా సరఫరాదారులు, కొనుగోలుదారుల మధ్య ఉన్న అవగాహన మేరకు జరుగుతుంది.
అయితే, ఇలా సరుకు వెనక్కు పంపేటప్పుడు జీఎ్‌సటీకి సంబంధించి సరఫరాదారులు.. కొనుగోలుదారులు పాటించాల్సిన నియమ నిబంధనలు మీకోసం. కొనుగోలు చేసిన సరుకు వెనక్కు పంపటానికి రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది, సరఫరాదారుడు.. కొనుగోలుదారునికి వెన క్కు పంపే సరుకు విలువ, దీంతోపాటు దానికి సంబంధించిన జీఎ్‌సటీతో ఒక క్రెడిట్ నోట్ జారీ చేస్తాడు. సరఫరాదారుడు క్రెడిట్ నోట్‌ను జారీ చేసే విధానం, దాని విలువను తదుపరి సరఫరాలలో ఎలా తగ్గించుకోవాలనే విషయాలను ఇంతకు ముందు తెలపటం జరిగింది. ఇప్పుడు కొనుగోలుదారుడు, ఆ క్రెడిట్ నోట్ ఆధారంగా డెలివరీ చలాన్ మీద సరుకు వెనక్కు పంపాలి. ఇలా పంపేటప్పుడు ఎలాంటి పన్ను చెల్లించనక్కరలేదు. కానీ, వెనక్కు పంపే సరుకుకు సంబంధించి ఇంతకుముందు తీసుకున్న ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను రివర్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే నిబంధనల మేరకు పంపే సరుకునకు ఈ-వే బిల్ ఉండాలి.
అయితే, సరఫరాదారుడు క్రెడిట్ నోట్‌ను జారీ చేయటానికి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఎందుకంటే క్రెడిట్ నోట్‌లో మొదట సరుకును ఏ ఇన్వాయి్‌సలో పంపారో ఆ ఇన్వాయిస్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని సందర్భాల్లో ఇలా ఇన్వాయి్‌సతో మ్యాచ్ చేయటం కుదరకపోవచ్చు. అలాగే, సరఫరాదారుడు తాను జారీ చేసిన క్రెడిట్ నోట్ విలువను తగ్గించుకోవాటానికి కాలపరిమితి ఉంది. ఆ సమయం దాటితే విలువను తగ్గించుకోవటం కుదరదు. కాబట్టి, క్రెడిట్ నోట్‌ను జారీ చేసినా దానికి సంబంధించిన ప్రయోజనం పొందలేడు. అలాగే కొనుగోలుదారుడికి కూడా ఎంత రివర్స్ చేయాలో ఒక్కొక్కసారి అర్ధం కాదు.
ఇలాంటప్పుడు రెండో పద్ధతి పాటించవచ్చు. ఇందులో వెనక్కు పంపే సరుకును కొత్త సరఫరా కింద భావించాలి. అంటే, వ్యాపారి తాను వెనక్కు పంపే సరుకును అమ్మకం కింద చూపుతూ దానికి ఇన్వాయిస్ జారీ చేయటంతో పాటుగా దానికి సంబంధించిన పన్ను చెల్లించాలి. ఒక విధంగా చెప్పాలంటే.. సరుకు అమ్మేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో అవన్నీ పాటించాలి. అంటే క్రెడిట్ రివర్స్ చేసే బదులు కొత్తగా పన్ను కడుతున్నాడన్న మాట. అలాగే ఆ సరుకును వెనక్కు పొందిన తర్వాత సదరు డిస్ట్రిబ్యూటర్ లేదా ఉత్పత్తిదారుడు దానిని కొనుగోలుగా భావించి ఆ ఇన్వాయిస్ మీద ఉన్న ట్యాక్స్ మొత్తాన్ని ఇన్‌పుట్ కింద తీసుకోవచ్చు.
అంటే రెండో పద్ధతిలో సరుకు వెనక్కు పంపే వ్యక్తి అమ్మకందారుడుగా, సరుకును వెనక్కు పొందే వ్యక్తి అంటే సరుకు మొదట పంపిన సరఫరాదారుడు.. కొనుగోలుదారుడిగా వ్యవహరిస్తారు. కానీ, చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే సరఫరాదారుడు క్రెడిట్ నోట్‌ను జారీ చేయటం, అలాగే కొనుగోలుదారుడు ఇన్వాయిస్ ఇవ్వటం రెండూ కలిపి చేస్తూ ఉంటారు. ఇలా రెండు పద్ధతులు కలపటం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి పాటిస్తే సరఫరాదారుడికి, కొనుగోలుదారుడికి సులువుగా ఉంటుంది.