రూ.25 లక్షలు దాటి బకాయి పడితే ఉద్దేశపూర్వక ఎగవేతదారే

ABN , First Publish Date - 2023-09-22T01:37:57+05:30 IST

ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నిబంధనల్లో విప్లవాత్మక మార్పులకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) శ్రీకారం చుట్టింది. రూ.25 లక్షలు పైబడిన బకాయి పడి, చెల్లింపు సామర్థ్యం ఉన్నప్పటికీ...

రూ.25 లక్షలు దాటి బకాయి పడితే ఉద్దేశపూర్వక ఎగవేతదారే

  • ఆర్‌బీఐ తాజా ప్రతిపాదన

ముంబై: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నిబంధనల్లో విప్లవాత్మక మార్పులకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) శ్రీకారం చుట్టింది. రూ.25 లక్షలు పైబడిన బకాయి పడి, చెల్లింపు సామర్థ్యం ఉన్నప్పటికీ చెల్లించేందుకు నిరాకరించిన వారందరూ ఇక నుంచి ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల కోవలోకి వస్తారు. ఆర్‌బీఐ ఈ మేరకు నిర్వచనంలో మార్పులతో ముసాయిదా విడుదల చేస్తూ దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలు కోరింది. నిర్వచనంలో మార్పు వల్ల బ్యాంకులకు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల గుర్తింపు ప్రక్రి య సరళం కావడంతో పాటు వారు రుణాలు ఎగవేసిన వారిని తేలిగ్గా వర్గీకరించగలుగుతారు. ఈ వర్గీకరణలోకి వచ్చిన వారు రుణపునర్నిర్మాణానికి అనర్హులు కావడమే కాకుండా ఏ ఇతర కంపెనీ బోర్డులోనూ ఏదైనా పదవి చేపట్టడానికి కూడా అర్హులు కాదు. ఈ మార్పుతో ‘‘బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సత్వరం బకాయిల వసూలుకు చర్యలు తీసుకోవడానికి, రుణాన్ని ముందస్తుగా క్లోజ్‌ చేయడానికి వీలుగా రుణగ్రహీతలు/హామీ ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్య తీసుకోగలుగుతాయి’’అని పత్రంలో తెలిపారు. అలాగే ఏదైనా ఖాతాను మొండి బకాయిగా వర్గీకరించిన నాటి నుంచి ఆరు నెలల్లోగా ఉద్దేశపూర్వక ఎగవేతదారు అనే ము ద్ర వేయడంపై సమీక్షించి, తుది నిర్ణయం తీసుకోగలుగుతాయి. ఈ ముసాయిదాపై ఆసక్తి గల వర్గాలు అక్టోబరు 31 లోగా తమ అభిప్రాయాలు తెలియచేయాల్సి ఉంటుంది.

Updated Date - 2023-09-22T01:37:57+05:30 IST