భారత్ అగ్రగామిగా నిలవాలంటే సేవల రంగంపై దృష్టి పెట్టాలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 01:10 AM
భారత్ ప్రస్తుతం ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా మారింది. వృద్ధి రేటు 7 శాతానికి చేరువలో ఉంది. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. ప్రస్తుతం మన దేశంలో...
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): భారత్ ప్రస్తుతం ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా మారింది. వృద్ధి రేటు 7 శాతానికి చేరువలో ఉంది. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. ప్రస్తుతం మన దేశంలో ఉద్యోగాల కల్పన తక్కువగా ఉంది. దీన్ని అధిగమించాలంటే వృద్ధి రేటును గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. శనివారం నాడిక్కడ ఆర్థిక వేత్త రోహిత్ లాంబాతో కలిసి రచించిన ‘బ్రేకింగ్ ద మౌల్డ్, రీ ఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ పుస్తకంపై మంథన్ సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజన్ మాట్లాడుతూ.. 2047 నాటికి అమృత్‌కాల్‌కు చేరుకుంటామని ప్రభుత్వం అంటోందని, అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వృద్ధి రేటును గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం సాధిస్తున్న వృద్ధి రేటుతో అమృత్‌కాల్ లక్ష్యాలను చేరుకోవటం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాల్సి న అవసరం ఎంతైనా ఉందన్నారు. తయారీ రంగంపై దృష్టి కేంద్రీకరిస్తే ఉద్యోగాల కల్పన జరుగుతుందని భావిస్తున్నప్పటికీ.. అది వృద్ధికి ఎంత మాత్రమూ సరిపోదు. ఇప్పుడు వృద్ధి వేగవంతం కావాలంటే సేవల (సర్వీస్) రంగంపై దృష్టి పెట్టాలని రాజన్ సూచించారు. ప్రస్తుతం దేశంలో ఉద్యోగాల కల్పనే అసలు సమస్య అన్నారు. వృత్తి విద్యా సంస్థలు, నైపుణ్యాల శిక్షణ ద్వారా స్వల్ప కాలంలోనే ఈ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చన్నారు. లేకపోతే మన దేశంలో ఉన్న అపారమైన మానవ వనరులు వృధా అవుతాయని హెచ్చరించారు. అభివృద్ధి ప్రతి దశలోనూ ఉద్యోగాలు కల్పించడం అవసరమని రాజన్ స్పష్టం చేశారు.