జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2023-03-02T01:51:16+05:30 IST

గతనెలలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.1,49,577 కోట్లుగా నమోదయ్యాయి...

జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు

ఫిబ్రవరిలో 12 శాతం వృద్ధి

రికార్డు స్థాయిలో రూ.11,931 కోట్ల సెస్‌ వసూలు

న్యూఢిల్లీ: గతనెలలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.1,49,577 కోట్లుగా నమోదయ్యాయి. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, అధిక విలువైన వస్తు కొనుగోళ్లు జోరందుకోవడం ఇందుకు దోహదపడింది. అయితే, ఈ ఏడాది జనవరిలో నమోదైన రెండో అత్యధిక వసూళ్లు రూ.1.58 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం ఫిబ్రవరిలో జీఎ్‌సటీ ఆదాయం కాస్త తగ్గింది. గత ఏడాది ఏప్రిల్‌లో జీఎ్‌సటీ వసూళ్లు ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1.68 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. గతనెలలో సెంట్రల్‌ జీఎ్‌సటీ (సీజీఎ్‌సటీ) రూ.27,662 కోట్లు, స్టేట్‌ జీఎ్‌సటీ (ఎస్‌జీఎ్‌సటీ) రూ.34,915 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ (ఐజీఎ్‌సటీ) రూ.75,069 కోట్లుగా నమోదైంది. అలాగే, రూ.11,931 కోట్ల పరిహార సుంకం వసూలైంది. 2017 జూలైలో జీఎ్‌సటీ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి నమోదైన అత్యధిక సుంకం వసూళ్లివే. అంతేకాదు, వరుసగా 12 నెలలుగా జీఎ్‌సటీ ఆదాయం రూ.1.40 లక్షల కోట్ల ఎగువ స్థాయిలో నమోదవుతూ వస్తోంది. ఐజీఎస్‌టీ ఆదాయంలో రూ.34,770 కోట్లను సీజీఎ్‌సటీకి, రూ.29,054 కోట్లను ఎస్‌జీఎ్‌సటీకి సెటిల్‌ చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రతినెలా జరిగే ఈ సెటిల్‌మెంట్‌ అనంతరం, సీజీఎ్‌సటీ రూ.62,432 కోట్లు, ఎస్‌జీఎ్‌సటీ రూ.63,969 కోట్లకు చేరకుంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్‌ నెలకు చెల్లించాల్సిన రూ.16,982 కోట్ల పరిహారం, రూ.16,524 కోట్ల ఏజీ బకాయిలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసింది.

Updated Date - 2023-03-02T01:51:16+05:30 IST