ఈఎంఐ ఆలస్యమైతే చాక్లెట్లతో పలకరింపు

ABN , First Publish Date - 2023-09-18T04:06:54+05:30 IST

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) నుంచి పర్సనల్‌, కార్‌, హోమ్‌ లేదా ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకున్నారా.. అయితే ఏ నెల ఈఎంఐ ఆ నెల చెల్లించడం మంచిది. లేకపోతే ఎస్‌బీఐ అధికారులు...

ఈఎంఐ ఆలస్యమైతే చాక్లెట్లతో పలకరింపు

రుణ వసూళ్ల కోసం ఎస్‌బీఐ వినూత్న ఆలోచన

ముంబై: భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) నుంచి పర్సనల్‌, కార్‌, హోమ్‌ లేదా ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకున్నారా.. అయితే ఏ నెల ఈఎంఐ ఆ నెల చెల్లించడం మంచిది. లేకపోతే ఎస్‌బీఐ అధికారులు మిమ్మల్ని వినూత్న రీతిలో పలకరించబోతున్నారు. చెప్పా పెట్టకుండా ఒక ప్యాకెట్‌ చాక్లెట్లతో ఎస్‌బీఐ సిబ్బంది స్వయంగా మీ ఇంటికే వచ్చి పలకరించనున్నారు. రిటైల్‌ రుణాల్లోనూ ఎగవేతలు పెరిగిపోతుండడంతో బ్యాంక్‌ ఈ వినూత్న కార్యక్రమం చేపడుతోంది. ఒక ఫిన్‌టెక్‌ సలహాతో ఎస్‌బీఐ ఇందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని బ్యాంక్‌ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఐదు నెలల పాటు ఈ కార్యక్రమ పనితీరును పరిశీలించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది.

ఎందుకంటే: కార్పొరేట్‌ రుణాలతో పాటు రిటైల్‌ రుణాల్లోనూ ఇటీవల ఎగవేతలు పెరిగిపోయాయి. కొంతమంది ఎగవేతదారులు నోటీసులు పంపినా తీసుకోవడం లేదు లేదా స్పందించడం లేదు. ఒకవేళ స్పందించినా..చేతులెత్తేస్తున్నారు. దీంతో ఈఎంఐ చెల్లింపుల దశలోనే ఎగవేతలకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఇక నుంచి ఒక నెల ఈఎంఐ చెల్లింపులో డిఫాల్ట్‌ అయినా, ఏదో ఒక రోజు ఎస్‌బీఐ సిబ్బంది ఒక ప్యాకెట్‌ చాక్లెట్లు పట్టుకుని డిఫాల్టర్‌ ఇంటికి నేరుగా వచ్చి పలకరించి మరీ తమ బకాయిల గురించి గుర్తు చేస్తారు.

రిటైల్‌ రుణాలు రూ.12 లక్షల కోట్లు: ఈ ఏడాది జూన్‌ త్రైమాసికానికి ఎస్‌బీఐ అన్ని రంగాలకు కలిపి రూ.33.03 లక్షల కోట్ల రుణాలు ఇచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13.9 శాతం ఎక్కువ. మళ్లీ ఇందులో రిటైల్‌ రుణాల వాటా రూ.12.04 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.46 శాతం ఎక్కువ. రిటైల్‌ రుణాల్లో గృహ రుణాల వాటానే రూ.6.3 లక్షల కోట్ల వరకు ఉంది. వివిధ కారణాలతో అనేక మంది ఈ రుణాలు చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు. ఈ జాడ్యానికి ఆరంభంలోనే చెక్‌ పెట్టేందుకు ఈ చాక్లెట్ల వ్యూహం ఎంతోకొంత పని చేస్తుందని ఎస్‌బీఐ భావిస్తోంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను పక్కన పెడితే, మిగతా వారు ఏదోలా తమ రిటైల్‌ రుణాలు క్లియర్‌ చేస్తారని ఎస్‌బీఐ అంచనా.

Updated Date - 2023-09-18T04:06:54+05:30 IST