ప్రభుత్వ బ్యాంకర్ల్లూ పారాహుషార్‌..!

ABN , First Publish Date - 2023-03-26T04:30:08+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం నాడు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) అధిపతులతో సమావేశమయ్యారు. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్‌ వ్యవస్థలు వరుస వైఫల్యాలతో...

ప్రభుత్వ బ్యాంకర్ల్లూ పారాహుషార్‌..!

  • అంతర్జాతీయ సంక్షోభంపై అప్రమత్తంగా ఉండండి..

  • కుదుపులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి..

  • పీఎ్‌సబీల చీఫ్‌లకు ఆర్థిక మంత్రి నిర్మల సూచన

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం నాడు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) అధిపతులతో సమావేశమయ్యారు. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్‌ వ్యవస్థలు వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మన పీఎ్‌సబీల పనితీరును ఆమె సమీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ పోతున్న సెంట్రల్‌ బ్యాంక్‌ల వడ్డీ రేట్లతో పొంచి ఉన్న ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని పీఎ్‌సబీ చీఫ్‌లను మంత్రి కోరారు. తమ బ్యాంక్‌ ఆకస్మిక కుదుపులను ఎదుర్కోగలదా..? లేదా..? అని ఎప్పటికప్పుడు ఒత్తిడి పరీక్షలను నిర్వహించాలన్నారు. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు డిపాజిట్లు, ఆస్తుల వివిధీకరణపై దృష్టిసారించాలని మంత్రి సూచించారు. కేంద్రీకృతమవుతున్న ముప్పులను, ప్రతికూలంగా పరిణమించే అవకాశమున్న పెట్టుబడులపై కన్నే సి ఉంచాలన్నారు. ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా మల్చుకొని, సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు సమాచార వ్యూహాలపై సమగ్ర ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని పీఎ్‌సబీలకు మంత్రి ఉద్భోదించారు.

అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ), సిగ్నేచర్‌ బ్యాంక్‌ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కుప్పకూలిన విషయం తెలిసిందే. వాటిలాగే క్రెడిట్‌ స్విస్‌ కూడా దివాలా తీసే ప్రమాదం పొంచి ఉండటంతో స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అప్రమత్తమై.. ఆ బ్యాంక్‌ను యూబీఎస్‌ కొనుగోలు చేసేలా ప్రోత్సహించింది. జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంక్‌ చుట్టూ సంక్షోభం ముసురుకుంటోంది. ఈ బ్యాంక్‌ క్రెడిట్‌ డిఫాల్ట్‌ స్వాప్స్‌ (సీడీఎస్‌) ప్రీమియం ఒక్కసారిగా పెరిగింది. దాంతో ఈ బ్యాంక్‌ షేర్లు శుక్రవారం ఒకదశలో 14 శాతం వరకు క్షీణించాయి. బాండ్ల జారీ ద్వారా బ్యాంక్‌ సమీకరించిన నిధులను తిరిగి చెల్లించే విషయం లో రిస్క్‌ పెరిగే కొద్దీ సీడీఎస్‌ ప్రీమియం కూడా పెరుగుతూ పోతుంది. ఈ నేపథ్యంలో డాయిష్‌ బ్యాంక్‌ సైతం కుప్పకూలే అవకాశాలున్నాయని మార్కెట్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు, వరుస వైఫల్యాల నేపథ్యంలో అమెరికాలోని చిన్న స్థాయి బ్యాంక్‌ల నుంచి ఖాతాదారులు డిపాజిట్లను పెద్ద ఎత్తున ఉపసంహరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పీఎ్‌సబీల అధిపతులతో నిర్మలా సీతారామన్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు ఏయే బాండ్లలో పెట్టుబడులు పెట్టారన్న డేటాను సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ ఇప్పటికే పీఎ్‌సబీలను కోరింది.

అంతర్జాతీయ పరిస్థితిపైనే ప్రధానంగా చర్చ

ఆర్థిక మంత్రితో భేటీలో పీఎ్‌సబీల మేనేజింగ్‌ డైరెక్టర్లు, ముఖ్య కార్య నిర్వాహక అధికారులు (సీఈఓ)లు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాద్‌, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషీతో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు సైతం హాజరయ్యారు. 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనే ప్రధానంగా చర్చ జరిగింది. తాము ఉత్తమ పాలన ప్రమాణాలను పాటిస్తున్నామని, నిబంధనలకు లోబడి కార్యకలాపాలు సాగించడంతోపాటు సమర్థవంతమైన ద్రవ్య నిర్వహణ విధానాలను పాటిస్తున్నామని మంత్రికి పీఎ్‌సబీ చీఫ్‌లు వివరించారు.

Updated Date - 2023-03-26T04:30:08+05:30 IST