బంగారం రూ.60,000
ABN , First Publish Date - 2023-03-19T02:14:43+05:30 IST
బంగారం, వెండి ధరలు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి ఎగబాకాయి. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర శనివారం రూ.1,630 పెరిగి రూ.60,320కి చేరుకుంది. పసిడి రూ.60,000 దాటడం ఇదే తొలిసారి. 22 క్యారెట్ల ధర కూడా రూ.1,500 మేర పెరిగి రూ.55,300గా నమోదైంది...

రూ.74,000 ఎగువకు వెండి
అంతర్జాతీయంగా ధరలు పెరగడమే ప్రధాన కారణం
2,000 డాలర్ల చేరువలో ఔన్స్ గోల్డ్
హైదరాబాద్: బంగారం, వెండి ధరలు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి ఎగబాకాయి. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర శనివారం రూ.1,630 పెరిగి రూ.60,320కి చేరుకుంది. పసిడి రూ.60,000 దాటడం ఇదే తొలిసారి. 22 క్యారెట్ల ధర కూడా రూ.1,500 మేర పెరిగి రూ.55,300గా నమోదైంది. కిలో వెండి సైతం రూ.1,300 మేర ఎగబాకి రూ.74,400 ధర పలికింది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభ ప్రభావంతో అంతర్జాతీయంగా విలువైన లోహాలకు గిరాకీ భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమైంది. ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒక్కరోజే 70 డాలర్లు పెరిగి 1,993 డాలర్లకు చేరుకుంది. సిల్వర్ కూడా 23 డాలర్లకు చేరువైంది. ‘‘అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దాంతో డాలర్ విలువ బలహీనపడుతోంది. ఈ పరిణామం ఈక్విటీలతో పాటు ప్రభుత్వ బాండ్లు ఇతర ఆర్థిక సాధనాలపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారంలోకి పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దాంతో ఈ వారంలో గోల్డ్ రేట్లు భారీగా పుంజుకున్నాయ’’ని ఐఐఎ్‌ఫఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా అన్నారు.
పది రోజుల్లోనే రూ.5,000 అప్
గడిచిన 10 రోజుల్లో బంగారం దాదాపు రూ.5,000 పెరిగింది. ఈ నెల 9న హైదరాబాద్ మార్కెట్లో తులం మేలిమి బంగారం రూ.55,530గా ఉండగా.. ఈ నెల 18 నాటికి రూ.60,320కి చేరుకుంది. 2022 మార్చి 19న రూ.51,600గా ఉన్న పసిడి రేటు.. గడిచిన ఏడాది కాలంలో రూ.8,720 ఎగబాకింది.
వచ్చేవారంలో మరింత పైకి..
అమెరికా, యూరప్ బ్యాంకింగ్ వ్యవస్థను కమ్ముకున్న అనిశ్చితి మబ్బులు ఇప్పట్లో తొలిగేలా కన్పించడం లేదు. పైగా వచ్చే వారంలో అమెరికన్ సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరో 0.25 శాతం పెంచవచ్చన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఔన్స్ గోల్డ్ వచ్చే వారంలో 2,000 మార్క్‌ను కూడా దాటి 2,030 డాలర్ల వరకు పెరగవచ్చని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఔన్స్ సిల్వర్ సైతం 23-24 డాలర్ల స్థాయిలో ట్రేడ్ కావచ్చని వారన్నారు. ఈ లెక్కన విలువైన లోహాలు దేశీయంగా మరింత ప్రియం కానున్నాయి.
ఎంసీఎక్స్‌లో ఇలా..
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు (ఏప్రిల్‌లో డెలివరీ) శుక్రవారం రూ.1,414 (2.44 శాతం) పెరిగి రూ.59,420కు చేరుకుంది. ఈ దేశీయ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్‌కు ఆల్‌టైం గరిష్ఠ రేటు ఇది. మే నెల సిల్వర్ కాంట్రాక్టు ధర సైతం రూ.2,118 (3.18 శాతం) ఎగబాకి రూ.68,649 పలికింది. శనివారం ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్‌కు సెలవు. కాబట్టి, సోమవారం ఎక్స్ఛేంజ్‌లోనూ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు రేటు 60,000 దాటనుంది.
స్వతంత్ర భారతంలో ధరల గమనం సాగిందిలా...
1942లో క్విట్ ఇండియా ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 10 గ్రా ముల బంగారం సగటు ధర రూ.44గా ఉండేది. ఆ తర్వాత ఐదేళ్లలోనే ధర రెట్టింపై దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి రూ.88కి చేరుకుంది. అంటే, ఈ 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో బంగారం ధర దాదాపు 682 రెట్లు పెరిగింది.
సంవత్సరం సగటుధర (రూ.)
1947 88
1950 100
1960 112
1970 184
1980 1,330
1990 3,200
2000 4,400
2010 18,500
2020 42,700
2021 48,700
2022 52,700