విదేశీ వాణిజ్యం రూ.69 లక్షల కోట్లు
ABN , First Publish Date - 2023-08-22T01:38:58+05:30 IST
ప్రపంచ దేశాల నుంచి డిమాండ్ తగ్గిన వాతావరణంలో కూడా సేవల రంగం ఆరోగ్యవంతమైన వృద్ధి నమోదు చేయడంతో 2023 సంవత్సరం ప్రథమార్ధంలో (జనవరి-జూన్) భారత వస్తు, సేవల ఎగుమతులు 80 వేల కోట్ల డాలర్ల (రూ.68.8 లక్షల కోట్లు) స్థాయిని దాటాయి..
2023 ప్రథమార్ధంలో రికార్డు
సేవల రంగం ఉత్తేజంతో సానుకూలత
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల నుంచి డిమాండ్ తగ్గిన వాతావరణంలో కూడా సేవల రంగం ఆరోగ్యవంతమైన వృద్ధి నమోదు చేయడంతో 2023 సంవత్సరం ప్రథమార్ధంలో (జనవరి-జూన్) భారత వస్తు, సేవల ఎగుమతులు 80 వేల కోట్ల డాలర్ల (రూ.68.8 లక్షల కోట్లు) స్థాయిని దాటాయి. ప్రపంచ వాణిజ్య పరిశోధన సంస్థ (జీటీఆర్‌ఐ) విశ్లేషణ నివేదిక ప్రకారం ప్రథమార్ధంలో వస్తు, సేవల ఎగుమతులు 1.5 శాతం పెరిగి 38,540 కోట్ల డాలర్లుగా (రూ.33.15 లక్షల కోట్లు) నమోదు కాగా, దిగుమతులు మాత్రం 5.9 శాతం క్షీణించి 41,550 కోట్ల డాలర్లకు (రూ.35.73 లక్షల కోట్లు) పరిమితమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఎగుమతులు 37,950 కోట్ల డాలర్లు (రూ.32.64 లక్షల కోట్లు) కాగా దిగుమతులు 44,170 కోట్ల డాలర్లు (రూ.37.98 లక్షల కోట్లు). ఇదే సమయంలో కేవల వస్తు ఎగుమతులు మాత్రం 8.1 శాతం క్షీణించి 21,870 కోట్ల డాలర్లుగా (రూ.18.81 లక్షల కోట్లు) నమోదు కాగా దిగుమతులు 8.3 శాతం క్షీణించి 32,570 కోట్ల డాలర్లుగా (రూ.28.01 లక్షల కోట్లు) నమోదయ్యాయి. కేవల సేవల ఎగుమతులు 17.7 శాతం పెరిగి 16,670 కోట్ల డాలర్లకు (రూ.14.34 లక్షల కోట్లు) చేరగా దిగుమతులు 3.7 శాతం పెరిగి 8980 కోట్ల డాలర్లుగా (రూ.7.72 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ‘‘ప్రపంచ దేశాల డిమాండ్ ప్రోత్సాహకరంగా లేకపోవడంతో పాటు కార్మిక శక్తికి ప్రాధాన్యత గల రంగాలు పోటీ సామర్థ్యం కోల్పోవడంతో ఎగుమతులు ఒక మోస్తరుగా క్షీణించినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం రేటు 2022 ఏప్రిల్ నాటికి 76.16 స్థాయి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 82.18కి పెరిగినా వస్తు ఎగుమతులు క్షీణించాయి’’ అని జీటీఆర్‌ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పెద్ద దేశం సొంత లాభానికి ప్రాధాన్య ఇస్తుందని, ఇలాంటి వాతావరణంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, సుసంపన్నతకు ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ముసుగులో తెరపైకి వచ్చే ప్రతి అంశానికి భారత్ విధానపరంగా రాజీ పడకుండా ఉత్పత్తుల నాణ్యత, పోటీ సామర్థ్యం పెంచడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.