సీఎన్‌జీ వాహనాలకు భలే గిరాకీ

ABN , First Publish Date - 2023-06-04T02:55:14+05:30 IST

కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) వాహనాలకు గిరాకీ పెరుగుతోంది. సీఎన్‌జీ ధర బాగా పెరిగినప్పటికీ.. పెట్రోల్‌ ధరతో పోలిస్తే చాలా తక్కువగా ఉండడంతో కార్లు తదితర సీఎన్‌జీ వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి...

సీఎన్‌జీ వాహనాలకు భలే గిరాకీ

40 శాతం పైగా పెరిగిన కార్ల విక్రయాలు

మరిన్ని సీఎన్‌జీ మోడళ్లపై కంపెనీల దృష్టి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) వాహనాలకు గిరాకీ పెరుగుతోంది. సీఎన్‌జీ ధర బాగా పెరిగినప్పటికీ.. పెట్రోల్‌ ధరతో పోలిస్తే చాలా తక్కువగా ఉండడంతో కార్లు తదితర సీఎన్‌జీ వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి. మారుతి వంటి కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్‌ కార్లతో సమానంగా సీఎన్‌జీ కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. సీఎన్‌జీ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. మారుతి వ్యాగన్‌ ఆర్‌, స్విఫ్ట్‌ డిజైర్‌, హ్యుండయ్‌ ఐ10, యాక్సెంట్‌, టాటా టిగోర్‌ వంటి మోడళ్లలో సీఎన్‌జీ వెర్షన్లను కంపెనీలు విక్రయిస్తున్నాయి.

49% పెరిగిన ధర

అంతక్రితం ఏడాదితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో సీఎన్‌జీ సగటు ధర 49 శాతం మేరకు పెరిగింది. సీఎన్‌జీ ధర పెరిగినప్పటికీ.. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో సీఎన్‌జీ కార్ల విక్రయాలు ఆకర్షణీయంగా 40.7 శాతం మేరకు పెరిగి 2,26,547 కార్ల నుంచి రూ.3,18,752 కార్లకు చేరినట్లు కార్ల పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గ్యాస్‌ ఉత్పత్తికి సంబంధించి కొన్ని విధానపరమైన మార్పులను 2023 ఏప్రిల్‌లో ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు అనుగుణంగా సీఎన్‌జీ ధరల్లో ఒడిదొడుకులు తగ్గగలవని భావిస్తున్నారు. ఇది మధ్య కాలానికి సీఎన్‌జీ వాహనాల విక్రయాలు మరింతగా పెరిగేందుకు దోహదం చేయగలవని అంచనా వేస్తున్నాయి.

త్రిచక్ర వాహనాల విక్రయాల్లో 93ు వృద్ధి..

కార్లతో పాటు సీఎన్‌జీ త్రిచక్ర వాహనాలు, బస్సుల విక్రయాలు కూడా ఆకర్షణీయంగా పెరుగుతున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో సీఎన్‌జీ త్రిచక్ర వాహనాల విక్రయాలు 93.2 శాతం పెరిగి 1,24,863 వాహనాల నుంచి 2,41,230 వాహనాలకు చేరాయి. బస్సుల విక్రయాలు 226 శాతం మేరకు పెరిగాయి. గత ఏడాదిలో 5,738 బస్సులను విక్రయించారు. రవాణా వాహనాల విక్రయాలు మాత్రం 4 శాతం క్షీణించి 98,381 వాహనాల నుంచి 94,433 వాహనాలకు తగ్గాయి. సీఎన్‌జీ వాహనాల కంటే ఎలక్ట్రిక్‌ వాహనాల రవాణా వ్యయం తక్కువగా ఉండడం వల్ల లాస్ట్‌మైల్‌ డెలివరీ అపరేటర్లు ఎలక్ట్రిక్‌ వాహనాలను పెంచుకోవడం కారణంగా సీఎన్‌జీ రవాణా వాహనాల విక్రయాలు తగ్గాయి. మొత్తం వాహనాలను పరిగణనలోకి తీసుకుంటే 2022-23లో సీఎన్‌జీ వాహనాల విక్రయాలు 46 శాతం పెరిగి 4,51,552 వాహనాల నుంచి 6,60,153 వాహనాలకు చేరినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాదిలో సీఎన్‌జీ ధర భారీగా పెరగడంతో విక్రయాలు తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు భావించాయని, అందుకు భిన్నంగా పెరగడానికి కారణం పెట్రోల్‌ ధరతో పోలిస్తే ఇంకా సీఎన్‌జీ ధర చాలా తక్కువగా ఉండడమే కారణమని మారుతి సుజుకీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ముంబైలో 2018-19లో సగటున కేజీ సీఎన్‌జీ ధర రూ.44.2 ఉంటే.. 2021-22 నాటికి రూ.55.8 చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో 49 శాతం పెరిగి రూ.83.2 చేరింది..

Updated Date - 2023-06-04T02:55:14+05:30 IST