Layoffs: మరో ప్రముఖ కంపెనీలో త్వరలో తొలగింపుల పర్వం.. సుమారు 6600 మంది ఉద్యోగులపై వేటు..

ABN , First Publish Date - 2023-02-06T16:02:03+05:30 IST

ప్రముఖ కంప్యూటర్స్ సంస్థ డెల్ టెక్నాలజీస్.. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

Layoffs: మరో ప్రముఖ కంపెనీలో త్వరలో తొలగింపుల పర్వం.. సుమారు 6600 మంది ఉద్యోగులపై వేటు..

ముంబై: ప్రముఖ టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల పర్వం.. సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా మరో కంపెనీ ఉద్యోగులపై భారీ స్థాయిలో వేటు వేసేందుకు రెడీ అయింది. ప్రముఖ కంప్యూటర్స్ సంస్థ డెల్ టెక్నాలజీస్(Dell Technologies).. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు(Lay offs) పూనుకుంది. డెల్ పర్సనల్ కంప్యూటర్స్ అమ్మకాలు నానాటికీ పడిపోతుండటంతో(Plunging PC Sales) సుమారు 6600 మంది తమ ఉద్యోగులను కోల్పోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ సిబ్బందిలో దాదాపు 5 శాతం మందిని తొలగించనున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

డెల్ భవిష్యత్తుపై అస్పష్టత నెలకొందని సంస్థ కో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ ఇటీవల ఉద్యోగులకు ఓ లేఖ రాశారట. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు సంస్థ ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఉద్యోగులకు ఉద్దేశించిన లేఖలో ఆయన పేర్కొన్నారట. ఈ మేరకు బ్లుమ్‌బర్గ్ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఖర్చులు తగ్గించుకునేందుకు డెల్ గతంలో చేపట్టిన నియామకాల కుదింపు, ప్రోత్సాహకాల ఉపసంహరణ వంటి చర్యలు చేపట్టింది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చర్యలు సరిపోవని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రస్తుత తొలగింపులన్నీ సంస్థ సామర్థ్యం పెంపు దిశగా తీసుకుంటున్న చర్యలుగా చూడాలని కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

డెల్ ఆదాయంలో 55 శాతం పర్సనల్ కంప్యూటర్ల(పీసీ) అమ్మకాల ద్వారా సమకూరుతుందని ఇండస్ట్రీ విశ్లేషకుల అంచనా. 2022 నాలుగో త్రైమాసికంలో పీసీ షిప్‌మెంట్లు భారీగా పడిపోయాయి. 2021లో ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం మేర తగ్గిపోయాయి. ప్రముఖ హార్డ్‌వేర్ కంపెనీలన్నిటిలోకి డెల్ కంప్యూటర్ల అమ్మకాలే తగ్గాయి. కరోనా సంక్షోభం తరువాత ఉత్పత్తులకు డిమాండ్ తగ్గి హార్డ్‌వేర్ కంపెనీలన్నీ ఇబ్బంది పడుతున్నాయి.

Updated Date - 2023-02-06T16:10:02+05:30 IST