Signature Bank: సిగ్నేచర్ బ్యాంకు పుట్టిముంచిన ‘క్రిప్టో’..!
ABN , First Publish Date - 2023-03-13T20:16:14+05:30 IST
‘ఇంతింతై.. వటుడింతై..’ అన్నట్లుగా 23 ఏళ్లలో అంచెలంచెలుగా ఎదిగి, అమెరికా వ్యాప్తంగా శాఖలను విస్తరించిన సిగ్నేచర్ బ్యాంకు పతనానికి క్రిప్టో కరెన్సీనే కారణమా?
సిలికాన్ వ్యాలీ బ్యాంకు(SVB) మూతపడ్డ రెండ్రోజులకే అమెరికాలో మరో బ్యాంకు సంక్షోభంలోకి కూరుకుపోయింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిగ్నేచర్ బ్యాంకు(Signature Bank)ను మూసివేస్తున్నట్లు అమెరికా సర్కారు ప్రకటించింది. ఆ బ్యాంకును ద ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC) తన నియంత్రణలోకి తీసుకుంది. సిగ్నేచర్ బ్యాంకు మూసివేత నిర్ణయంతో అమెరికాతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి.
23 ఏళ్లకే ఖతం..!
ఇజ్రాయెల్ బ్యాంక్ హపోలిమ్ 2000 సంవత్సరంలో న్యూయార్క్ కేంద్రంగా సిగ్నేచర్ బ్యాంకును స్థాపించింది. అనతికాలంలోనే పైపైకి ఎదిగిన ఈ బ్యాంకు అమెరికా వ్యాప్తంగా శాఖలను తెరిచింది. 2004లో పబ్లిక్ ఇష్యూను ప్రారంభించింది. 2005లో తన వాటాలను షేర్ మార్కెట్లో అందుబాటులో పెట్టింది. స్తిరాస్థి(Real Estate), డిజిటల్ అసెట్స్(Digital Assets) సహా.. దశలవారీగా తొమ్మిది విభాగాల్లో ఈ బ్యాంకు తన సేవలను విస్తరించింది. సజావుగా సాగుతున్న బ్యాంకింగ్‌లో.. ఓ దశలో రోజురోజుకూ పైపైకి ఎగబాకిన క్రిప్టోకరెన్సీ డిపాజిట్లను ప్రారంభించింది. 2019లో సిగ్నేచర్ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయమే బ్యాంకు పతనానికి ప్రధాన కారణమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుకు 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్ డాలర్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. అయితే.. గత ఏడాది సెప్టెంబరు చివరికి(ఆర్థిక సంవత్సర ముగింపు) ఈ బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టోకరెన్సీ(Crypto Currency) ద్వారా వచ్చిన డిపాజిట్లు ఉండడం గమనార్హం..! క్రిప్టో కరెన్సీ నేల చూపులు చూడడం ప్రారంభించగానే.. జరగబోయే నష్టాన్ని సిగ్నేచర్ బ్యాంకు ముందుగానే ఊహించింది. గత ఏడాది డిసెంబరులో దీనిపై ఓ ప్రకటన చేసింది. తమ క్రిప్టో డిపాజిట్లను 8 బిలియన్ డాలర్లకు కుదిస్తామని స్పష్టం చేసింది.

కొంపముంచిన క్రిప్టో..
క్రిప్టోకరెన్సీ అనేది ఏ దేశానికి చెందినది కాదు. రూపం ఉండదు. కేవలం ఆన్‌లైన్‌లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా.. క్రిప్టోమైనింగ్ ప్రక్రియతో రూపుదిద్దుకున్న కరెన్సీ. ఈ కరెన్సీకి ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించనందున భరోసా లేదు. ఉదాహరణకు భారత కరెన్సీని తీసుకుంటే.. ఆ నోటుపై నోటు విలువకు తగిన మొత్తానికి భరోసానిస్తూ.. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ సంతకం ఉంటుంది. క్రిప్టోకరెన్సీకి ఆ రకమైన భద్రత ఏర్పాట్లేమీ ఉండవు. అభివృద్ధి చెందిన పలు దేశాల్లోని బ్యాంకులు గడిచిన రెండేళ్లుగా.. క్రిప్టోకరెన్సీ రూపంలో డిపాజిట్ల సేకరణకు ఆసక్తి చూపుతుండడంతో.. అప్పట్లోనే ఆర్థికరంగ నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇంకా ప్రపంచ దేశాలు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన చట్టాలను, నిబంధనలను, మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉందని, అప్పటి వరకు క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేయడం తగదని సూచించారు. నియంత్రణ వ్యవస్థ లేనిదే.. క్రిప్టోకరెన్సీని అనుమతించడం సరికాదని తేల్చిచెప్పారు. తొలినాళ్లలో పైపైకి ఎగిసిన క్రిప్టోకరెన్సీ విలువలు, ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయని, క్రిప్టోకరెన్సీ విలువ గంటలు, నిమిషాల వ్యవధిలో మారుతుంటాయని, దీన్ని నియంత్రించడం కష్టమని చెప్పారు.
అమెరికాలో ఇలా..
అమెరికా సర్కారు మాత్రం స్పష్టమైన చట్టాలను చేయకున్నా... కొన్ని మార్గదర్శకాలను పాటిస్తోంది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీకి చెందిన ఆర్థిక నేరాల ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్(FinCEN) క్రిప్టోకరెన్సీలతో కూడిన లావాదేవీలను బ్యాంకులు ఎలా నిర్వహించాలో స్పష్టం చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. క్రిప్టోకరెన్సీలతో వ్యవహరించేటప్పుడు బ్యాంకులు ఇప్పటికే ఉన్న మనీలాండరింగ్ నిరోధక(AML) చట్టం, నో యువర్-కస్టమర్(KYC) నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. అంతకు మించితే.. డిపాజిట్లపై నియంత్రణలను పేర్కొనలేదు. దీంతో.. అమెరికాలోని అనేక రాష్ట్రాలు క్రిప్టో కరెన్సీల వినియోగంపై సొంతంగా నిబంధనలను రూపొందించాయి. న్యూయార్క్ ఇందుకు సంబంధించి, బిట్‌లైసెన్స్(Bit-Licence) పేరుతో నిబంధనలను విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాంకులతోసహా వర్చువల్ కరెన్సీ కార్యకలాపాలలో నిమగ్నమైన కంపెనీలు రాష్ట్రంలో పనిచేసే ముందు లైసెన్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా క్రిప్టోకరెన్సీలో డిపాజిట్లను చట్టబద్ధం చేయడం మినహా.. నియంత్రణ కొరవడింది.
విత్‌డ్రాలతోనే ఇబ్బందులు..
సంక్షోభంలో ఉన్న ఏ బ్యాంక్ అయినా మరింత కష్టాల్లోకి కూరుకుపోవడానికి ప్రధాన కారణం డిపాజిటర్ల విశ్వతనీయతను కోల్పోవడం.. వారు తమ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవడమే. సిలికాన్ వ్యాలీ బ్యాంకు విషయంలోనైనా.. సిగ్నేచర్ బ్యాంకు ఉదంతంలోనైనా జరిగింది ఇదే..! డిపాజిటర్లు ఒక్కసారిగా తమ నిల్వలను విత్‌డ్రా చేసుకోవడంతో.. అవి పతనమయ్యాయి. అమెరికాలో బ్యాంకు ఖాతాదారుల డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఖాతాదారుల డిపాజిట్లకు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(FDIC) భద్రత కల్పిస్తుంది. అయితే.. 2,50,000 డాలర్లలోపు డిపాజిట్లకే ఈ భద్రత ఉంటుంది. సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్ బ్యాంకుల్లో సింహభాగం ఖాతాదారుల నిల్వలు ఈ పరిమితికి మించి ఉన్నాయి. దాంతో ఆందోళన చెందిన వినియోగదారులు మూకుమ్మడిగా విత్‌డ్రాలు చేయడంతో.. ఈ రెండు బ్యాంకులు పతనమయ్యాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
క్రిప్టోపై ఆసక్తిచూపే బ్యాంకులకు గుణపాఠం?
ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంకులు క్రిప్టోకరెన్సీ వైపు మొగ్గుచూపుతున్నాయి. క్రిప్టో రూపంలో డిపాజిట్ల సేకరణకు ఉవ్విళ్లూరుతున్నాయి. క్రిప్టోకరెన్సీ మార్పిడి ప్లాట్‌ఫారాలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు సిగ్నేచర్ బ్యాంకు ఉదంతంతో ఆయా బ్యాంకులు క్రిప్టోకరెన్సీ డిపాజిట్ల విషయంలో వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా.. క్రిప్టోకరెన్సీని సైబర్ నేరగాళ్లు నిత్యం లక్ష్యంగా చేసుకుంటారు. హ్యాకర్ల దాడులు జరిగినప్పుడు ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతమవుతుంది. ఈ నేపథ్యంలో పటిష్ఠ భద్రత వ్యవస్థలు, బ్యాంకులకు సైబర్ సెక్యూరిటీపై మార్గదర్శకాలు, క్రిప్టో నియంత్రణ చర్యలు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సిగ్నేచర్ బ్యాంకు వివాదాలు
1. 2021లో డొనాల్డ్ ట్రంప్, అతని కుటుంబానికి మద్దతు ప్రకటించిందనే ఆరోపణలున్నాయి. అప్పట్లో ఈ బ్యాంకు నుంచి తమ ఖాతాలను ఉపసంహరించుకుంటామని వినియోగదారులు హెచ్చరికలు జారీ చేశారు.
2. కొవిడ్ సమయంలో పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం(PPP) విషయంలోనూ ఈ బ్యాంకులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చిన్న రుణగ్రహీతలను వేధించడం.. పెద్ద రుణగ్రహీతలకు పెద్దపీట వేయడంపైనా విమర్శలను ఎదుర్కొంది.
3. బ్యాంకు మొత్తంలో శ్వేతజాతీయులదే పైచేయి అనే విమర్శలున్నాయి. 2020లో దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. బ్యాంకు కార్యనిర్వాహక బృందం, డైరెక్టర్లలో అంతా శ్వేతజాతీయులే కావడం గమనార్హం..!
4. వివక్ష, రుణాల ముగింపు విషయంలో తప్పుడు లెక్కల ఆరోపణలపై కోర్టుల్లో దావాలున్నాయి.