కేంద్ర బ్యాంకులకూ బంగారమే!
ABN , First Publish Date - 2023-02-10T01:53:50+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులను ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఎందుకైనా మంచిదని తమ విదేశీ మారక ద్రవ్య నిల్వ ల్లో...
2022లో 1,136 టన్నుల కొనుగోలు
55 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు
మాంద్య భయాలే కారణం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులను ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఎందుకైనా మంచిదని తమ విదేశీ మారక ద్రవ్య నిల్వ ల్లో (ఫారెక్స్) బంగారాన్ని పెంచుకుంటున్నాయి. ఈ భయంతోనే గత ఏడాది (2022) వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు 1,136 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. గత 55 సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో పసిడి కొనుగోలు చేయలేదు. అంతకు ముందు సంవత్సరం 2021తో పోల్చినా ఇది 686 టన్నులు ఎక్కువ. గత ఏడాది కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారంలో ఎక్కువ భాగాన్ని చైనా, టర్కీ కేంద్ర బ్యాంకులే కొనుగోలు చేశాయి.
తగ్గిన ఆర్‌బీఐ కొనుగోళ్లు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాత్రం ఈ విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గింది. 2021లో కొనుగోలు చేసిన 77 టన్నులతో పోలిస్తే.. 2022లో కేవలం 33 టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. డాలర్‌తో రూపాయి మారకం రేటును నిలబెట్టేందుకు ఆర్‌బీఐ గత ఏడాది తన ఫారెక్స్ నిల్వల్లో 70,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.5.74 లక్షల కోట్లు) ఖర్చు చేసింది. ఈ కారణంతోనే గత ఏడాది బులియన్ మార్కెట్లో ఆర్‌బీఐ దూకుడు తగ్గిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యుజీసీ) అంచనా వేసింది. ఆర్థిక మాంద్యం భయాలకు తోడు మరికొన్ని అంశాలు కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనేలా చేస్తున్నాయి.
ద్రవ్యోల్బణం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. దీంతో షేర్లు, రుణ పత్రాలు, ఆయా దేశాల కరెన్సీల మారకం రేటు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బ్యాంకులకు సురక్షిత పెట్టుబడిగా కనిపిస్తోంది. ఈ కారణంతోనే తమ ఫారెక్స్ నిల్వల్లో కొంత భాగాన్ని ‘పసిడి’ రూపంలో భద్రపరుస్తున్నాయి.
మరింత ముందుకే
అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. కమోడిటీల ధరలు ప్రస్తుతం కొద్దిగా తగ్గినా.. మళ్లీ ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి. దీంతో ఈ సంవత్సరం కూడా పసిడి పెట్టుబడులకు ఢోకా ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 1,880-1,885 డాలర్ల మధ్య ట్రేడవుతున్న పసిడి ఈ ఏడాది 1,990-2,000 డాలర్ల మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మార్కెట్లో డిజిటల్ వెండి
రూపాయితోనూ కొనుగోలు: ఎంఎంటీసీ
భవిష్యత్ అవసరాల కోసం వెండి కొనాలనుకునే వారికి మరో ఆప్షన్. ఇక డిజిటల్ రూపంలోనూ ఈ లోహాన్ని కొనుగోలు చేయవచ్చు. ఎంఎంటీసీ-పాంప్ సంస్థ ఈ అవకాశం కల్పిస్తోంది. రూపాయి కనీస పెట్టుబడితో కూడా ఈ డిజిటల్ వెండి కొనుగోలు చేయవచ్చని ఎంఎంటీసీ-పాంప్ సంస్థ ఎండీ వికాస్ సింగ్ చెప్పారు. కొన్న తర్వాత ఈ డిజిటల్ సిల్వర్‌ను తమ డిజిటల్ వాల్ట్‌లో భద్రపరుచుకుని, అవసరమైనప్పుడు భౌతిక రూపంలో ఉన్న వెండి తీసుకోవచ్చని తెలిపారు. సామాన్యుడికి సైతం వెండిని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. మదుపరులు ఎవరైనా ఎంఎంటీసీ-పాంప్ పోర్టల్ ద్వారా ఈ డిజిటల్ సిల్వర్ కొనుగోలు చేయవచ్చు.