బ్లాక్‌ చేస్కో..!

ABN , First Publish Date - 2023-03-30T03:01:57+05:30 IST

క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా’ (సెబీ) బోర్డు బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రైమరీ మార్కెట్‌ తరహాలో సెకండరీ మార్కెట్‌లోనూ ఫండ్స్‌ బ్లాకింగ్‌ వసతిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది...

బ్లాక్‌ చేస్కో..!

సెకండరీ మార్కెట్‌ ఇన్వెస్టర్లూ తమ ఖాతాలోనే ఫండ్స్‌ బ్లాక్‌ చేసుకోవచ్చు

స్టాక్‌ బ్రోకర్ల నిధుల దుర్వినియోగానికి చెక్‌.. సెబీ బోర్డు కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా’ (సెబీ) బోర్డు బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రైమరీ మార్కెట్‌ తరహాలో సెకండరీ మార్కెట్‌లోనూ ఫండ్స్‌ బ్లాకింగ్‌ వసతిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. స్టాక్‌ బ్రోకర్లు మదుపర్ల సొమ్మును దుర్వినియోగం చేయడం, డిఫాల్ట్‌ కావడం వంటి సంఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైమరీ మార్కెట్‌ ద్వారా పబ్లిక్‌ ఆఫరింగ్స్‌ (ఐపీఓ) లేదా ఇతర పథకాల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ఫండ్స్‌ బ్లాక్‌ చేసుకునే వసతి ‘అప్లికేషన్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్డ్‌ అమౌంట్‌’ (ఏఎ్‌సబీఏ) ఇప్పటికే అందుబాటులో ఉంది. తద్వారా మదుపరికి కేటాయింపులు జరిగాకే తన ఖాతా నుంచి సొమ్ము బదిలీ జరుగుతుంది. సెకండరీ మార్కెట్లోనూ ఈ వసతి అందుబాటులోకి వస్తే, ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ జరిపేందుకు సొమ్మును స్టాక్‌ బ్రోకర్‌ ఖాతాకు బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు. క్లియరింగ్‌ కార్పొరేషన్‌ (సీసీ) పేరిట సొమ్మును తన బ్యాంక్‌ ఖాతాలోనే బ్లాక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మదుపరి తన పొదుపు ఖాతాలోనే బ్లాక్‌ చేసి ఉంచిన సొమ్ము బదిలీ అయ్యేంతవరకు వడ్డీ కూడా పొందగలుగుతారు. ప్రస్తుతానికి సెకండరీ మార్కెట్‌ ఇన్వెస్టర్లు, స్టాక్‌ బ్రోకర్లకు ఈ వసతి ఐచ్ఛికమేనని సెబీ స్పష్టం చేసింది.

‘శాశ్వత బోర్డు సీటు’కు స్వస్తి: లిస్టెడ్‌ కంపెనీల బోర్డుల్లో శాశ్వత సభ్యత్వాలకు స్వస్తి పలుకుతున్నట్లు సెబీ తెలిపింది. బోర్డు సభ్యులను కొనసాగించేందుకు ప్రతి ఐదేళ్లకు తప్పనిసరిగా షేర్‌హోల్డర్ల ఆమోదం పొందాల్సి ఉంటుంది. కొన్ని లిస్టెడ్‌ కంపెనీల ప్రమోటర్లు పర్మినెంట్‌గా బోర్డులో కొనసాగడం ద్వారా అయాచిత లబ్ధి పొందుతున్నారని, తద్వారా ఆ కంపెనీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతోందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.

కీలక సమాచారం సకాలంలో వెల్లడించాల్సిందే: లిస్టెడ్‌ కంపెనీల్లో పాలనపరంగా పారదర్శకత పెంచడంతో పాటు షేరు ధరను ప్రభావితం చేయగలిగే పరిణామాలు, సమాచారాన్ని కంపెనీలు సకాలంలో వెల్లడించేలా నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు సెబీ వెల్లడించింది. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను 30 నిమిషాల్లోగా ఎక్స్ఛేంజ్‌లకు వెల్లడించాలి. కంపెనీ అంతర్గతంగా పుట్టుకొచ్చిన సమాచారాన్ని 12 గంటల్లోగా తెలియజేయాల్సి ఉంటుంది. మార్కెట్‌ విలువపరంగా టాప్‌-100 లిస్టె డ్‌ కంపెనీలు ఈ అక్టోబరు 1 నుంచి మార్కెట్‌ రూమర్లపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. టాప్‌ 250 కంపెనీలకు ఈ నిబంధన 2024 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తుంది.

ఎంఎ్‌ఫల యజమానులుగా పీఈ ఫండ్లు: ఇకపై ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) ఫండ్లు సైతం మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) సంస్థలను స్పాన్సర్‌ చేసేందుకు సెబీ అనుమతించింది. అంటే, ఇకపై పీఈ ఫండ్స్‌ కూడా ఎంఎ్‌ఫల యజమానిగా ఉండవచ్చు. అలాగే, తమను తామే స్పాన్సర్‌ చేసుకుంటున్న అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీ) కొన్ని షరతులకు లోబడి మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారాన్ని కొనసాగించేందుకు సెబీ అనుమతించింది.

రూ.3,000 కోట్లతో ఫండ్‌: దేశంలో కార్పొరేట్‌ డెట్‌ మార్కెట్‌ అభివృద్ధి కోసం రూ.3,000 కోట్ల కార్ప్‌సతో ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సెబీ తెలిపింది. ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్‌ (ఏఐఎఫ్‌) రూపంలో దీని ఏర్పాటు జరగనుంది. మార్కెట్లో ఒత్తిడి నెలకొన్నప్పుడు పెట్టుబడులు పెట్టదగిన కార్పొరేట్‌ సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు ఈ కార్పస్‌ను ఉపయోగించనుంది.

కార్వీ తరహా ఉదంతం పునరావృతం కానివ్వం: క్యాపిటల్‌ మార్కెట్లో కార్వీ తరహా ఉదంతాన్ని పునరావృతం కానివ్వమని సెబీ చీఫ్‌ మాధవి పురి బుచ్‌ అన్నారు. బ్రోకరేజీలకు సంబంధించి, ప్రత్యేకించి డిస్కౌంట్‌ బ్రోకర్లకు ఏం మిగలట్లేదన్న ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వారు బాగానే ఆర్జిస్తున్నట్లు మార్కెట్‌ డేటాను బట్టి తెలుస్తోందన్నారు. అతిపెద్ద డిస్కౌంట్‌ బ్రోకరేజీ సంస్థ జీరోధా గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.2,900 కోట్ల నికర ఆదాయం గడించిందన్నారు.

హైదరాబాద్‌కు చెందిన కార్వీ బ్రోకింగ్‌.. 95,000 మంది క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన షేర్లను సొంత అవసరాలకు తాకట్టు పెట్టుకున్న కుంభకోణం 2019లో వెలుగు చూసింది.

‘అదానీ’పై నో కామెంట్‌

అదానీ గ్రూప్‌ అంశంపై వ్యాఖ్యానించేందుకు సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌ నిరాకరించారు. ప్రత్యేకంగా ఒక కంపెనీ గురించి వ్యాఖ్యానించడం సెబీ పాలసీ కాదని.. పైగా, ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమన్నారు. అదానీ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

స్టాక్‌ బ్రోకర్ల మోసాలకు అడ్డుకట్ట

స్టాక్‌ బ్రోకర్ల మోసాలు, మార్కెట్‌ దుర్వినియోగాన్ని నిరోధించడం, గుర్తించేందుకు అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సెబీ తెలిపింది. ఇందుకోసం, స్టాక్‌ బ్రోకర్స్‌కు నిబంధనలను సవరించనున్నట్లు, అందులోభాగంగా ప్రజావేగు (విజిల్‌ బ్లోయర్‌) విధానంతో పాటు ట్రేడింగ్‌ కార్యకలాపాలపై నిఘా, అంతర్గత నియంత్రణకు వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. సవరించిన నిబంధనలు ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి అమలులోకి రానున్నాయి. అలాగే, మదుపరుల సొమ్మును దుర్వినియోగం కాకుండా అడ్డుకునేందుకు స్టాక్‌ బ్రోకర్లు, క్లియరింగ్‌ సభ్యులు ట్రేడింగ్‌ ముగిశాక క్లయింట్ల సొమ్మును తమ వద్ద అట్టిపెట్టుకోకుండా మొత్తం నిధులను అదే రోజున క్లియరింగ్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయాలని సెబీ నిర్దేశించింది.

Updated Date - 2023-03-30T03:02:29+05:30 IST