బ్యాంక్ డిపాజిట్లే బెటర్
ABN , Publish Date - Dec 28 , 2023 | 02:39 AM
భారత పౌరులకు పొదుపు చేయడం అంటే బ్యాం కు డిపాజిట్లలో డబ్బు ఇన్వెస్ట్ చేయడం, బంగారం కొనుగోలు చేయడమేనని మరోసారి తేలిం ది. మనీ 9 వార్షిక పర్సనల్ ఫైనాన్స్ పల్స్ సర్వేలో...
భారతీయులకు తగ్గని మోజు
న్యూఢిల్లీ: భారత పౌరులకు పొదుపు చేయడం అంటే బ్యాం కు డిపాజిట్లలో డబ్బు ఇన్వెస్ట్ చేయడం, బంగారం కొనుగోలు చేయడమేనని మరోసారి తేలిం ది. మనీ 9 వార్షిక పర్సనల్ ఫైనాన్స్ పల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 77 శాతం మంది బ్యాంక్ డిపాజిట్లలో పొదుపు చేయడానికే మొగ్గు చూపగా 21 శాతం మంది బంగారం పెట్టుబడులపై ఆసక్తిని ప్రకటించారు. అయితే 2023 సంవత్సరంలో ప్రజల్లో బీమా పట్ల సానుకూల ధోరణి కూడా ఏర్పడిందని ఆ సంస్థ తన నివేదికలో తెలిపింది. 2022 సంవత్సరంలో బీమా పట్ల ఆసక్తి వ్యక్తం చేసిన వారు 19 శాతం ఉండగా ఈ ఏడాది అది 27 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. అయినప్పటికీ 53 శాతం మంది గృహస్తులకు ఇప్పటికీ ఆరోగ్య బీమా కవరేజి లేదని సర్వేలో తేలింది. ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలకు దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పట్ల కూడా ఆదరణ పెరిగింది. గత ఏడాదితో పోల్చితే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంఖ్య 3 శాతం నుంచి 9 శాతానికి పెరిగింది. మ్యూచువల్ పండ్లలో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య 6 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. విలాసవంతమైన జీవనశైలి అనుసరిస్తున్న గృహస్తుల సంఖ్య కూడా 3 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. అయితే విలాసవంతమైన జీవనశైలి పట్టణాలకే పరిమితం కావడం విశేషం.