సెప్టెంబరులో ఆటో రయ్ రయ్..
ABN , First Publish Date - 2023-10-02T02:33:12+05:30 IST
ఈ ఏడాది సెప్టెంబరులో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాయి. రానున్న పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని డీలర్లకు స్టాక్స్‌ను పంపించటంతో ఆటోమొబైల్ విక్రయాలు దూసుకుపోయాయి...
ఆటోమొబైల్ కంపెనీలకు కలిసొచ్చిన పండగ డిమాండ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరులో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాయి. రానున్న పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని డీలర్లకు స్టాక్స్‌ను పంపించటంతో ఆటోమొబైల్ విక్రయాలు దూసుకుపోయాయి. గత నెలలో ఆటోమొబైల్ పరిశ్రమ 3,63,733 యూనిట్లను డిస్పాచ్ చేసింది. ఆగస్టు నెలలో ఇవి 3,60,700 యూనిట్లుగా ఉన్నాయి. భారతీయ ప్యాసింజర్ వాహన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబరు నెలలో అమ్మకాలు రికార్డు స్థాయిని నమోదు చేశాయని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. పండగల సీజన్ ప్రారంభం కావటంతో ఈ నెల 14 నుంచి డీలర్లు కార్లను డెలివరీ చేసేందుకు రెడీ అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు నెలలో పలు పండగల కారణంగా తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో కార్ల విక్రయాలు అనూహ్యంగా పెరిగాయన్నారు. మరోవైపు చిప్‌ల సరఫరాలు నిలకడగా ఉండటంతో సరఫరాలు మెరుగుపడ్డాయని శ్రీవాత్సవ తెలిపారు. కాగా ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో మొత్తం కార్ల విక్రయాలు 20 లక్షల మార్కును అధిగమించాయని పేర్కొన్నారు.
సెప్టెంబరులో మారుతి సుజుకీ విక్రయాలు 3 శాతం వృద్ధితో 1,81,343 యూనిట్లుగా నమోదవగా హ్యుండయ్ మోటార్ విక్రయాలు 13 శాతం పెరిగి 71,641 యూనిట్లుగా నమోదయ్యాయి. మరోవైపు టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు ఏకంగా 23 శాతం వృద్ధితో 23,590 యూనిట్లకు చేరుకోగా టాటా మోటార్స్ 82,023 యూనిట్లు, ఎంజీ మోటార్ 5,003 యూనిట్లు, మహీంద్రా అండ్ మహీంద్రా 75,604 యూనిట్లు, హోండా కార్స్ 9,861 యూనిట్లను విక్రయించాయి.