ఏపీలో తొలి ప్రైవేట్ బంగారు గని జొన్నగిరి ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి షురూ..
ABN , First Publish Date - 2023-10-09T02:54:11+05:30 IST
దేశంలో ప్రైవేట్ రంగంలోని తొలి బంగా రు గని అయిన ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి ప్రాజెక్ట్‌లో వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కానుందని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) ఎండీ హనుమ ప్రసాద్ వెల్లడించారు...
వచ్చే ఏడాది చివరికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ రంగంలోని తొలి బంగా రు గని అయిన ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి ప్రాజెక్ట్‌లో వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కానుందని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) ఎండీ హనుమ ప్రసాద్ వెల్లడించారు. ఇండియన్ మైన్ (జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్) పేరిట రూ.200 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్న ఈ బంగారు గనిలో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ నెలకి ఒక కిలో బంగార ం ఉత్పత్తి అవుతోంది. ఏడాదికి 750 కిలోగ్రాముల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ మైన్‌లో వచ్చే ఏడాది చివరికి (అక్టోబరు, నవంబరు) పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ప్రసాద్ తెలిపారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరాయి గ్రామాల్లో ఈ గని విస్తరించి ఉంది. జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న ఈ గనిలో డీజీఎంఎల్‌కు 40 శాతం వాటా ఉంది. బీఎ్‌సఈలో లిస్టింగ్ అయిన బంగారం అన్వేషణలోని తొలి, ఏకైక కంపెనీ ఇదే. 2013లో ఈ గనికి అనుమతి లభించింది. ఈ గని అన్వేషణకు సుమారు 8-10 సంవత్సరాలు పట్టిందని ప్రసాద్ అన్నారు. కిర్గిస్తాన్‌లో డీజీఎంఎల్ చేపట్టిన మరో బంగారు గని అల్టిన్ టార్ గోల్డ్ మైన్‌లో కూడా వచ్చే ఏడాది అక్టోబరు లేదా నవంబరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కావచ్చని ఆయన చెప్పారు. ఈ గనికి ఏడాదికి 400 కిలోల ఉత్పత్తి సామర్థ్యం ఉండవచ్చని ఆయన అన్నారు. డీజీఎంఎల్ కార్యకలాపాలు ప్రధానంగా కర్ణాటకలో అన్వేషణ కార్యకలాపాలు చేపడుతోంది. ధార్వాడ్ క్రేటన్ ప్రాంతంలోని ఆర్చియన్ గ్రీన్‌స్టోన్ ప్రాంతంలో హుట్టి, ధార్వాడ్, షిమోగా బెల్టులో బంగారు నిక్షేపాలున్నట్టు గుర్తించారు.