మరో రూ.1,000 కోట్ల పెట్టుబడులు
ABN , First Publish Date - 2023-11-21T01:39:40+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించి ఎన్ఎండీసీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.1,600 కోట్ల పెట్టుబడులు...

5 కోట్ల టన్నుల ఉత్పత్తికి చేరతాం: ఎన్ఎండీసీ సీఎండీ ముఖర్జీ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించి ఎన్ఎండీసీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.1,600 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాం. ఇప్పటికే రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టాం. ద్వితీయార్ధంలో మరో రూ.1,000 కోట్ల వరకూ పెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద పూర్తి ఏడాదికి పెట్టుబడులు రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకూ ఉండవచ్చని ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ ఇన్వెస్టర్ల సమావేశంలో తెలిపారు. బచేలి వద్ద ఇనుప ఖనిజం తవ్వక సామర్థ్యం 20 లక్షల టన్నుల మేర పెరగనుంది. కర్ణాటకలోని కుమారస్వామి మైన్‌లో అదనంగా 22 లక్షల టన్నుల తవ్వకానికి తుది అనుమతి రానుంది. ఈ రెండింటి వల్ల ఎన్ఎండీసీ ఇనుప ఖనిజం ఉత్పత్తి పెరగనుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 4.7-4.9 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని మించి 5 కోట్ల టన్నులకు ఇనుప ఖనిజం ఉత్పత్తి చేరడానికి అవకాశం ఉందని చెప్పారు. 113 కిలోమీటర్ల స్లర్రీ పైపులైన్లో 70 కిలోమీటర్లను ఎన్ఎండీసీ పూర్తి చేసింది. ఎన్ఎండీసీ స్టీల్‌కు ఇనుప ఖనిజం సరఫరా చేయడాన్ని ప్రారంభించింది.