Adani FPO: ఎఫ్‌పిఓ ఉపసంహరణ... అదానీ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2023-02-01T23:35:18+05:30 IST

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక చేసిన తీవ్ర ఆరోపణల మధ్య అదానీ షేర్లు నష్టాల్లో కొనసాగుతూ మొదటి రెండు రోజూలూ నత్తనడకలా సాగిన ఈ ఎఫ్‌పిఓ...

Adani FPO: ఎఫ్‌పిఓ ఉపసంహరణ... అదానీ సంచలన నిర్ణయం
Gautam Adani

ముంబై: రూ.20 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్‌కు (FPO) వెళ్లిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) ఆ ఎఫ్‌పిఓను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. మంగళవారం ఈ ఎఫ్‌పిఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయినప్పటికీ అదానీ గ్రూప్ (Adani Group) ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg research) నివేదిక చేసిన తీవ్ర ఆరోపణల మధ్య అదానీ షేర్లు నష్టాల్లో కొనసాగుతూ మొదటి రెండు రోజూలూ నత్తనడకలా సాగిన ఈ ఎఫ్‌పిఓ చివరి రోజున పూర్తి సబ్‌స్క్రిప్షన్‌తో గట్టెక్కింది. అయితే, ప్రస్తుత మార్కెట్లలో కొనసాగుతున్న ఒడుదుడుకులు, అనూహ్య పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎఫ్‌పిఓ పట్ల నమ్మకంతో ముందుకు వచ్చిన ఇన్వెస్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇన్వెస్టర్లకు వారి సొమ్మును తిరిగిచ్చేందుకు తమ లీడ్ మేనేజర్స్‌తో పని చేస్తున్నామని, తమ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉందని, ఎఫ్‌పిఓ ఉపసంహరణ నిర్ణయం తమ ప్రస్తుత, భవిష్య కార్యాచరణపై ప్రభావాన్ని చూపించదని గౌతమ్ అదానీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మార్కెట్లు స్థిరపడిన తర్వాత క్యాపిటల్ మార్కెట్ వ్యూహాలను సమీక్షించుకుంటామన్నారు.

Updated Date - 2023-02-01T23:51:34+05:30 IST