కష్టాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
ABN , First Publish Date - 2023-06-07T03:04:15+05:30 IST
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది (2022) 3.1 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ సంవత్సరం 2.1 శాతం మించకపోవచ్చని తెలిపింది...
ఈ ఏడాది వృద్ధి రేటు 2.1 శాతం మించదు
భారత వృద్ధి రేటు 6.3 శాతమే
దెబ్బతీస్తున్న అధిక వడ్డీ రేట్లు
ప్రపంచ బ్యాంక్ వెల్లడి
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది (2022) 3.1 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ సంవత్సరం 2.1 శాతం మించకపోవచ్చని తెలిపింది. అయితే ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన 1.7 శాతం కంటే ఇది 0.4 శాతం ఎక్కువ. ధరల సెగను తట్టుకునేందుకు ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు అదే పనిగా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవడం ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారిందని స్పష్టం చేసింది.
భారత్‌కూ కష్టాలే: ఈ సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థకూ కష్టాలు తప్పవని ప్రపంచ బ్యాంక్ అంచనా. గత ఆర్థిక సంవత్సరం 7.2 శాతంగా ఉన్న భారత జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం 6.3 శాతం మించకపోవచ్చని పేర్కొంది. జపాన్ జీడీపీ వృద్ధి రేటూ ఇదే సమయంలో ఒక శాతం నుంచి 0.8 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇంధన ధరల షాక్‌తో ఈయూ దేశాల జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 0.4 శాతం మించకపోవచ్చని అంచనా వేసింది. వడ్డీ రేట్ల సెగ ఉన్నా అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం ఈ సంవత్సరం 1.1 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని తెలిపింది.
దిగిరానున్న ఇంధన ధరలు: ఈ ఏడాది, వచ్చే ఏడాది ఇంధన ధరలు బాగా దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా. రోజువారీ చమురు ఉత్పత్తిని 10 లక్షల బ్యారళ్ల మేర కుదించాలని సౌదీ అరేబియా నిర్ణయించిన కొద్ది రోజులకే ప్రపంచ బ్యాంక్ ఈ విషయం చెప్పడం విశేషం. దీంతో వచ్చే ఏడాది ప్రపంచ జీడీపీ 2.4 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గత ఏడాది మూడు శాతంగా ఉన్న చైనా జీడీపీ వృద్ధి రేటు మాత్రమే ఈ ఏడాది 5.6 శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.