బంగారంపై తగ్గిన మోజు

ABN , First Publish Date - 2023-08-02T02:25:52+05:30 IST

భారత్‌ సహా ప్రపంచంలో ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో బంగారానికి డిమాండ్‌ గణనీయంగా తగ్గినట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) నివేదిక వెల్లడించింది. డబ్యూజీసీ గణాంకాల ప్రకారం...

బంగారంపై తగ్గిన మోజు

డబ్ల్యూజీసీ వెల్లడి

  • జూన్‌ త్రైమాసికంలో 7% తగ్గిన డిమాండ్‌

  • చుక్కలనంటిన ధరలే కారణం

న్యూఢిల్లీ: భారత్‌ సహా ప్రపంచంలో ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో బంగారానికి డిమాండ్‌ గణనీయంగా తగ్గినట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) నివేదిక వెల్లడించింది. డబ్యూజీసీ గణాంకాల ప్రకారం మొదటి త్రైమాసికంలో దేశీయంగా బంగారం డిమాండ్‌ 7 శాతం తగ్గి 158.1 టన్నులకు క్షీణించింది. గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో బంగారం డిమాండ్‌ 170.7 టన్నులుంది. అయితే బంగారం దిగుమతులు మాత్రం 16 శాతం పెరిగి 209 టన్నులకు చేరాయి. జూన్‌ 30తో ముగిసిన అర్ధ సంవత్సరం కాలంలో డిమాండ్‌ 271 టన్నులుగా ఉన్నదని, దీన్నిబట్టి 2023 సంవత్సరం మొత్తం మీద 650-750 టన్నులుగా ఉండవచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. అతి తక్కువ కాలం లో బంగారం ధరలు విశేషంగా పెరిగిపోయి 10 గ్రాములు రూ.64,000 రికార్డును తాకాయని తెలిపింది. ధరలు పెరిగిన ప్రభావంతో విలువపరంగా బంగారం డిమాండ్‌ మాత్రం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే రూ.79,270 కోట్ల నుంచి రూ.82,530 కోట్లకు పెరిగింది. అంటే బంగారం డిమాండ్‌ విలువ 4 శాతం పెరిగింది.

నివేదికలోని ప్రధానాంశాలు

  • ఆభరణాల డిమాండ్‌ కూడా 8 శాతం క్షీణించి 140.3 టన్నుల నుంచి 128.6 టన్నులకు పడిపోయింది.

  • 18 క్యారట్ల బంగారం ఆభరణాలు భరించగల స్థాయిలో ఉన్నాయని వినియోగదారులు భావిస్తుండడంతో వాటి డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది.

  • బంగారం కడ్డీలు, నాణేల డిమాండ్‌ కూడా స్వల్పంగా తగ్గి 30.4 టన్నుల నుంచి 29.5 టన్నులకు దిగజారింది.

  • బంగారం డిమాండ్‌ బలహీనంగా ఉండే ధోరణి భవిష్యత్తులో కూడా కొనసాగవచ్చు. ప్రస్తుతానికి డిమాండ్‌ బాగున్నట్టుగానే భావిస్తున్నప్పటికీ ఏడాది ద్వితీయార్ధంలో మాత్రం అప్రమత్త వైఖరి అనుసరించక తప్పదు.

ప్రపంచంలోనూ అదే ధోరణి

ప్రపంచవ్యాప్తంగా ఓవర్‌ ది కౌంటర్‌ (ఓటీసీ) లావాదేవీలు జూన్‌ త్రైమాసికంలో 2 శాతం తగ్గి 921 టన్నులకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కూడా 103 టన్నులకు తగ్గినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. ఏడాది ప్రథమార్ధం పరిగణనలోకి తీసుకుంటే ఈ కొనుగోళ్లు 387 టన్నులుగా ఉన్నాయి.

‘‘బంగారం ధరలు రికార్డు స్థాయిల్లో ఉండడమే డిమాండ్‌ తగ్గడానికి కారణం. ధరలు ప్రజలు భరించగల స్థాయిని దాటిపోవడం వల్ల వినియోగ సెంటిమెంట్‌ దెబ్బతింది. దీనికి తోడు టాక్స్‌ కంప్లయెన్స్‌ కూడా డిమాండ్‌ను ప్రభావితం చేసింది’’

సోమసుందరం,

డబ్ల్యూజీసీ కౌన్సిల్‌ ప్రాంతీయ సీఈఓ

Updated Date - 2023-08-02T02:25:52+05:30 IST