క్రెడిట్‌ కార్డు వ్యయాల కొత్త రికార్డు

ABN , First Publish Date - 2023-07-17T01:32:03+05:30 IST

దేశంలో క్రెడిట్‌ కార్డు వ్యయాలు మే నెలలో రికార్డు గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయి. ప్రజలు గరిష్ఠంగా రూ.1.4 లక్షల కోట్లు క్రెడిట్‌ కార్డులపై వ్యయం చేశారు...

క్రెడిట్‌ కార్డు వ్యయాల కొత్త రికార్డు

మే నెలలో రూ.1.4 లక్షల కోట్లు

కార్డుపై సగటు వ్యయం రికార్డు రూ.16,144

న్యూఢిల్లీ: దేశంలో క్రెడిట్‌ కార్డు వ్యయాలు మే నెలలో రికార్డు గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయి. ప్రజలు గరిష్ఠంగా రూ.1.4 లక్షల కోట్లు క్రెడిట్‌ కార్డులపై వ్యయం చేశారు. గత ఏడాది అంతా క్రెడిట్‌ కార్డు వ్యయాలు పరిమిత పరిధిలోనే కదలాడాయి. నెలవారీగా సగటు వృద్ధి 5 శాతం మాత్రమే నమోదైంది. కాగా ఈ ఏడాది జనవరి నుంచి క్రెడిట్‌ కార్డు వ్యయాలు నిలకడగా పెరుగుతూ వచ్చాయి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) డేటా ప్రకారం వినియోగంలో ఉన్న కార్డుల సంఖ్య 50 లక్షలకు పైబడి పెరిగి మే నెలలో 8.74 కోట్లకు చేరింది. ఇది చారిత్రక గరిష్ఠ స్థాయి. కొత్తగా జోడైన వాటిలో 20 లక్షల కార్డులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల కాలంలోనే వినియోగంలోకి వచ్చాయి.

సంవత్సరం అంతా క్రెడిట్‌ కార్డు వ్యయాలు రూ.1.1 నుంచి రూ.1.2 లక్షల కోట్ల పరిధిలో ఉండి మే నెలలో చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1.4 లక్షల కోట్లకు చేరాయి. క్రెడిట్‌ కార్డులపై సగటు వ్యయం మరో చారిత్రక గరిష్ఠం రూ.16,144కి చేరింది.

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకుదే అగ్రస్థానం

బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌.. మే నెలలో 1.81 కోట్ల సర్క్యులేషన్‌లో ఉన్న కార్డులతో బ్యాంకింగ్‌ రంగంలో అగ్రస్థానంలో ఉంది. మొత్తం పరిశ్రమలో రాబట్టవలసిన బకాయిల్లో 28.5 శాతం వాటాతో ఆ విభాగంలోనూ అగ్రస్థానంలోనే నిలిచింది. 1.71 కోట్ల కార్డులతో ఎస్‌బీఐ, 1.45 కోట్ల కార్డులతో ఐసీఐసీఐ బ్యాంక్‌, 1.25 కోట్ల కార్డులతో యాక్సిస్‌ బ్యాంక్‌ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఇటీవల సిటీ బ్యాంకుకు చెందిన క్రెడిట్‌ కార్డు వ్యాపారాలను కొనుగోలు చేయడం యాక్సిస్‌ బ్యాంక్‌కు కలిసి వచ్చింది. సిటీ బ్యాంకుకు 1,62,150 యాక్టివ్‌ క్రెడిట్‌ కార్డులున్నాయి.

బకాయిలు పెరుగుతున్నాయ్‌...

బ్యాంకుల క్రెడిట్‌ కార్డుల పోర్ట్‌ఫోలియోలో బకాయిలు క్రమంగా పెరుగుతున్నట్టు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ నివేదిక తెలుపుతోంది. ఈ ఏడాది మార్చితో బకాయిలు 0.66% పెరిగి 2.94 శాతానికి చేరాయి. ఆర్‌బీఐ అన్‌సెక్యూర్డ్‌ రుణాలపై ఇటీవల ఆందోళన ప్రకటించింది. వాటిలో క్రెడిట్‌ కార్డులు, పర్సనల్‌ రుణాల బకాయిలు వేగంగా పెరుగు తున్నట్టు హెచ్చరించింది. రుణ వృద్ధి కోణంలో చూసినా ఈ ఏడాది మార్చి నాటికి వసూలు కావాల్సిన బకాయిలు క్రెడిట్‌ కార్డులపై 34%, పర్సనల్‌ రుణాలపై 29% ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.

నెల కార్డుల వినియోగం

జనవరి 8.24 కోట్లు

ఫిబ్రవరి 8.33 కోట్లు

మార్చి 8.53 కోట్లు

ఏప్రిల్‌ 8.65 కోట్లు

మే 8.74 కోట్లు

Updated Date - 2023-07-17T01:32:03+05:30 IST