అమరరాజా బ్యాటరీస్‌ లాభంలో 53% వృద్ధి

ABN , First Publish Date - 2023-01-26T01:20:28+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి అమరరాజా బ్యాటరీస్‌ రూ.221.88 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని...

అమరరాజా బ్యాటరీస్‌ లాభంలో 53% వృద్ధి

మూడో త్రైమాసికానికి రూ.222 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి అమరరాజా బ్యాటరీస్‌ రూ.221.88 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.145.3 కోట్లతో పోలిస్తే 52.7 శాతం పెరిగింది. ఇదే కాలానికి మొత్తం ఆదాయం రూ.2,384.82 కోట్ల నుంచి రూ.2,664.28 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలలకు రూ.8,026.24 కోట్ల ఆదాయంపై రూ.555.11 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం పెరగడానికి ఆటోమోటివ్‌ బ్యాటరీల విక్రయాలు పరిమాణపరంగా పెరగడమే కారణమని అమరరాజా బ్యాటరీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆటోమోటివ్‌, ఇండస్ట్రియల్‌ బ్యాటరీస్‌) హర్షవర్ధన గౌరినేని తెలిపారు. ఇండస్ట్రియల్‌ బ్యాటరీల విభాగంలో కూడా పరిమాణపరంగా విక్రయాల్లో ఆకర్షణీయమైన వృద్ధి నమోదైందన్నారు.

కంపెనీ వేగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన వ్యాపారం దిశగా అడుగులు వేస్తోందని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (న్యూ ఎనర్జీ బిజినెస్‌) విక్రమాదిత్య గౌరినేని తెలిపారు. అంతర్జాతీయ మాంద్యంపై దేశీయ మార్కెట్లో భయాలు నెలకొన్నప్పటికీ.. కంపెనీ పనితీరు సంతృప్తికరంగా ఉందని అమరరాజా బ్యాటరీస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయదేవ్‌ గల్లా చెప్పారు.

Updated Date - 2023-01-26T01:20:28+05:30 IST