ఒక్క విద్యార్థీ చేరలేదు!
ABN , First Publish Date - 2023-07-21T03:14:43+05:30 IST
ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 319 పాఠశాలల్లో కొత్తగా ఒక్క విద్యార్థీ చేరలేదు. అందులో 201 ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలుంటే, 118 ప్రభుత్వ బడులున్నాయి.
319 పాఠశాలల్లో సున్నా అడ్మిషన్లు
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 319 పాఠశాలల్లో కొత్తగా ఒక్క విద్యార్థీ చేరలేదు. అందులో 201 ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలుంటే, 118 ప్రభుత్వ బడులున్నాయి. వైసీపీ ప్రభుత్వం గతేడాది ఏకపక్షంగా చేపట్టిన తరగతుల విలీనం ప్రక్రియ బడులపై పిడుగులా పడింది. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి మరింత దిగజారింది. మరోవైపు ఈ ఏడాది 2వేలకు పైగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 లోపునకు పడిపోవడంతో వాటిని ఏకోపాధ్యాయ స్కూళ్లుగా మార్చేశారు. రాష్ట్రంలో 9,602 సింగిల్ టీచర్ స్కూళ్లు ఉంటే వాటిలో దాదాపు సగం బడుల్లో పిల్లలు పది మంది కూడా లేరు. పాఠశాల విద్యాశాఖ నిబంధనల ప్రకారం 20మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను కేటాయించింది. ఆ సంఖ్య దాటితే రెండో టీచర్‌ను ఇస్తారు. కానీ 20మందిలోనూ సగమే ఉంటే వాటిని విలీనం చేయడమే నయమనే ఆలోచనలో ఉంది. జీరో అడ్మిషన్లు ఉన్న పాఠశాలలను ఇతర పాఠశాలల్లో కలపాలని మౌఖికంగా క్షేత్రస్థాయికి ఆదేశాలు అందినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.