Share News

YS Sharmila : ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా షర్మిల!

ABN , Publish Date - Dec 26 , 2023 | 02:52 AM

వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా నియమితురాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

YS Sharmila : ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా షర్మిల!

కొత్త ఏడాది ప్రారంభంలోనే ప్రకటన?

ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దల కీలక మంతనాలు

న్యూఢిల్లీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా నియమితురాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌ పెద్దలు ఏపీలో కూడా పార్టీ పుంజుకోవాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిలకు పార్టీ బాఽధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. వాళ్లు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే... కొత్త సంవత్సరం ప్రారంభంలోనే షర్మిల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశముంది. ‘‘మాకు సమయం ఎక్కువగా లేదు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరితే ఏపీలో కాంగ్రె్‌సతో పాటు ఆమె భవితవ్యం కూడా బాగుంటుందని భావిస్తున్నాం’’ అని ఒక కాంగ్రెస్‌ నేత అన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మాణిక్కం ఠాగూర్‌కు కూడా ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలనపై వైసీపీలోనే తీవ్ర అసంతృప్తి ఉందని, ఆ పార్టీలోని పలువురు నేతలు ఇప్పటికే షర్మిలతో టచ్‌లో ఉన్నారని కాంగ్రె్‌సకు అంతర్గత సమాచారం అందింది. షర్మిల కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమైన నేతలు కాంగ్రె్‌సలో చేరతారని వారు ఆశాభావంతో ఉన్నారు. వైసీపీతో ఉన్నది ప్రధానంగా కాంగ్రెస్‌ ఓటర్లేనని, షర్మిల కనుక కాంగ్రెస్‌ పార్టీ బాఽధ్యతలు స్వీకరిస్తే వైసీపీ ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మళ్లుతారని భావిస్తున్నారు.

జగన్‌ ఒత్తిళ్లకు లొంగకుండా..

తెలంగాణలో కాంగ్రె్‌సకు షర్మిల మద్దతు ప్రకటించి కాంగ్రెస్‌ గెలుపునకు దోహదం చేశారు. తెలంగాణ ఎన్నికలకు ముందే ఆమె తన పార్టీని కాంగ్రె్‌సలో విలీనానికి ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరిపారు. షర్మిలను చే ర్చుకుని ఆంధ్రాలో ఆమె సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ నేతలు భావించారు. అప్పటి నుంచే ఆమెతో ఢిల్లీ పెద్దలు పరోక్షంగా, ప్రత్యక్షంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఆమెను ఏపీ కాంగ్రె్‌సలో చేర్చుకోరాదని జగన్‌ ఎంత తీవ్ర ఒత్తిడి చేసినప్పటికీ లొంగకూడదని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌ జైలులో ఉన్నప్పుడు షర్మిలే వైసీపీని కాపాడారని గుర్తు చేస్తున్నారు. ‘‘షర్మిలలో కాంగ్రెస్‌ రక్తం ఉంది. ఆమె చేరికతో ఇరువురి ఉనికినీ బలోపేతం చేస్తుంది’’ అని ఒక నేత వ్యాఖ్యానించారు.

రేపు జనసేనలోకి విశాఖ వైసీపీ నేతలు?

విశాఖపట్నం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన విశాఖ నగర నేతలు కొందరు బుధవారం జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక ముఖ్యనేతతోపాటు పార్టీలో కీలక పదవిలో ఉన్న నేత ఒకరు, కార్పొరేటర్‌గా ఉన్న దళిత నాయకుడు విజయవాడలో జనసేన కండువా కప్పుకోనున్నట్లు చర్చ నడుస్తోంది. అయి తే ఈ బృందంలో ఇద్దరు భీమిలి, విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్లు అడుగుతున్నారని.. హామీ లభిస్తేనే పార్టీ మారతామంటున్నారని సమాచారం.

Updated Date - Dec 26 , 2023 | 03:42 AM