Share News

YS Jagan : సారు దర్శనం దుర్లభం

ABN , Publish Date - Dec 18 , 2023 | 02:42 AM

రాచరికపు వ్యవస్థ గురించి వినటమే తప్ప నేటి తరం చూసింది లేదు. ఆ కాలంలో రాజులే ప్రభువులు. వారి దృష్టిలో ప్రజలు బానిసలు.

YS Jagan : సారు దర్శనం దుర్లభం

నాలుగున్నరేళ్లలో సగం మంది ఎమ్మెల్యేలూ కలవలేదు జగన్‌ తీరు వేరయా...

దర్శనమే కరువు

తిరుమలలో మూలవిరాట్‌ దర్శనం సామాన్యులకు అంత సులభంగా లభించదు. గంటల తరబడి నిరీక్షించి, అల్లంత దూరం నుంచి స్వామివారిని దర్శించుకుని రావాల్సిందే. ముఖ్యమంత్రి జగన్‌ దర్శనమైతే సామాన్యులకు ఆ మాత్రం కూడా లభించదు. ఎందుకంటే.. ఆయన ప్రజలకు పూర్తిగా దూరమయ్యారు. జిల్లాలకు వెళ్తే బ్యారికేడ్లు, పరదాల మాటున పర్యటనలు! ఇక తాడేపల్లి ప్యాలె్‌సలోకైతే ప్రజలకు నో ఎంట్రీ! ‘పేదల పక్షపాతి’ జగన్‌ తీరిదీ!

ఎమ్మెల్యేలు, ఎంపీలకూ కష్టమే

కనీసం మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలైనా నేరుగా జగన్‌ను కలుస్తారనుకుంటే తప్పులో కాలేసినట్టే. గత నాలుగున్నరేళ్లలో సగం మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా వ్యక్తిగతంగా ఆయన్ను కలవలేకపోయారు! జిల్లా పర్యటనలు, పార్టీ వేదికలు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దూరం నుంచి చూసి తరించాల్సిందే! ఎంపీలైతే చాలామంది

నామినేషన్‌ వేశాక మళ్లీ ఆయన్ను నేరుగా కలిసే చాన్సే రాలేదు! ఇక చాలామంది మంత్రులకూ ‘ప్రత్యక్ష’ భాగ్యం అరుదు! నాలుగున్నరేళ్లలో

జగన్‌తో 2-3 సార్లు నేరుగా సమావేశమైన నేతలు 10-15 మంది మాత్రమే ఉంటారు.

బాబు, వైఎస్‌ హయాంలో ఇలా..

గతంలో చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఓ గంట సేపు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా కలసి, మాట్లాడే అవకాశం ఇచ్చేవారు. నియోజకవర్గ అభివృద్ధి, ఇతర సమస్యలపై వినతులు స్వీకరించేవారు. జగన్‌ ఏలుబడిలో ఈ అవకాశమే లేదు.

జగన్‌ వ్యక్తిగతంగా కలవరు.. మాట్లాడరు

అధికారంలోకి వచ్చాక ప్రజలకు పూర్తిగా దూరం

జిల్లాలకు వెళ్తే బ్యారికేడ్లు, పరదాలు, ఆంక్షలు

తాడేపల్లి ప్యాలె్‌సలోకీ పేదలకు నో ఎంట్రీ

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్థితీ అంతే

వెళ్లినా సజ్జల దర్శనం మాత్రమే

అసెంబ్లీ, జిల్లా పర్యటనల్లో చూడటమే

అతికొద్ది మంది నేతలకు మాత్రమే ఎంట్రీ

పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు స్వాగతం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాచరికపు వ్యవస్థ గురించి వినటమే తప్ప నేటి తరం చూసింది లేదు. ఆ కాలంలో రాజులే ప్రభువులు. వారి దృష్టిలో ప్రజలు బానిసలు. రాజులు బానిసలతో కలవరు. మాట్లాడరు. మన ముఖ్యమంత్రి జగన్‌ కూడా అంతే! అలాంటి లక్షణాలున్న రాచరికపు వ్యవస్థ నయా ప్రతినిధి. ఆయనే సుప్రీం! మోనార్క్‌! నియంత! మిగతావాళ్లంతా ఆయన దృష్టిలో బానిసలు. ముఖ్యమంత్రి కాగానే ప్రజలకు పూర్తిగా దూరమయ్యారు. తాడేపల్లిలో తన రాజప్రసాదానికి సమీపంలోని పేదలను తరిమేశారు. ఉదయం లేచిన వెంటనే పేదల ఇళ్లు కనబడకుండా ధ్వంసం చేయించారు. పేదల ఇళ్ల స్థానంలో రోడ్డు వేయించారు. ప్రజలు నేరుగా తనను కలసి తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం ఇవ్వడం లేదు. ప్రజలకే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకూ దూరమయ్యారు. వారితో నేరుగా కలవరు. నియోజకవర్గాల అభివృద్ధి, సమస్యల గురించి చెప్పుకొనే అవకాశమివ్వరు. జగన్‌ సీఎం అయ్యాక నాలుగున్నరేళ్లలో వ్యక్తిగతంగా ఒకసారి కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు సగం మందే ఉంటారు. మిగిలిన సగం మందికి ఒక్కసారి కూడా జగన్‌ను నేరుగా కలిసే అవకాశమే రాలేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒకవేళ తాడేపల్లి ప్యాలె్‌సకు వెళ్లినా జగన్‌ దర్శనం లభించదు. సలహాదారు సజ్జల, సీఎంవో అధికారి ధనుంజయ రెడ్డిని కలసి రావాల్సిందే. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి అతికొద్ది మందికి మాత్రమే ప్యాలె్‌సలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ మధ్య బాలినేనికి కూడా ‘ప్రత్యక్ష’ భాగ్యం కలగడం లేదు.

దూరం నుంచే దర్శనం

ముఖ్యమంత్రి జగన్‌ జిల్లాల పర్యటనలకు వెళ్లినపుడు, అసెంబ్లీ సమావేశాలు, పార్టీ కార్యక్రమాల సందర్భంగా కూడా ఎమ్మెల్యేలు నేరుగా ఆయనతో కలిసే అవకాశం ఉండదు. ఆయన ఎదురుపడినప్పుడు దూరం నుంచి నమస్కరించడమే తప్ప నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై మాట్లాడే అవకాశం ఇవ్వరు. మహా అయితే వినతి పత్రం ఇవ్వొచ్చు. జిల్లా పర్యటన సమయంలో అయితే జగన్‌ అల్లంతదూరాన కనిపిస్తారు. హెలిప్యాడ్‌ వద్దకు ప్రొటోకాల్‌ ప్రకారం ఎవరెవరు రావాలో ముందుగా జాబితా విడుదల చేస్తారు. జాబితాలో పేర్లు ఉన్నవాళ్లను మాత్రమే భద్రతా సిబ్బంది పంపుతారు. మిగిలిన నేతలు ఎంతటి ప్రజాదరణ ఉన్నవారైనా, కేంద్ర మాజీ మంత్రులైనా సరే నిర్ధాక్షిణ్యంగా గెంటేస్తారు. ఇక ముఖ్యమంత్రి వేదిక మీదకు వచ్చే సమయానికి నేతలు కొన్ని నిబంధనలు పాటించాలి. జగన్‌ వేదిక మీదకు రాకముందే కుర్చీలకు అతికించిన పేర్లను బట్టి వరుస క్రమంలో ఎమ్మెల్యేలు,

ముఖ్యనేతలు కూర్చోవాలి. జగన్‌ వేదికపైకి వచ్చాక అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రతిమకు పూలమాల వేస్తారు. ఆ తర్వాత వరుస క్రమంలో వేదికపై ఉన్న నేతలందరూ వైఎస్‌ ప్రతిమ వద్ద నివాళులు అర్పించాలి. వేదికపైనే ఉన్నామని అతి చనువు ప్రదర్శించి జగన్‌ దరిదాపులకు వెళ్లేందుకు ప్రయత్నిస్తామంటే కుదరదు. కార్యక్రమం ముగిసిన తర్వాత జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన కొందరిని జగన్‌ కలుస్తారు. వారు తమ బాధలను జగన్‌కు చెబుతారు. ఆ వెంటనే బాధితులకు ప్రభుత్వ సహాయాన్ని జగన్‌ ప్రకటించడం... వారికి ఆ విషయాన్ని అధికారులు చేరవేయడం.. అంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. తాము అడిగిన వెంటనే జగన్‌ సాయం చేశారని బాధితులు చెబుతారు. దీన్ని సొంత మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకుంటారు. శాసన సభ్యులు, పార్టీ నేతలతో సమావేశాల సమయంలోనూ జగన్‌ దర్శనం దూరం నుంచే. జగన్‌ రాకకు ముందే కుర్చీలు వేస్తారు. వరుస క్రమంలో ప్రజా ప్రతినిధులు కూర్చోవాలి. ముఖ్యమంత్రి మాట్లాడే ముందు ఐప్యాక్‌ బృందం సభ్యులు సర్వే వివరాలను వెల్లడిస్తారు. ఎమ్మెల్యే పనితీరు గురించి వివరిస్తూనే ఏం చేస్తే గ్రాఫ్‌ పెరుగుతుందో కూడా సూచిస్తారు. తర్వాత ఎమ్మెల్యేలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తారు. వారు ప్రేక్షకులుగా ఉండిపోతారు. కార్యక్రమం ముగిశాక జగన్‌ వెళ్లిపోతారు. ముందువరుసలో ఉన్నవారు కూడా ఆయన్ను కలసి ప్రత్యేకంగా మాట్లాడేందుకు ఆస్కారం ఉండదు.

దేవుడిని అలా చూడాలంతే..

‘జగన్‌ను చూడటమే ప్రజా ప్రతినిధులు చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఆయన్ను వ్యక్తిగతంగా కలిసి సమస్యలు చెప్పుకోవాలంటే కుదరదు. ఎందుకంటే.. ఆయన దేవుడు. దేవుడిని మనసులో కోరికలు కోరుకుని, నమస్కరించుకుని వెళ్లిపోవాలి. దేవుడితో మాట్లాడటం కుదరదు’ అని మాజీ మంత్రి, సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్‌ను వ్యక్తిగతంగా కలవాలంటే ముందుగా ప్రైవేటు సెక్రటరీ లేదా ఓఎ్‌సడీని ఫోన్‌లో సంప్రదించి విషయం చెప్పాలి. వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారు. ఎమ్మెల్యే ఎందుకు వస్తున్నారో, ఏం చెప్పబోతున్నారో ముందుగా సీఎంకు సమాచారం వెళ్తుంది. సదరు ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా భేటీ కావాలో వద్దో ఆయన నిర్ణయిస్తారు. ఆయన ఓకే చెబితే ప్యాలె్‌సలోకి అనుమతి లభిస్తుంది. ఎమ్మెల్యేలకే కాదు మంత్రులకూ ఇదే వర్తిస్తుంది. పార్టీ నేతలతో విభేదాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలైతే ఎమ్మెల్యేలు, మంత్రులను జగన్‌ కలవరు. సీఎంవో ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి లేదా సజ్జలను కలసి మాట్లాడుకోవాలని సూచిస్తారు.

ఎవరైనా అంతే...

ఒంగోలులో భూకబ్జాల వ్యవహారం, పార్టీ నేతల వ్యవహారశైలి, జిల్లా పోలీసు యంత్రాంగం తీరుపై జగన్‌ను సంప్రదించేందుకు మాజీ మంత్రి బాలినేని ఆ మధ్య ప్రయత్నం చేశారు. అయితే సీఎంవో ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డిని కలసి మాట్లాడాలంటూ బాలినేనికి కబురు వచ్చింది. దీంతో తాను మాట్లాడేదేలేదని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బాలినేని బయటకు వచ్చేశారు. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. కొంతకాలం తర్వాత తాడేపల్లికి రావాలంటూ సీఎంవో నుంచి బాలినేనికి కబురు వచ్చింది. సీఎం జగన్‌ నుంచి పిలుపు వచ్చిందని బాలినేని భావించారు. కానీ జగన్‌తో కాకుండా ధనుంజయరెడ్డితోనే సమావేశం కావాల్సి వచ్చింది.

నెల్లూరు జిల్లాలో వేడెక్కిన రాజకీయాల నేపథ్యంలో మాజీ మంత్రి ఒకరు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. సీఎంవోకు వెళ్లారు. ముఖ్యమంత్రితో మాజీ మంత్రి మంతనాలు జరుపుతున్నారంటూ బ్రేకింగ్‌ న్యూస్‌లు షరా మామూలుగా ప్రత్యక్షమయ్యాయి. అయితే ఆయన కూడా సీఎంవో ముఖ్య కార్యదర్శితోనే మాట్లాడారు. ఆ సమయంలో అటుగా వచ్చిన జగన్‌ మాజీ మంత్రిని చూసి.. ‘వెళ్లి పని చూసుకో’ అంటూ వెళ్లిపోయారు.

మాజీ హోం మంత్రి సుచరిత పార్టీలో ఎదురవుతున్న పరిణామాలపై నేరుగా జగన్‌కు చెప్పాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని పార్టీలో ప్రచారం జరిగింది.

వీరికే రెడ్‌కార్పెట్‌

ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, వైసీపీకి ఫండింగ్‌ చేసే వాళ్లకు మాత్రమే తాడేపల్లి ప్యాలె్‌సలో రెడ్‌కార్పెట్‌ వేస్తారు. స్వయంగా సీఎం జగనే ఎదురేగి స్వాగతం పలుకుతారు. వారికి రాచమర్యాదలు చేసి సాగనంపుతారు.

Updated Date - Dec 18 , 2023 | 02:42 AM