Ys Jagan : పులివెందుల నేలపైనే ఎదురుగాలి !
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:47 AM
రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి నా.. పులివెందుల ప్రజలకు మాత్రం జగన్ స్థానిక శాసన సభ్యుడే! సీఎం అయ్యాక తాడేపల్లి ప్యాలె్‌సకు మాత్రమే పరిమితమైన జగన్...
ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన మండలాల నేతలు.. జవాబు చెప్పలేక ఖిన్నుడైన జగన్
సొంత గడ్డపైనా పరదాలు, బారికేడ్ల మధ్య తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్‌కు.. ‘నా సొంతం’ అనుకున్న మనుషుల నుంచీ షాకులు తగిలాయి. పులివెందులలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూలేని విధంగా ‘ఎదురు స్వరాలు, ప్రశ్నలు’ వినిపించడంతో జగన్ ఖిన్నుడైనట్లు తెలిసింది. దీంతో ‘ఏందన్నా కొట్లాటకు వచ్చినారా?’ అని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం!
జగన్ గీ సొంత జనం
ఏందన్నా కొట్లాటకు వచ్చినారా!
- లేదు సార్, మా బాధలు
చెప్పడానికే వచ్చాం!
ఆఫీసర్లకు చెబుతాను లే!
- ఎన్నికలముందు
అధికారులు ఏం వింటారు?
అన్నీ సర్దుకుంటాయి...
నన్ను నమ్మండి
- ఆళ్ల, కోటంరెడ్డి, బాలినేని కూడా మిమ్మల్ని నమ్మిన వాళ్లే కదా!
‘ఏందన్నా కొట్లాటకు వచ్చినారా?’ అంటూ అసహనం
పదేళ్లుగా జెండా మోస్తున్నాం.. మాకేం చేశారు?
సింహాద్రిపురంలో మనకు మెజారిటీ రాదు
బీటెక్ రవి దూకుడు.. అరెస్టులతో డ్యామేజ్
వివేకా హత్య, సీబీఐ దర్యాప్తుతో గబ్బు!
బాబు హయాంలో చీనీ తోటలకు నీళ్లిచ్చాడు
మనమొచ్చాక అన్నమయ్య కొట్టుకుపోయింది
జగన్ ముందే మండల నేతల ఆవేదన
వైఎ్‌సతోనే రాజకీయాలు వదలాల్సిందని ఆక్రోశం
భేటీ తప్పించుకునేందుకు కొందరు తిరుమలకు
కాలినడకన బయలుదేరిన 200 మంది
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి నా.. పులివెందుల ప్రజలకు మాత్రం జగన్ స్థానిక శాసన సభ్యుడే! సీఎం అయ్యాక తాడేపల్లి ప్యాలె్‌సకు మాత్రమే పరిమితమైన జగన్... ఏడాదిలో ఒకటి రెండు రోజులు పులివెందులకు వెళ్లి వస్తున్నారు. వివేకా హత్య దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలు, టీడీపీ బలోపేతమవుతుండటంతో వైసీపీ కంచుకోటకు మెల్లగా బీటలు పడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన జగన్ నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా చూసుకోవడానికి జాగ్రత్త పడ్డారు. పులివెందుల నియోజకవర్గంలో మండలానికి పదిమంది చొప్పున ప్రభావం చూపగలిగిన వైసీపీ నేతలు, గ్రామానికి ఐదుగురు చొప్పున క్రియాశీల కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో భేటీ ఏర్పాటు చేశారు. ఆదివారం సొంత మండలమైన సింహాద్రిపురంతోపాటు నాలుగు మండలాలు, సోమవారం పులివెందులతో పాటు మూడు మండలాల ముఖ్యులతో సమావేశానికి కబురు పెట్టారు. ప్రతి మండలం నుంచి 250నుంచి 300మందికి ఇడుపులపాయలో ప్రవేశం కల్పిస్తూ జాబితా రూపొందించారు. అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపిన ప్రకారం... సమావేశం ప్రారంభంకాగానే... తనదైన శైలిలో వచ్చీరాని నవ్వు తెచ్చుకొని సీఎం జగన్ ఏదో చెప్పబోయారు. ఆ వెంటనే సింహాద్రిపురం మండలానికి చెందిన కొందరు లేచి నిలబడి... ‘పదేండ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు పడ్డాం. అధికారం వచ్చి ఐదేళ్లకు దగ్గర్లో ఉన్నా మాకు ఒరిగిందేమీ లేదు’ అని అనడంతో జగన్‌తోపాటు అక్కడున్న ఇతర నేతలు ఉలిక్కి పడ్డారు. వెంటనే తేరుకున్న జగన్.. ‘ఏందన్నా కొట్లాటకు వచ్చినారా?’ అని అసహనంతో ప్రశ్నించారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ‘మా బాధలు చెప్పడానికే వచ్చాం సార్! ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేశాం. పులివెందులలో అభివృద్ధి పనులు చేసి కోట్లలో బిల్లుల కోసం ఎదురు చూస్తున్నాం. గ్రామాల్లో ఒక్క పని జరగడం లేదు. రేపు ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఏమని ఓట్లు అడగాలి? ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టాలి?’ అంటూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ‘నేను అఫిషియల్స్‌కు చెబుతాలే అన్నా’ అంటూ జగన్ ఆ విషయాన్ని దాటవేసేందుకు ప్రయత్నించారు. అయినా... ఫలితం లభించలేదు. ‘‘ఎన్నికల కమిషన్ మీటింగ్ తర్వాత జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆ వాతావరణంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మీరు చెబితే వాళ్లు చేస్తారా? ఐదేళ్లు గమ్మునుండి ఐదు నెలలు కూడా టైము లేనప్పుడు ఎవరు పలుకుతారు?’’ అంటూ మరిన్ని అంశాలను ప్రస్తావించారు. దీంతో కాసేపు మౌనం వహించిన జగన్... ‘‘అన్నీ సర్దుకుంటాయిలే అన్నా! నేను ఉన్నా.. నన్ను నమ్మండి!’’ అని బుజ్జగించారు. సమావేశం నుంచి వైసీపీ ముఖ్య కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో బయటికి వచ్చారు. ‘మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి, నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఒంగోలులో బాలినేని వాసుకూడా ఆయన్నే నమ్మారు. పదండి పోదాం! రాజశేఖర్ రెడ్డితోనే మనం రాజకీయాలు వదిలేయాల్సింది’ అంటూ వెనుదిరిగారు.
సీబీఐ గబ్బు లేపింది..
సోమవారం క్రిస్మస్ ప్రార్థనలకు ముందుగానే ఇడుపులపాయలో రెండుమండలాల నేతలతో జగన్ కొద్దిసేపు సమావేశమయ్యారు. పులివెందుల వరకూ గట్టి పట్టుందని కొందరు చెప్పగా.. ‘‘అదేం లేదు. సీబీఐ గబ్బు లేపింది’’ అంటూ ఒక గొంతు వినిపించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు, ఆయన కుమార్తె సునీత న్యాయ పోరాటం.. ప్రజల్లో బాగా చర్చనీయాంశం అయ్యాయి. ఇది వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చు’ అని మరి కొందరు చెబుతుండటంతో ‘ఇంక చాలు’ అన్నట్లుగా జగన్ చెయ్యి ఎత్తి వారించినట్లు తెలిసింది.
దేవుడికి మొక్కు.. జగన్‌కు దండం!
ముఖ్యమంత్రి జగన్ డిసెంబరు 24, 25న పులివెందులకు వస్తారని, తప్పకుండా పిలిపించి మాట్లాడతారని సమాచారం అందడంతో... ఈ భేటీ తప్పించుకునేందుకు చాలామంది నేతలు వెంకన్నకు మొక్కు పేరుతో కాలినడకన తిరుపతికి బయలు దేరారు. మండలాల నుంచి ఆశించినంత సంఖ్యలో నేతలు రాలేదని గమనించి ‘నేను పిలిచినా ఎందుకు రాలేదు’ అని జగన్ ఆరా తీశారు. దేవుడికి మొక్కు ఉందని తిరుపతి వెళ్లారనడంతో... ‘మొక్కేంటి? ఇప్పుడే వెళ్లాలా?’ అని జగన్ అడిగారు. ‘సార్, పార్టీ కోసం కనీసం యాభై లక్షల నుంచి రెండు, మూడు కోట్ల వరకూ ఖర్చు పెట్టిన వాళ్లు చాలా అసంతృప్తిగా ఉన్నారు. తిరుమల దేవుడి పేరున్న ఒక రెడ్డి 12కోట్ల రూపాయల పనులు చేస్తే కనీసం బిల్లులు ఇవ్వలేదు. ఒకటి, రెండు, ఐదు, ఎనిమిది, పది కోట్లు ఇలా ముప్పై మంది నేతలు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. వాళ్లందరూ ఆయా గ్రామాల్లో వందా రెండొందల నుంచి రెండు మూడు వేల ఓటర్లను ప్రభావితం చేయగలరు’’ అని పక్కనున్న నాయకులు తెలిపారు. ‘తిరుపతికి ఎప్పుడు బయలు దేరారు? ఎప్పుడు వస్తారు?’ అని సీఎం ప్రశ్నించడంతో... సుమారు 200 మంది ఈ నెల 21న కాలి నడకన బయలుదేరారని, 27న దర్శనం చేసుకుని తిరిగి వాహనాల్లో వెనక్కి వస్తారని బదులిచ్చారు. ఇప్పుడు ఎక్కడున్నారో కనుక్కోండి అనటంతో పీలేరు సమీపంలో ఒక చోట వంట వండుకొంటున్నారని సమాధానం వచ్చింది. సీఎంతో మాట్లాడిచ్చేందుకు అక్కడున్న నేత ఒకరికి కాల్ చేశారు. ‘మా కష్టాలు వెంకటేశ్వర స్వామికి చెప్పుకోవడానికి వెళుతున్నాం’ అని సమాధానం వచ్చింది.