YS Jagan : లాజిక్కేది బాస్ ?
ABN , Publish Date - Dec 14 , 2023 | 02:51 AM
సర్వేల సాకు చూపి టికెట్లు నిరాకరిస్తే సహించేది లేదని వైసీపీ ఎమ్మెల్యేలు తమ నాయకత్వానికి తేల్చిచెబుతున్నారు.
ప్రజల్లో వ్యతిరేకత మీపైనే.. మాపై కాదు
ఈ లాజిక్ మిస్సై మమ్మల్ని తీసేస్తామంటారా?
అంతా నా ఇష్టం.. అంటే చాలా కష్టం!
మేముంటేనే మీరు ముఖ్యమంత్రి!!
తేల్చిచెప్పేందుకు పలువురు
వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం
ఆప్తులతో ఆంతరంగిక భేటీలు
కార్యాచరణకు రూపకల్పన
మొండిచేయి చూపితే ప్రతిఘటనే?
ప్రకటన తర్వాత స్పందించే ఆలోచన
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సర్వేల సాకు చూపి టికెట్లు నిరాకరిస్తే సహించేది లేదని వైసీపీ ఎమ్మెల్యేలు తమ నాయకత్వానికి తేల్చిచెబుతున్నారు. అభివృద్ధి పనులు చేపట్టాలని నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పినా సీఎం జగన్ వినలేదని.. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని నమ్ముకున్నారని.. తీరా అవి గట్టెక్కించే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యేలను మార్చేస్తామంటున్నారని ఆక్షేపిస్తున్నారు. నాలుగున్నరేళ్లు పూచికపుల్లగా తీసివేసి.. ఇప్పుడు తమ పనితీరు బాగోలేదంటూ వేరేవారిని బరిలోకి దించితే సహించేది లేదంటూ.. ధిక్కార స్వరం వినిపించేందుకు సమాయత్తమవుతున్నారు. ‘మేం ఎమ్మెల్యేలుగా గెలిచి.. శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటేనే జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. మాకు మంత్రి పదవులు ఇస్తే మంత్రులమవుతాం. కాదంటే.. ఎమ్మెల్యేలుగానే కొనసాగుతాం. కానీ జగన్ మేం ఎన్నుకుంటేనే సీఎం అవుతారు. ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపైనే ఉంది.. ఎమ్మెల్యేలమైన మాపై కాదు.. ఈ లాజిక్‌ను మరచిపోతే ఎలా’ అని మెజారిటీ ఎమ్మెల్యేలు అంటున్నారు. రెండ్రోజుల కింద 11 నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియామకాన్ని ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందని చెప్పారు. ఎంతలేదన్నా 60 మందిని తీసేయొచ్చని జగన్ సొంత చానల్, నీలి-కూలి చానళ్లన్నీ ఇదే ప్రసారం చేస్తున్నాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
దిక్కుతోచని ఎమ్మెల్యేలు..
ఈ సారి ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశం లేదనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది.. జగన్‌తో తమకున్న అనుబంధం శాశ్వతంగా భావించారు. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు జగన్ మొండిచేయి చూపడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. నిరాదరించిన వైసీపీలో ఉండలేక.. టీడీపీలోకి రానిచ్చే పరిస్థితి లేక.. రాజకీయంగా అనాఽథలుగా మిగిలిపోతామని గగ్గోలు పెడుతున్నారు. తమకు టికెట్లు నిరాకరించినట్లు అధికారికంగా ప్రకటించిన వెంటనే.. తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమ సన్నిహితులు.. ఆత్మబంధువులతో సమాలోచనలు ప్రారంభించారు.
మీ వాడినంటూనే..
‘జుత్తుంటేనే మన ఇష్టం వచ్చిన కొప్పు ఉంచుకోగలం.. నేను ముఖ్యమంత్రిని అయితేనే.. మీ అందరికీ ఉపయోగపడగలుగుతాను. కొంతమందికి టికెట్ ఇవొచ్చు. కొందరికి ఇవ్వలేకపోవచ్చు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా .. అందరూ శిరసావహించాల్సిందే’ అని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన జరిగిన ‘గడప గడప’ వర్క్‌షాపులో వైసీపీ శాసనసభ్యులతో జగన్ స్పష్టం చేశారు. సరిగా పనిచేయని వారిని పక్కనపెట్టేస్తానని తేల్చిచెప్పడంపై ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ప్రచారం జరుగడంతో.. మళ్లీ జూన్ 21వ తేదీన జరిగిన వర్క్‌షాపులో సాధ్యమైంతవరకు అందరికీ టికెట్లు ఇస్తానని చెప్పారు. దీంతో ఆయనలో కొంత మార్పు వచ్చిందని మెజారిటీ ఎమ్మెల్యేలు భ్రమించారు. కొద్దిమందిని తప్పించినా.. దాదాపు అందరికీ తిరిగి అవకాశమిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపడం.. వీరిలో జగన్‌కు సన్నిహితులనుకున్న ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీజేఆర్ సుధాకరబాబు కూడా ఉండడం.. ముగ్గురు మంత్రులకు వేరే స్థానాల్లో టికెట్లు ఇవ్వడంతో వారిలో ఆందోళన మొదలైంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల.. జగన్ తనకు అత్యంత ఆప్తుడని భావించి.. వైసీపీ పెద్దల ప్రోద్బలంతో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఆయనపైనే జగన్ వేటు వేశారు. ఆయన స్థానంలో టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవిని ఇన్‌చార్జిగా నియమించారు. ఈ విషయం తెలిసి ముందుగానే ఆళ్ల ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి కూడా రాజీనామా చేసేశారు. ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు ద్వారాలు మూసుకుపోయాయి. చంద్రబాబుపైనే కేసులు పెట్టిన ఆయన్ను టీడీపీ సహా ఇతర పార్టీలేవీ దగ్గరకు రానివ్వవని.. వైసీపీలోనే కొనసాగడం.. లేదం టే రాజకీయ సన్యాసం తీసుకోవడమే ఆయన ముందున్న మార్గాలని రాజకీయ వర్గాలంటున్నాయి.
బీఆర్‌ఎస్ ఓటమిని చూపి..
తెలంగాణ ఎన్నికల ఫలితాలొచ్చాక.. తాడేపల్లి ప్యాలె్‌సలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను కొనసాగించడం వల్లే తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓడిపోయిందన్న రాజకీయ సూత్రీకరణకు వైసీపీ తెరతీసింది. అంతర్గత సర్వేలతో పాటు.. బయటి సర్వేల ఫలితాలను బేరీజు వేసుకుని.. సిటింగ్‌లను మార్చేయాలని నిర్ణయించింది. పరిమితంగా అభ్యర్థులను తొలగిస్తే అర్థం చేసుకోవచ్చని.. కానీ ప్రజల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని చెప్పి మెజారిటీ స్థానాల్లో మార్చేస్తే ఎలాగని పలువురు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. దీన్ని ప్రతిఘటించాలని భావిస్తున్నారు. ఇందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెలాఖరుకల్లా ఇన్‌చార్జుల ఖరారు పూర్తవుతుందని వైసీపీ అధిష్ఠానం చెబుతోంది. అందాకా వేచి చూడాలని అనుకుంటున్నారు.