Share News

YS Jagan : ఆరోగ్యశ్రీలో క్లెయిమ్స్‌ స్కామ్‌

ABN , Publish Date - Dec 17 , 2023 | 05:02 AM

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో రెండేళ్లుగా సాగుతున్న అవినీతి బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది.

YS Jagan : ఆరోగ్యశ్రీలో క్లెయిమ్స్‌ స్కామ్‌

ఆరోగ్యశ్రీ సేవలు అందక ఎంతోమంది రోగులు అవస్థలు పడుతున్నారు. అయితే రోగులకు చికిత్సలు చేయకుండానే చేసినట్లు.. అసలు అవసరమే లేకున్నా చికిత్సలు చేసినట్లు.. ఒక చికిత్స చేసి ఇష్టానుసారం బిల్లులు పెట్టడం.. ఇలా అడ్డగోలుగా బిల్లులు డ్రా చేస్తున్నారు. కొన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో కలసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లోని కొందరు ఉన్నతాధికారులు రెండేళ్ల నుంచి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. బిల్లుల రూపంలో వందల కోట్లు నొక్కేస్తున్నారు.

రెండేళ్లుగా దోపిడీ

ట్రస్ట్‌ అధికారుల చేతివాటం

9-10 ఆస్పత్రులతో కుమ్మక్కు

అడ్డగోలుగా కోట్లు ధారాదత్తం

తిరిగి అధికారుల జేబుల్లోకి

ఎడాపెడా ప్రీఆథరైజేషన్‌కు ఆమోదం

ఆ తర్వాత క్లెయిమ్స్‌కు అనుమతి

డాక్టర్ల ప్రమేయం లేకుండానే తతంగం

క్యాన్సర్‌ ఆస్పత్రులున్న ఓ సంస్థకే ఏడాదికి 200-300 కోట్ల బిల్లులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో రెండేళ్లుగా సాగుతున్న అవినీతి బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. కొందరు అధికారులు, కొన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల పెద్దలు కుమ్మక్కై క్లెయిమ్స్‌ స్కామ్‌కు పాల్పడ్డారు. దొంగ బిల్లులు పెట్టి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. సదరు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు పంపే ప్రీఆథరైజేషన్‌కు నిబంధనలు పాటించకుండా నుమతులు ఇవ్వడం, ఆ తర్వాత అదే రీతిలో క్లెయిమ్స్‌ ఆమోదించి నిధులు దోచేస్తున్నారు. ఆస్పత్రులకు బిల్లులు చెల్లించాక తిరిగి అందులోంచి అధికారులకు కమిషన్‌ వచ్చి పడుతోంది. ఈ వ్యవహారంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లోని ఓ ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ట్రస్ట్‌లో శస్త్ర చికిత్సలకు అనుమతిచ్చే విభాగం దగ్గర నుంచి ఐటీ, ఫైనాన్స్‌తో పాటు మరికొన్ని విభాగాల ఉన్నతాధికారుల పాత్ర కూడా ఇందులో ఉంది. తొమ్మిది, పది నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో ముందుగానే దొంగ బిల్లుల చెల్లింపులకు ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. అందులోనూ కేన్సర్‌ ఆస్పత్రులున్న ఓ సంస్థకే 200-300 కోట్ల బిల్లులు చెల్లించారు. సీఎంవోలో ఆరోగ్యశాఖలో కీలకంగా వ్యవహరించే ఓ అధికారికి ఈ వ్యవహారం తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు.

ఇదీ ప్రీఆథరైజేషన్‌ తీరు

రోగి అనారోగ్య సమస్యతో ఏదైనా ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. శస్త్రచికిత్స చేయాల్సి వస్తే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుంటారు. శస్త్రచికిత్సకు అనుమతివ్వాలని సదరు ఆస్పత్రి వైద్యులు ప్రీఆథరైజ్‌ చేస్తారు. శస్త్రచికిత్స సమాచారమంతా ఇందులో ఉంటుంది. ఆ సమాచారం మొత్తం ట్రస్ట్‌లోని ఆపరేషన్స్‌ విభాగానికి వెళ్తుంది. ప్రతి శస్త్రచికిత్సకు ట్రస్ట్‌లో ఒక కోడ్‌ ఉంటుంది. రోగికి చేయాల్సిన శస్త్రచికిత్స, వాడాల్సిన పరికరాలు, శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు ఇలా ప్రతి విషయం కోడ్‌ ఆధారంగానే తెలుస్తుంది. ట్రస్ట్‌లోని వైద్యులు ప్రీఆథరైజేషన్‌లో అన్ని అంశాలను పరిశీలిస్తారు. రోగికి శస్త్రచికిత్స అవసరం అయితే వెంటనే అనుమతిస్తారు. లేదంటే మరికొన్ని వైద్య పరీక్షలు చేయాలని లేదా సపోర్టింగ్‌ డాక్యుమెంట్స్‌ పంపించాలని సూచిస్తారు. ట్రస్ట్‌లో ఆపరేషన్స్‌ విభాగం వైద్యులు అనుమతిస్తే నెట్‌వర్క్‌ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమవుతారు. ఎమర్జ్జెన్సీ సమయంలో అయితే ట్రస్ట్‌ వైద్యులు ఫోన్‌లోనే అనుమతి ఇస్తారు.

ఇదీ జరిగింది..

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో కొం దరు ఉన్నతాధికారులు ప్రీఆథరైజేషన్‌ ప్రక్రియను పక్కదారి పట్టించారు. దొంగ బిల్లులతో జేబులు నింపుకొనేందుకు ముందుగానే కొన్ని ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్‌ ఆస్పత్రులున్న సంస్థతో పాటు విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు లాంటి చోట్ల కొన్ని పెద్ద ఆస్పత్రులతో బేరం కుదుర్చుకున్నారు. ప్రీఆథరైజేషన్‌ సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు కూడా పరిశీలించకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. శస్త్రచికిత్స అనంతరం 21 రోజుల్లో సదరు ఆస్పత్రులు క్లెయిమ్స్‌ను (బిల్లులు) ట్రస్ట్‌కు పంపించాలి. ట్రస్ట్‌లో క్లెయిమ్స్‌ అనుమతి కోసం ప్యానల్‌ డాక్టర్లు ఉంటారు. ఈ ప్యానల్‌ డాక్టర్లు ప్రతి విభాగానికి 20 నుంచి 30 మంది వరకూ ఉంటారు. క్లెయిమ్స్‌ను ప్యానల్‌ డాక్టర్లు పరిశీలించి, అంతా ఓకే అనుకుంటేనే ఆమోదిస్తారు. ఆ తర్వాత అవి బిల్లింగ్‌కు వెళ్లిపోతాయి. క్లెయిమ్స్‌ను ఆమోదించే సమయంలో శస్త్రచికిత్స ప్యాకేజీల్లో కొంత మొత్తాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. బిల్లులను పూర్తిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. అయితే ఆయా నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో ఉన్నతాధికారులు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్క రూపాయి కూడా కట్‌ కాకుండా చూస్తున్నారు. సాధారణంగా క్లెయిమ్స్‌ ప్యానల్‌ డాక్టర్ల వద్దకు వెళ్లాలి. అయితే ఒప్పందం చేసుకున్న ఆస్పత్రుల బిల్లులు వారి వద్దకు వెళ్లకముందే ఆమోదం పొందుతున్నాయి. కొన్నిసార్లు ప్యానల్‌ డాక్టర్లు పరిశీలిస్తున్న సమయంలోనే వారి ప్రమేయం లేకుండానే ఆమోదం తెలిపారు. మొదట్లో ఈ విషయం డాక్టర్లకు అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత కేవలం తొమ్మిది, పది ఆస్పత్రుల విషయంలోనే ఇలా జరుగుతుందన్న విషయాన్ని గుర్తించారు. ముఖ్యంగా అంకాలజీ విభాగంలో ఒక చైన్‌ ఆస్పత్రి విషయంలో ఇలా జరగడాన్ని కొంత మంది ప్యానల్‌ వైద్యులు గుర్తించారు. ట్రస్ట్‌ క్యాన్సర్‌ విభాగానికి అంతా కలిపి దాదాపు రూ.450 నుంచి రూ.500 కోట్లు ఖర్చు చేస్తుంటే.. సదరు ఆస్పత్రే దాదాపు రూ.200-300 కోట్లు విలువైన శస్త్రచికిత్సలు చేస్తోంది. మరికొన్ని ఆస్పత్రులకూ క్లెయిమ్స్‌ చేస్తున్నారు.

స్కెచ్‌ అంతా ట్రస్ట్‌లోనే

క్లెయిమ్స్‌ స్కామ్‌కు సంబంధించి స్కెచ్‌ మొత్తం ట్రస్ట్‌లో వేశారు. రాష్ట్రంలో ఏ ఆస్పత్రి నుంచి ఎక్కువగా ట్రస్ట్‌కు ప్రీఆథరైజేషన్‌లు, క్లెయిమ్స్‌ వస్తున్నాయో అధికారులు ముందుగా లెక్కలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయా ఆస్పత్రుల పెద్దలతో డీల్‌ చేసుకున్నారు. ప్రీఆథరైజేషన్‌ పంపిన వెంటనే సదరు ఆస్పత్రుల నుంచి ట్రస్ట్‌లో ఒక ఉన్నతాధికారికి వాట్సాప్‌ మేసేజ్‌ వస్తుంది. ఆ వెంటనే సదరు అధికారి ఆమోదం తెలుపుతారు. ఇక క్లెయిమ్స్‌ విషయంలోనూ సేమ్‌ సీన్‌. మరికొందరు అధికారులూ సహకరిస్తారు.

అంతా రహస్యం..

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో విషయాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. ఏ చిన్న విషయాన్ని కూడా బయటకు రానీయకుండా జాగ్రత్త పడటంలో అక్కడి అధికారులు దిట్ట. క్లెయిమ్స్‌ స్కామ్‌ విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించారు. పైగా ఉన్నతాధికారులు ఈ స్కామ్‌లో భాగస్వాములు కావడంతో మరింత జాగ్రత్త పడ్డారు. ఈ వ్యవహారం బయటకు రాకుండా అత్యంత జాగ్రత్త పడ్డారు. ఎట్టకేలకు అవినీతి బాగోతం బయటపడింది.

Updated Date - Dec 17 , 2023 | 05:30 AM