‘పులివెందుల’ పొలికేక

ABN , First Publish Date - 2023-03-19T03:18:20+05:30 IST

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఆయన కుటుంబానికి పెట్టనికోట, దశాబ్దాలుగా ‘వైఎస్‌’ అడ్డా... పులివెందులలో తొలిసారిగా ‘పసుపుదళం’ పొలికేక వినిపించింది.

‘పులివెందుల’ పొలికేక

పూలంగళ్ల వద్ద తొలిసారి టీడీపీ సంబరాలు

టీడీపీ అభ్యర్థిది పులివెందుల నియోజకవర్గమే

జిల్లావ్యాప్తంగా కోలాహలం

(కడప - ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఆయన కుటుంబానికి పెట్టనికోట, దశాబ్దాలుగా ‘వైఎస్‌’ అడ్డా... పులివెందులలో తొలిసారిగా ‘పసుపుదళం’ పొలికేక వినిపించింది. టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లోనూ భయంభయంగానే గడిపిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు పులివెందుల పూల అంగళ్ల సెంటర్‌లో ‘జై తెలుగుదేశం’ అని నినదించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి గెలుపు ఖరారు కావడం... ఆయన ‘పులివెందుల బిడ్డ’ కావడంతో స్థానిక టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాంగోపాల్‌రెడ్డి పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలానికి చెందిన వ్యక్తి. ఆయన గెలుపు ఖరారుకాగానే శనివారం పులివెందుల పూలంగళ్ల వద్ద టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. టీడీపీ ముఖ్య నేతలంతా అనంతపురంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉన్నప్పటికీ... కార్యకర్తలు, ఇతర నేతలే రోడ్లపైకి వచ్చారు. రాంగోపాల్‌రెడ్డి స్వగృహంలో ఆయన సతీమణి ఉమాదేవి కేక్‌ కట్‌ చేశారు. కడప జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ‘వైనాట్‌ పులివెందుల’ అంటూ నినాదాలు చేశారు. కడపలో ఐటీఐ సర్కిల్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు. సింహాద్రిపురంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ జరిపి బాణసంచా పేల్చారు.

Updated Date - 2023-03-19T03:18:20+05:30 IST