Share News

జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:52 AM

విశాఖపట్నం నుంచి వైసీపీ ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ బుధవారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో జనసేనలో చేరారు.

జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్‌

వంశీకృష్ణ స్వంత ఇంటికి వచ్చేశారు

ఆయనకు పార్టీలో ప్రాధాన్యమిస్తాం: జనసేనాని

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి వైసీపీ ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ బుధవారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో జనసేనలో చేరారు. వంశీకృష్ణకు జనసేనాని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. ‘‘వైసీపీలో రాష్ట్ర, ఉత్తరాంరఽధ అభివృద్ధి బాగుంటుందని వంశీ వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అర్థం చేసుకుని తిరిగి వస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతం అవుతోంది. వంశీకృష్ణ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం విభాగం తరఫున నాతో రాజకీయ ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆయన జనసేనలోకి రావడం సొంత ఇంటికి రావడం లాంటిది. వంశీకృష్ణ పార్టీలోకి వస్తున్న సమయంలో వైసీపీ మీద ఎలాంటి ఇతర వ్యాఖ్యలు చేయకుండా, జనసేన పార్టీ భావజాలం నచ్చడంతోనే పార్టీలోకి వస్తున్నట్లు చెప్పడం నన్ను ఆకట్టుకుంది. ఏ నమ్మకంతో జనసేనలోకి వంశీకృష్ణ వచ్చారో అలాంటి ప్రాధాన్యం ఆయనకు కచ్చితంగా దక్కుతుంది. జనసేన పార్టీ ఉన్నతి కోసం, ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం వంశీకృష్ణ మనస్ఫూర్తిగా పని చేస్తారని భావిస్తున్నాం’’ అని పవన్‌ అన్నారు. పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ, ‘‘వంశీకృష్ణ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన నామినేటెడ్‌ ఎమ్మెల్సీ కాదు. స్థానిక సంస్థల్లో గెలిచి ఎన్నికైన వ్యక్తి. అలాంటి వ్యక్తి జనసేనలోకి రావడం చాలా అనందంగా ఉంది’’ అని అన్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ మాట్లాడుతూ, ‘వైసీపీలో పూర్తి స్థాయిలో పని చేసిన తర్వాత ఇప్పుడు జనసేనలోకి రావడం నా సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది. పవన్‌ కల్యాణ్‌తో ఉన్న పరిచయం, ఆయన ఆలోచన తీరు నాకు ఎప్పుడూ నచ్చుతాయి. కచ్చితంగా ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ ఉన్నతి కోసం పని చేస్తా. వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ను సీఎంగా చూడటం కోసం మనస్ఫూర్తిగా పని చేస్తా’’ అని అన్నారు.

జనసేనలో ఆదికేశవులనాయుడి మనవరాలు

టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌ డీకే ఆదికేశవుల నాయుడి మనవరాలు చైతన్య లలితాంబిక జనసేనలో చేరారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆమెకి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆదికేశవుల నాయుడు కుమార్తె తేజస్విని కుమార్తె చైతన్య. ఈమె తన ట్రస్ట్‌ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు.

Updated Date - Dec 28 , 2023 | 03:52 AM