బందిపోటు దొంగల్లా వైసీపీ నేతలు
ABN , Publish Date - Dec 17 , 2023 | 05:12 AM
అధికార పార్టీ నాయకులు బందిపోటు దొంగలకన్నా ఘోరంగా తయారయ్యారు. ఇతరుల మైన్‌లోకి జొరబడి 21 రోజులుగా రూ.కోట్లలో దోచుకుంటున్నారు.
ఇతరుల గనులు దోచుకుంటున్నారు! రోజుకు 2వేల టన్నుల క్వార్ట్జ్ వెలికితీత
కోర్టు ఆదేశాలనూ పట్టించుకోని అధికారులు
ఏ-1 మంత్రి కాకాణి, ఏ-2 పేర్నేటి: టీడీపీ నేత సోమిరెడ్డి ధ్వజం
పొదలకూరు, డిసెంబరు 16 : ‘అధికార పార్టీ నాయకులు బందిపోటు దొంగలకన్నా ఘోరంగా తయారయ్యారు. ఇతరుల మైన్‌లోకి జొరబడి 21 రోజులుగా రూ.కోట్లలో దోచుకుంటున్నారు. అక్రమ మైనింగ్‌ను ఆపాలని కోర్టు ఉత్తర్వులిచ్చినా సీఎం జగన్ నుంచి రాష్ట్ర మంత్రులకు భాగముండటంతో అధికారులెవరూ కన్నెత్తి చూడట్లేదు.’ అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైకా మైన్‌లో 21 రోజులుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ దోపిడీని ఆ మైన్ యజమాని విద్యాకిరణ్, టీడీపీ నాయకులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. మైన్‌లో జరుగుతున్న దోపిడీపై కడుపు మండి అక్కడే బైఠాయించగా, సమీపంలోని గిరిజనులు, మహిళలు వారి దగ్గరకు వచ్చి తమ ఆవేదన వెలిబుచ్చారు. మైన్‌లో పెద్దపెద్ద రంధ్రాలు వేసి అక్రమ బ్లాస్టింగ్ చేస్తున్నారని, దీంతో భూకంపం వచ్చినట్లుగా ఇళ్లు కదులుతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు.
సోమిరెడ్డి మాట్లాడుతూ ఎటువంటి పత్రాల్లేకుండా పన్నులు చెల్లించకుండా అధికార పార్టీ నాయకులు 21రోజులుగా రోజుకు 2వేల టన్నుల క్వార్జ్డ్‌ను వెలికి తీసి రూ.4కోట్ల అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఈ నెల 7న హైకోర్టు జిల్లా మైనింగ్ అధికారులకు, పొదలకూరు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఉత్తర్వులు ఇచ్చినా ఇంతవరకు అధికారులు కన్నెత్తిచూడలేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఈ మైనింగ్‌లో ఏ-1 అని, వైసీపీ నాయకులు పేర్నేటి శ్యాంప్రసాద్‌రెడ్డి ఏ-2 అని ఆరోపించారు. ఇప్పటివరకు వీరు దోచుకున్న అక్రమ సొమ్మునంతా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మైన్ వర్కింగ్ పార్టనర్ విద్యాకిరణ్ మాట్లాడుతూ తాను నాలుగు రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నానని, ఇంతటి ఘోరమైన పరిస్థితులను ఎక్కడా చూడలేదన్నారు. తమ మైన్‌లోకి అక్రమంగా ప్రవేశించి దోపిడీ జరుగుతుంటే ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. తన మైన్ తనకు దక్కకుంటే ఆత్మహత్యే శరణమని ఆవేదన చెందారు.